close

తాజా వార్తలు

మొబలైపోకండి

వేలు పోసికొన్న స్మార్ట్‌ఫోన్‌..మెగాపిక్సళ్ల కెమెరా.. మైక్రోఫోన్‌..మీపైనే ఫోకస్‌ చేస్తున్నాయి తెలుసా? 
మీకు స్కెచ్‌ వేస్తున్నాయ్‌! మీకే తెలియకుండా!! 
నిజమా? అనే సందేహం అక్కర్లేదు! 
యాప్‌ల మాయాజాలంతో హ్యాకర్లే కాదు..  
నెట్టింట్లో పలు యాప్‌ నిర్వాహకులు రాస్తున్న కొత్త కథ!  
దీని వెనకున్న స్క్రీన్‌ప్లే గురించి తెలుసుకోరా? జాగ్రత్త పడరా? 

* సందేహం వస్తే గూగుల్‌ సెర్చ్‌.. సమాచారం కోసం గూగుల్‌ సెర్చ్‌.. ఇలా గూగుల్‌ గడప తొక్కని రోజంటూ ఉండదు. మీరెన్ని సార్లు వచ్చారు? ఏమేమి వెతికారు? మీ ఆసక్తులేంటి?.. ఇవన్నీ గూగుల్‌ చూస్తుందనేది తెలియంది కాదు. సెర్చ్‌ చేసిన వాటికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడమే అందుకు నిదర్శనం. ఉదాహరణకు మీరో ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ గురించి వెతికితే ఆ ఫోన్‌ ఆన్‌లైన్‌ అంగళ్లలో ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుపుతూ యాడ్స్‌ రావడం.
* జీపీఎస్‌.. నేటి తరానికి ఇదో దిక్సూచి. యాప్‌ ఏది వాడాలన్నా దీన్ని ఎనేబుల్‌ చేయాల్సిందే. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం.. ఎలా వెళ్తున్నాం.. ఎంత సమయం గడుపుతున్నాం.. ఇలా అన్ని వివరాల్ని ట్రాక్‌ చేస్తుంది. అంతే.. క్షణాల్లో మీరు ఉన్న ప్రాంతంలో బస చేసేందుకు అనువైన హోటళ్ల ప్రకటనలు కనిపిస్తాయ్‌. ఫుడ్‌కోర్టుల వివరాలు వస్తాయ్‌. ఉదాహరణకు.. అనుకోకుండా హైదరాబాద్‌ వచ్చారు. ఎక్కడ బస చేయాలో తెలియక ట్రావెల్‌ లేదా టూరిజం యాప్‌లను ఓపెన్‌ చేస్తే క్షణాల్లో అక్కడ అందుబాటులో ఉన్న హోటళ్ల జాబితా సిద్ధంగా ఉంటుంది.
*ఈ రెండు సందర్భాల్లోనూ ఎంటర్‌ చేసిన కీవర్డులు, అనుమతించిన ఆప్షన్ల ద్వారా ప్రైవసీని కోల్పోతారు. వాడేది ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఓఎస్‌ ఏదైనా ఏదొక యూజర్‌ ఐడీతో ఫోన్‌లో లాగిన్‌ అయ్యి కొన్ని అనుమతులు ఇవ్వడం ద్వారా మన కదలికల్ని, అభిరుచులు, ఆలోచనల్ని తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. ఇది చాలావరకు యూజర్‌కి తెలిసే జరుగుతుంది. కానీ, మీ ప్రమేయం లేకుండా మీ డేటా, ప్రైవసీని ఇతరులు యాక్సెస్‌ చేస్తే! ఫోన్‌లోని కెమెరాని, మైక్రోఫోన్‌ని కంట్రోల్‌ చేయగలిగితే!
* యాపిల్‌కి చెందిన ‘ఫేస్‌టైమ్‌’లో బగ్‌. అదేం చేసిందంటే.. గ్రూపు వీడియో కాలింగ్‌లో ఉన్న ఫోన్లలోని మైక్రోఫోన్‌లు, కెమెరాల్ని కంట్రోల్‌ చేయగలగడం. దీంతో గ్రూపు కాల్‌లో ఉన్నవారు ఎవరైనా ఇతరుల ప్రమేయం లేకుండా మైక్రోఫోన్‌, ముందు కెమెరాలను యాక్టివేట్‌ చేసి మాటలు వినొచ్చు. కెమెరాతో చూడొచ్చు. కాల్‌ కట్‌ అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఈ నియంత్రణ సాధ్యమయ్యే ఆప్షన్‌ అది. ఈ బగ్‌ని గుర్తించిన వెంటనే యాపిల్‌ ఫేస్‌టైమ్‌లోని గ్రూపు కాలింగ్‌ని డిసేబుల్‌ చేసి బగ్‌ని తొలగించింది.
* ఇదే నెల్లో.. ప్రముఖ సెక్యూరిటీ సంస్థ మరో విషయాన్ని వెల్లడించింది. పేరొందిన ట్రావెల్‌, టూరిజం యాప్‌లు యూజర్ల ఫోన్‌ వాడకాన్ని రహస్యంగా మానిటర్‌ చేస్తున్నాయట. నిర్ణీత సమయంలో ‘సెషన్స్‌’ రూపంలో యూజర్ల ఫోన్‌ వాడకాన్ని రికార్డు చేస్తున్నాయి. ఆ డేటాని కొన్ని సంస్థలు విశ్లేషించి యూజర్‌ ఏయే యాప్‌లను ఎంత సమయం వాడుతున్నారు? ఎందుకు వాడుతున్నారో తెలుసుకుని.. ఆయా యాప్‌ల సంస్థలకు నివేదికల్ని సమర్పిస్తున్నాయి. యాప్‌లను మరింత మెరుగు పరుచుకునేందుకు యూజర్‌ అనుమతి లేకుండా ఫోన్‌లను హ్యాక్‌ చేస్తున్నారు. కొన్ని యాప్‌ల సాయంతో క్రెడిట్‌ కార్డు, పాస్‌పోర్టుల వివరాల్ని సేకరిస్తున్నారట.
* జీపీఎస్‌ని వాడుకుని యూజర్‌ ప్రైవసీ కొల్లగొట్టడం పాత పద్ధతి. ఇప్పుడు మార్కెట్‌లో సందడి చేస్తున్న ఫోన్లలో యాక్సిలెరో మీటర్‌, మాగ్నెటో మీటర్‌, గైరో స్కోప్‌... లాంటి సెన్సర్లను బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేస్తున్నారు. వాటిని రిమోట్‌ల్లా వాడుకుని యాప్‌ల నిర్వాహకులు ఫోన్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటున్నారు. ఒక్క ఫోన్‌లోనే కాదు. సెన్సర్లతో ల్యాపీలు, ట్యాబ్‌లను కూడా ట్రాక్‌ చేస్తున్నారు. 

