close

తాజా వార్తలు

ఓటు యంత్రం... కావాలి దుర్భేద్యం 

సందేహాలకు అతీతంగా ఈవీఎంలు

కేవలం చట్టాలు, ధర్మపన్నాలు సుపరిపాలనను తీసుకురాలేవు. నాయకులు, ప్రజా ప్రతినిధుల్లో నిజాయతీ లేనిదే ప్రజాస్వామ్యం వర్ధిల్లజాలదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో వెల్లివిరిసిన నైతిక విలువలు క్రమక్రమంగా పలచబడి, పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించడం, బ్యాలట్‌ పెట్టెలు ఎత్తుకుపోవడం, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలు పెచ్చరిల్లాయి. వీటిని నివారించి ఎన్నికల ప్రక్రియను పరిపుష్టం చేయాలని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టినా, వాటిని కూడా హ్యాక్‌ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయవచ్చన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఎన్నికల్లో ఓడిన పార్టీలు ఈ విధంగా యాగీ చేయడం, అధికారంలోకి రాగానే మిన్నకుండిపోవడం షరా మామూలైపోయింది. కొన్ని రోజుల క్రితం అమెరికా నుంచి సయ్యద్‌ షూజా అనే ముసుగు వీరుడు స్కైప్‌ ద్వారా లండన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈవీఎంలలో తిరకాసు చేయడం ద్వారానే 2014 ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ గెలిచిందని ఆరోపించడంతో ఈవీఎంల గురించి మళ్ళీ అనుమానాలు రేగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తాయి.

నేడు ప్రపంచంలో 120 ప్రజాస్వామ్య దేశాలు ఉండగా, వాటిలో 25 దేశాలే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను చేపట్టడమేమిటి? ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌, స్మార్ట్‌ ఫోన్లు, అంతర్జాలం, డిజిటల్‌ సాధనాలను వాడే సంపన్న దేశాలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ నుంచి మళ్ళీ బ్యాలట్‌ పత్రాలకు మారడమేమిటి? ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎంలలో) ఓటర్ల తీర్పును గోల్‌మాల్‌ చేయవచ్చునని ఆ దేశాలు భావిస్తున్నాయా? హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు వేమూరు హరిప్రసాద్‌కూ ఇలాంటి అనుమానాలే వచ్చాయి. 2009లో ఒక వ్యక్తి, ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఓ ఈవీఎంను తస్కరించి హరిప్రసాద్‌ చేతుల్లో పెట్టాడు. తరవాత ఆయన బృందం ఈవీఎంలలో తిరకాసు చేయవచ్చునని నిరూపించే వీడియోను తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. 2010లో ముంబయి పోలీసులు ప్రసాద్‌ను అరెస్టుచేసి ఈవీఎంను ఎలా సంపాదించారని పదేపదే ప్రశ్నించి, తరవాత ఆయన్ను వదిలేశారు. అప్పట్లో భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం స్వామి ఈవీఎంల మీద సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు కూడా. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు 2014 ఎన్నికలకు కొన్ని జాగ్రత్తలు చెప్పింది. ఈవీఎంలలో ఓటర్ల తీర్పును తారుమారు చేయకుండా నివారించడానికి వీవీప్యాట్‌ రసీదులను ప్రవేశపెట్టాలని తీర్పు ఇచ్చింది. ఓటు వేసినట్లు ధ్రువీకరించే రసీదును ఇవ్వడాన్ని వీవీప్యాట్‌ అంటారు. ఈ పద్ధతిని దశలవారీగా విస్తరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, 2014 ఎన్నికలకు వాడిన ఈవీఎంలలో కేవలం ఒక్క శాతానికి (20,600 ఈవీఎం యూనిట్లకు) మాత్రమే వీవీప్యాట్‌ను వర్తింపజేశారు. 2014లో కేవలం ఎనిమిది లోక్‌సభా నియోజకవర్గాల్లో, 33 పంజాబ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వీవీప్యాట్‌ ప్రక్రియను చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీవీప్యాట్‌ సక్రమంగా అమలు కాలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఈవీఎంలతో ఇతర దేశాల అనుభవాలను పరిశీలించడం సమయోచితంగా ఉంటుంది.

