close

తాజా వార్తలు

రెక్కలు విప్పి.. రెపరెపలాడాలి!

అటు ఆఫీసు పనులు... ఇటు ఇంటి పనులు. ఈ ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో పిల్లలు ‘అది కావాలి, ఇది కావాలి’ అని తమను వేధించకుండా ఉంటే చాలని అనుకోని తల్లిదండ్రులు ఉండరు. వాళ్లను టీవీ ముందు కూర్చోబెట్టో... ఫోనో, ట్యాబో చేతికిచ్చేసో తమ పనులు కానిచ్చేవారు ఎందరో. ఎప్పుడో ఒకసారయితే ఫర్వాలేదు గానీ రోజూ అలాగే చేస్తుంటే మాత్రం పిల్లలను చేజేతులా చెడగొట్టుకుంటున్నట్టే. ఎందుకంటే చిన్నారులకు ఆరు బయట ఆటలు అతి ముఖ్యం. ఇవి కండరాలు, ఎముకలు బలోపేతం కావటానికే కాదు... భావోద్వేగాల నియంత్రణకు, తోటివాళ్లతో స్నేహానుబంధాలకు కూడా తోడ్పడతాయి!

ఎంతలో ఎంత మార్పు? ఒకప్పుడు- ‘పిల్లలు బయటకు వెళ్లి చాలాసేపైంది. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో’ అని వెతుక్కుంటూ వెళ్లి బలవంతాన ఇంటికి తీసుకొచ్చేవారు. మరిప్పుడో?- పిల్లలు పంజరాల్లో చిలుకలే. పొద్దున్నే బడికి పరుగులు... ఇంటికొచ్చాక ట్యూషన్లు, హోంవర్కులు. అనంతరం టీవీ లేదంటే ఫోన్లు, ట్యాబ్‌లలో వీడియోగేమ్స్‌. ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. దాంతో ఆరుబయట ఆడుకునే సమయం తగ్గిపోయింది. చిన్న కుటుంబాలు, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరగడం, ఆరుబయట ఆడుకోవటానికి సదుపాయాలు లేకపోవడం, భద్రత కొరవడడం వంటివన్నీ పిల్లలను బ్రాయిలర్‌ కోళ్లుగా మార్చేస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదని, దీనివల్ల పిల్లల శారీరక, మానసిక వికాసం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేనా! మున్ముందు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటివి త్వరగా ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదనీ హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని కాస్త గడప దాటనిచ్చి... రెక్కలు విప్పుకొని ‘ఎగిరేలా’ చూడటం తక్షణ కర్తవ్యం.

ఆటలాడితే...! 

* విటమిన్‌ డి లోపం, కుంగుబాటు, ఏడీహెచ్‌డీ వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది.
* ఊబకాయం.. అలాగే దాంతో ముడిపడిన అధిక రక్తపోటు, మధుమేహం వంటివి తగ్గుముఖం పడతాయి. కంటి చూపు.. ముఖ్యంగా దూరదృష్టి మెరుగవుతుంది.
* సోమరితనం దూరమై ఉత్సాహం, చురుకుదనం పుంజుకుంటాయి. శారీరక పటుత్వంతో పాటు ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.
* భావోద్వేగాల నియంత్రణపై పట్టు లభిస్తుంది.  నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి అలవడతాయి. చదువులతో ముంచుకొచ్చే ఒత్తిడి మటుమాయం అవుతుంది. 

బయటి ఆటలెందుకు?

పచ్చటి ప్రకృతిని చూడగానే ఎక్కడలేని హుషారు పుట్టుకొస్తుంది. ఇక నలుగురితో కలిసి ఆడుతూ పాడుతూ గెంతుతుంటే శ్రమ తెలియకుండానే వ్యాయామం అవుతుంది. దీంతో కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పెరిగి ప్రతి కణమూ ఆరోగ్యంతో తొణికిసలాడుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోగలుగుతారు. ఇక డిజిటల్‌ పరికరాలతో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఏకాగ్రతను దెబ్బతీసే అతిచురుకుదనం(ఏడీహెచ్‌డీ), విటమిన్‌డి లోపం, కుంగుబాటు సమస్యలు ఎక్కువని నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ ఫెడరేషన్‌ అధ్యయనం పేర్కొంది. అలానే ఆరుబయట గడిపే పిల్లలకు హ్రస్వదృష్టి ముప్పు తగ్గుతున్నట్టు, ఒకవేళ ముందే ఈ సమస్య ఉంటే అది మరింత పెరగదని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆఫ్తమాలజీ పరిశోధనలో వెల్లడైంది. నలుగురితో ఆడుకోవటం వల్ల కలివిడితనం, నాయకత్వ లక్షణాలు, విపరీత పరిస్థితులను ఎదుర్కోవటం వంటివి అబ్బుతాయి. ఇక ప్రస్తుతం పిల్లలంతా చదువుల ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్య నుంచి వారిని సులువుగా బయటపడేసేందుకు ఆటలు సాయపడతాయి. 