* ఇలా నిత్య నూతనంగా యూజర్‌ ప్రైవసీని దొంగిలించేందుకు మార్గాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. యూజర్‌ చేయాల్సిందల్లా నిత్యం సెక్యూరిటీపై అవగాహన పెంచుకుంటూ అప్రమత్తం కావడమే. 
ఏదైనా స్క్రీన్‌షాట్‌ తీయాలంటే ఫోన్‌ మోడల్‌ని బట్టి రెండు కీలను కలిపి నొక్కుతాం. స్క్రీన్‌షాట్‌ వస్తుంది. దాన్ని షేర్‌ చేస్తాం. కానీ, హ్యాకర్లు  ప్రత్యేక యాప్‌లను రిమోట్‌లా వాడుకుని నిర్ణీత సమయానికి స్క్రీన్‌షాట్స్‌ తీసుకుని విశ్లేషిస్తారు. స్క్రీన్‌షాట్‌లు, కీ స్ట్రోక్స్‌తో బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డు నెంబర్లు, ఇతర లాగిన్‌ వివరాల్ని సులభంగా విశ్లేషిస్తారు.

* మరిన్ని సెక్యూరిటీ చిట్కాలకు..  
www.isea.gov.in 
www.infosecawareness.in

విండోస్‌, లినక్స్‌లోనే కాదు. ఐఓఎస్‌ మ్యాక్‌ల్లోనూ దాడికి దిగేలా క్లిష్టమైన మాల్వేర్‌లూ పుట్టుకొస్తున్నాయి. ‘మోక్స్‌’ కూడా అలాంటిదే. ఈ మాల్వేర్‌ని మ్యాక్‌ కంప్యూటర్‌ల నుంచి డేటాని దొంగిలించడానికి వాడుతున్నారు. స్క్రీన్‌షాట్‌లను తీయడం, కీ స్ట్రోక్స్‌ని రికార్డు చేయడం, కెమెరాల్ని వాడుకుని వీడియోలు తీయడం.. మైక్రోఫోన్‌లతో మాటల్ని రికార్డు చేయడం వీటి పని. ఇంటర్నల్‌ స్టోరేజ్‌లోని ఫైల్స్‌ని డిలీట్‌ చేస్తాయి కూడా. అవసరమైతే కంప్యూటర్‌ని రిమోట్‌ యాక్సెస్‌లో నియంత్రించేందుకు ఇంటర్ఫేస్‌లా మారతాయి. 