సంపన్న దేశాల్లోనూ సంశయాలు 
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌కు ఆదరణ తగ్గిపోతుంటే, వర్ధమాన దేశాల్లో అది వేళ్లూనుకోవడం చిత్రమైన పరిణామం. ఈవీఎంలలో తప్పులు దొర్లడం, వాటిలోని సాఫ్ట్‌వేర్‌ తారుమారు కాలేదని తేల్చుకునే వీలు లేకపోవడంతో సంపన్న దేశాలు పాత బ్యాలట్‌ పద్ధతికి మారుతున్నాయి. అమెరికాలో 2012 ఎన్నికల్లో కేవలం 39 శాతం ఓటర్లు ఈవీఎంలను ఉపయోగిస్తే, 56 శాతం ఆప్టికల్‌ స్కానింగ్‌ చేసిన బ్యాలట్‌ పత్రాలను ఉపయోగించారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను అనుమతిస్తున్నాయి. గతంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌తో ప్రయోగాలు చేసిన ఎనిమిది ఐరోపా దేశాల్లో ఆరు మళ్ళీ బ్యాలట్‌ పత్రాలకు మారాయి. కేవలం 13 లక్షల జనాభా కలిగిన ఎస్తోనియాలో ఇంటర్నెట్‌ ద్వారా ఈ-ఓటింగ్‌ చేస్తున్నారు. అంతర్జాలం ద్వారా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను తప్పనిసరి చేస్తూ 2005లో ఎస్తోనియా చట్టం తెచ్చింది. ప్రపంచంలో ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి. జర్మనీ ఇటువంటి చట్టం తీసుకురాకపోవడం వల్ల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆ దేశ ఫెడరల్‌ రాజ్యాంగ కోర్టు నిషేధం విధించింది. ఈవీఎంలలో అవకతవకలు దొర్లలేదని నిర్ధారించే వీలు లేకపోవడం పెద్ద లోపమన్నది. కొన్ని అమెరికా రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను సర్వర్‌కు అనుసంధానించి ఇంటర్నెట్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. కానీ ఈ పద్ధతి సైబర్‌ దాడులకు లోనవుతుందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా ఎన్నికల ప్రక్రియను రష్యన్‌ గూఢచారులు ప్రభావితం చేశారని గుర్తుచేస్తున్నారు. అమెరికాలో పోలింగ్‌ ఎన్నడూ 48 శాతానికి మించలేదు. అంతర్జాల ఓటింగ్‌, ఈమెయిల్‌, ఎస్సెమ్మెస్‌ ఓటింగ్‌, టెలిఫోన్‌ ఓటింగ్‌ వంటి ప్రక్రియలతో పోలింగ్‌ శాతాన్ని పెంచాలనే ప్రతిపాదనలు వచ్చినా అవేవీ భద్రమైనవి కావని కొట్టివేస్తున్నారు. అనేకానేక అధునాతన సాంకేతికతలను సృష్టించిన అమెరికా, హ్యాకింగ్‌కు వీల్లేని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ప్రక్రియను చేపట్టలేదా అని ప్రశ్నించుకుంటే, అమెరికన్‌ ఓటరు ఇంకా పాత కాలపు బ్యాలట్‌ పత్రాలనే ఇష్టపడుతున్నాడని సమాధానం వస్తుంది. అదీకాకుండా రెండు పార్టీల వ్యవస్థ వేళ్లూనుకున్న అమెరికాలో చిరకాలంగా స్థిరమైన ఓటు బ్యాంకులు ఉన్నాయి. ఏ పార్టీ ఓటర్ల అభిరుచులేమిటో, భయాలు, ఆసక్తులేమిటో పార్టీలకు, పత్రికలకు ఒక అంచనా ఉంది. దాన్నిబట్టి పార్టీల విధానాలూ, పోలింగ్‌ సరళి నిర్ణయమవుతున్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ-ఓటింగ్‌కు మారితే పార్టీల మూల్యాంకన పద్ధతులన్నీ బుట్టదాఖలై, కొత్త నమూనాలను వెతుక్కోవలసి వస్తుంది. అమెరికా రాజకీయ వ్యవస్థకు కొత్త పద్ధతులంటే భయం. అందుకే ఇంకా పాత కాలపు బ్యాలట్‌ పత్రాలను పట్టుకుని వేలాడుతోంది. కొన్ని రాష్ట్రాలు ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ల ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తున్నా, ఈ-ఓటింగ్‌లో అవకతవకలు జరగొచ్చనే అనుమానం అమెరికాను వదలడం లేదు. ఈవీఎంలలో ఓట్ల నమోదు, లెక్కింపులో పొరపాటు జరిగినా, సాఫ్ట్‌వేర్‌ సమస్య తలెత్తినా దాన్ని ఎలా సరిదిద్దుకుంటామని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఓటు వేసినట్లు ధ్రువీకరించే రసీదు పత్రం (వీవీప్యాట్‌) మాత్రమే ఈ భయాన్ని దూరం చేయగలదు.

ఓటర్ల అనుమానాలను తొలగించడానికి ఎస్తోనియా తనవైన పద్ధతులు అనుసరిస్తోంది. ఆ దేశ ప్రజలందరికీ గుర్తింపు కార్డులిచ్చి అంతర్జాలం ద్వారా ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. అయితే ఎవరైనా ఈ గుర్తింపు కార్డులను గుండుగుత్తగా కైవసం చేసుకుని దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంది కదా అనే ప్రశ్న వస్తుంది. దీన్ని నివారించడం కోసం పోలింగ్‌ తేదీ వరకు ఓటరు రకరకాల పార్టీలకు మార్చిమార్చి ఓటు వేస్తూ, ఆ ఓట్లను పదేపదే ఉపసంహరించుకొంటూ, చివరకు తనకు నచ్చిన పార్టీకి ఓటును ఖరారు చేయవచ్చు. ఈ పద్ధతి కూడా సైబర్‌ దాడులకు తేలిగ్గా లోనవగలదని నిపుణులు అంటున్నారు.