సురక్షిత ప్రాంతం ఎంచుకోవాలి

పిల్లలకు ఉత్సుకత ఎక్కువ. ముందూ వెనకా చూసుకోకుండా పరుగెత్తుతుంటారు. కాబట్టి పిల్లలు ఆడుకోవటానికి సురక్షితమైన ప్రాంతాన్నే ఎంచుకోవాలి. పెరట్లోగానీ, వాకిట్లోగానీ ఆడుకుంటుంటే ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా చూసుకోవాలి. పట్టణాల్లో చాలామంది అపార్ట్‌మెంట్లలోనే నివసిస్తుంటారు. కొన్నింటిలో ప్రత్యేక ఆటస్థలం ఉండకపోవచ్చు. కాబట్టి చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. వీలైతే పార్కులకు తీసుకెళ్లొచ్చు.

ఇష్టమైన ఆట వస్తువులు కొనివ్వాలి

పిల్లలకు క్రీడలపై ఇష్టాన్ని పెంచాలంటే... సందర్భాన్ని బట్టి క్రీడా పరికరాలను కానుకలుగా కొనివ్వండి. చిన్న పిల్లలైతే బంతి, బ్యాట్‌, బొమ్మ సైకిల్‌ వంటివి ఇవ్వొచ్చు. కాస్త పెద్ద పిల్లలైతే స్కిప్పింగ్‌ తాడు, రింగ్‌బాల్‌, షటిల్‌ బ్యాట్‌లు, కాక్‌లు, టెన్నికాయిట్‌ రింగ్‌ వంటివి కొనివ్వచ్చు. ఇవి అందుబాటులో ఉండటం వల్ల వాటిని వినియోగించడంపై ఆసక్తి పెంచుకుంటారు. ఉత్సాహంగానూ ఆడగలుగుతారు. వారికి శ్రమించటం అలవడుతుంది. వీటితో వ్యాయామం ఒక్కటే కాదు.. ఆటలో ఎత్తుగడలు, ఎదుటివారిని అంచనా వేసే శక్తి కూడా మెరుగవుతాయి. అంటే...తాడు, బంతి ఎలా కిందికి వస్తాయి? ఎప్పుడు గెంతాలి? ఎప్పుడు పట్టుకోవాలి వంటివాటిని అంచనా వేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. బృందంగా ఆడే ఆటలైతే సమష్టితత్వం బోధపడుతుంది.

క్రీడలను చూపించండి...

అప్పుడప్పుడూ క్రీడా ఛానెళ్లనూ చూసేలా ప్రోత్సహించండి. ఏయే టోర్నమెంట్లు ఎప్పుడు జరుగుతాయో చెబితే పిల్లలు వాటిని వీక్షించడానికి మొగ్గుచూపొచ్చు. అలాగే ధోనీ, తెందూల్కర్‌, కోహ్లీ, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, సింధు వంటి ప్రముఖ క్రీడాకారుల గురించి చెప్పటం ద్వారా మరింత ఆసక్తి పుట్టేలా చేయొచ్చు. వీలైతే దగ్గర్లో క్రికెట్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లేవైనా జరుగుతుంటే తీసుకెళ్లి చూపిస్తుంటే...వారు ఆటలపై మొగ్గు చూపుతారు.

క్రీడా శిబిరాల్లో చేర్పించండి

సెలవుల్లో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, ఈత, జిమ్నాస్టిక్స్‌, స్కేటింగ్‌ వంటి ఆటలను నేర్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా శిబిరాలు ఏర్పాటు అవుతాయి. కాస్త ఖర్చయినా పిల్లలను వీటిల్లో చేర్పించటం మంచిది. మంచి శిక్షకుడి సమక్షంలో తర్ఫీదు తీసుకుంటే ఆయా క్రీడల్లో నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు వాటిపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.

ప్రయోజనాలు అర్థమయ్యేలా...

చాలామంది పిల్లలు ఫోన్లు, టీవీల వంటివి అందుబాటులో ఉండటం వల్ల తేలికగా వాటి వైపు మొగ్గుచూపుతుంటారు. మీ పిల్లలు కూడా అలానే ఎప్పుడూ ఇంట్లో కూర్చోవడానికే పరిమితం అవుతుంటే వారికి ఆటల్లో ఉన్న ఆనందాన్ని, వాటివల్ల కలిగే లాభాల్ని అర్థమయ్యేలా వివరించాలి. రోజుకో గంటైనా మీకు దగ్గర్లో ఉన్న మైదానానికో, పార్కుకో తీసుకెళ్లాలి.

స్నేహితులను ఇంటికి పిలిపించండి

ఒక్కరే ఆడుకోవటమంటే ఎవరికైనా విసుగే. అందుకే అప్పుడప్పుడూ మీ పిల్లల స్నేహితులను ఇంటికి పిలవండి. వారితో కలిసి దాగుడు మూతలు, తాడాట, బంతాట వంటివి ఆడుకునేలా ప్రోత్సహించొచ్చు. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా ఆటల పోటీలు కూడా పెట్టుకోవచ్చు. అనుబంధం కూడా బలపడుతుంది.  పోటీలతో మనసులో గెలవాలనే కాంక్ష పుట్టుకొస్తుంది. ప్రస్తుతం అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల వంటి చోట్ల రాళ్లు ఎక్కటం, ఈత కొట్టడం, రోలర్‌ స్కేటింగ్‌ వంటి సదుపాయాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఇలాంటివి పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి.

-పి.భాగ్యలక్ష్మి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.