ఆద్యంతం వివాదాలమయం 
అసలు ఎస్తోనియాలో మాదిరిగా అంతర్జాలంతో ఈవీఎంలను అనుసంధానించి ఓటు వేయించడం భద్రమైన పద్ధతి కాదనే మాట నిజం. సైబర్‌ హ్యాకింగ్‌ ముప్పును తప్పించడం కోసం భారత్‌ ఎటువంటి బాహ్య అనుసంధానాలు లేని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వాడుతోంది. భారత్‌ మాదిరిగా బ్రెజిల్‌ కూడా అన్ని ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌ నిర్వహిస్తోంది. ఈ దేశంలో 5.3 లక్షల ఈవీఎంలలో నమోదైన ఓటర్ల తీర్పు పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే ప్రకటితమవుతుంది. 1998లో ఈ-ఓటింగ్‌ను ప్రవేశపెట్టిన వెనెజువెలా 2004లో వీవీప్యాట్‌ల ద్వారా ఓటరు రసీదు పత్రాలను ఇవ్వసాగింది. వెనెజువెలాలో ఈవీఎంలను సరఫరాచేసిన కంపెనీలో వాటాలున్న వ్యక్తి ఎన్నికల్లో గెలుపొందడం వివాదానికి తావిచ్చింది. దాంతో ఆ దేశం ఓటరు బొటనవేలి ముద్రను నమోదు చేయగల టచ్‌ స్క్రీన్‌లతో ఈ-ఓటింగ్‌ నిర్వహించసాగింది.

భారత్‌లోనూ ఈ-ఓటింగ్‌ మొదటి నుంచీ వివాదాలను ఎదుర్కొంది. 2009లో మహారాష్ట్ర, మరి మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ పాత బ్యాలట్‌ పత్రాలను ప్రవేశపెట్టాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎల్‌.కె. అడ్వాణీ డిమాండ్‌ చేయగా, నాటి పాలక పార్టీ కాంగ్రెస్‌ దాన్ని తోసిపుచ్చింది. 2014లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈవీఎంలపై అనుమానాలు రేపడం కాంగ్రెస్‌ వంతయింది. దీనికి ఇతర ప్రతిపక్షాలూ గొంతు కలిపాయి. ప్రస్తుతం ప్రపంచంలో అతి భారీ స్థాయిలో ఈ-ఓటింగ్‌ నిర్వహిస్తున్నది భారతదేశమే. 2001నుంచి భారత్‌ అన్ని ఎన్నికలకు ఈవీఎంలను వాడుతోంది. 2014 ఎన్నికల్లో 55.38 కోట్లమంది ఈవీఎంలను ఉపయోగించి ఓట్లు వేశారు. మన ఈవీఎంలకు ఇంటర్నెట్‌, వైఫై, బ్లూటూత్‌, ఉపగ్రహాలు, వైర్డ్‌ నెట్‌వర్క్‌లతో ఎటువంటి సంబంధమూ ఉండదు కాబట్టి వాటిని ఎవరూ హ్యాక్‌ చేయలేరని ఎన్నికల సంఘం ఢంకా బజాయించి చెబుతోంది. తన వాదనను 2017లో గట్టిగా నిరూపించుకొంది కూడా. ఆ ఏడాది మే నెలలో మహారాష్ట్రలోని పర్వతి నియోజకవర్గంలోని ఈవీఎంలపై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్ష జరపాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈవీఎంలలో తిరకాసు చేసే అవకాశం లేదని హైకోర్టుకు సదరు ల్యాబ్‌ పరీక్షా నివేదికను సమర్పించగా దాన్ని ప్రజలకు విడుదల చేశారు కూడా. తరవాత ఎన్నికల సంఘం ఈవీఎంల హ్యాకింగ్‌ను ఆహ్వానిస్తూ హ్యాకథాన్‌ నిర్వహించినా, ఏ రాజకీయ పార్టీ దానిపై ఆసక్తి చూపలేదు. 2004లో మాజీ మంత్రి జాఫర్‌ షరీఫ్‌ కేసులో ఈవీఎంలు దేశానికి గర్వకారణమని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. డాక్టర్‌ సుబ్రహ్మణ్యం స్వామి పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఓటు రసీదు పత్రాల (వీవీప్యాట్‌) సాయంతో ఈవీఎంలలో మోసాలు జరగకుండా నివారించవచ్చునని 2013లో తీర్మానించింది. ఈ పత్రాలను దశలవారీగా విడుదల చేయాలన్నది. ఏదిఏమైనా సాంకేతికత నానాటికీ మారిపోతున్న దృష్ట్యా ఈవీఎంలు సర్వకాల సర్వావస్థల్లో హ్యాకింగ్‌కు అతీతంగా ఉంటాయనుకోవడం వివేకం కాదు. సాంకేతికతలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను నిరంతరం దుర్భేద్యం చేస్తూ ఉండాలి.

- కైజర్‌ అడపా

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.