‘ర్యాట్‌’ని వదులుతున్నారు

ఫోన్‌ కెమెరాల మెగాపిక్సల్స్‌ క్వాలిటీ డీఎస్‌ఎల్‌ఆర్‌కి సరితూగుతోంది. జ్ఞాపకాల్ని భద్రం చేసుకోవడానికి ఓ సాధనంగా మారుతున్న కెమెరా కంటినే కంట్రోల్‌ చేసేందుకు ‘ర్యాట్‌’ని వదులుతున్నారు. మీ ప్రమేయం లేకుండా చేరేదే ఈ ‘రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌’. ఒక్కసారి ఫోన్‌లోకి చేరిందంటే ర్యాట్‌ రిమోట్‌లా పని చేసుకుపోతుంది. హ్యాకర్లు ఎప్పుడైనా రిమోట్‌ని యాక్టివేట్‌ చేసి కెమెరాని నియంత్రించొచ్చు. ల్యాపీల్లో అయితే వెబ్‌ కెమెరాని కంట్రోల్‌లోకి తెచ్చుకుని విజువల్స్‌ని రికార్డు చేస్తున్నారు. యూజర్లకు అనుమానం రాకుండా వెబ్‌ కెమెరా దగ్గరున్న ఇండికేటర్‌ లైట్‌ని స్విచ్‌ఆఫ్‌ చేస్తారు. దీంతో రికార్డు చేస్తున్న విషయం యూజర్‌కి తెలియదు. ఫోన్‌లో అయితే రిమోట్‌ ట్రోజన్స్‌ని సెకన్లలో ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. ఓ 30 సెకన్లు మీ ఫోన్‌ వేరొకరి చేతికెళ్తే చాలు. పని అయిపోనట్టే. అది మొదలు మీ ఫోన్‌ని ఎప్పుడంటే అప్పుడు ట్రాక్‌ చేయొచ్చు. మాల్వేర్‌లు, రాన్‌సమ్‌వేర్‌లు ఇదే కోవలోకి వస్తాయి. 

ఇవో రెండు మార్గాలు..

యూజర్‌ ప్రైవసీని పసిగట్టేందుకు పలు కంపెనీలు, హ్యాకర్లు రెండు మార్గాల్ని వాడతారు. ‘కీవర్డ్‌లు’, ‘బగ్స్‌’. గూగుల్‌లో వెతికేందుకు టాపిక్‌ని ఎంటర్‌ చేస్తాం. అవే కీవర్డ్‌లు. ఉదాహరణకు ఏసీ కొందామని ఏదైనా కంపెనీ పేరుతో వెతికితే చాలు. ఆ కీవర్డ్‌లను గూగుల్‌ రికార్డు చేసి సంబంధింత అడ్వటైజర్స్‌కి చేరవేస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన ఏసీల ప్రకటనలు మీ వాల్‌పైకి వచ్చేస్తాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో కావాల్సిన వాటిని వెతికితే చాలు. మరుక్షణం నుంచి మీరు వెతికిన వాటికి సంబంధించిన ఆఫర్లు హోం పేజీలోకి వచ్చేస్తాయి. ఇలా ఏ వెబ్‌సైట్‌లో అయినా కీవర్డ్‌లను ఎంటర్‌ చేస్తే వారికి చేరిపోయే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ఉంటుంది.  బగ్స్‌ విషయానికొస్తే అప్లికేషన్స్‌లోని లోపాలతో బగ్‌ క్రియేట్‌ అవ్వడం. యాపిల్‌ ఫేస్‌టైమ్‌ గ్రూపు కాలింగ్‌లో చేరిన బగ్‌ మాదిరి. అదనంగా ఫేస్‌టైమ్‌లో గ్రూపు కాలింగ్‌ని ప్రవేశపెట్టే ప్రయత్నంలో యాపిల్‌ డెవలపర్స్‌ చేసిన పొరపాటులతో బగ్‌ క్రియేట్‌ అయ్యింది. అధిక సెక్యూరిటీ కలిగిన సంస్థ అనుకునే యాపిల్‌ తీసుకొచ్చే యాప్‌లలో బగ్స్‌ ఉంటే.. మనం ఎక్కువగా వాడేవన్నీ థర్డ్‌పార్టీ డెవలపర్స్‌ చేసే యాప్‌లే. వాటిల్లో యూజర్‌ డేటాని తీసుకోవడానికి బిల్ట్‌ఇన్‌గా ట్రాకర్స్‌ని నిక్షిప్తం చేయరని గ్యారెంటీ ఏంటి?

అన్ని అనుమతులు దేనికి?

యాప్‌ ఏదైనా ఇన్‌స్టాల్‌ చేస్తున్నప్పుడు మీ అనుమతిని కోరుతుంది. కెమెరా, మైక్రోఫోన్‌, స్టోరేజ్‌, జీపీఎస్‌, అడ్రస్‌బుక్‌... ఇలా అన్నింటి యాక్సెస్‌ కోరుతూ పర్మిషన్స్‌ అడుగుతుంది. యాప్‌ వాడాలనే కుతూహలంతో అన్నింటికీ ఒకే చెప్పేస్తాంగానీ.. ఎందుకు ఇన్ని పర్మిషన్స్‌ అడుగుతోందని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే.. యాప్‌ని తయారు చేసిన సంస్థ మీరెలా యాప్‌ని వాడుతున్నారో.. ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి. ఎప్పుడైతే అన్నింటికీ అనుమతి ఇచ్చారో అది మొదలు.. మీ ఫోన్‌ని డెవలపర్స్‌ రిమోట్‌ యాక్సెస్‌ చేయొచ్చు. వాడకాన్ని తెలుసుకునేందుకు డిస్‌ప్లేని రికార్డు చేస్తారు.. మైక్రోఫోన్‌ని ఎనేబుల్‌ చేస్తారు.. మెసేజ్‌లను చదువుతారు.. ఏమేమి అనుమతులు ఇచ్చారో అవన్నీ యాక్సెస్‌ చేస్తూ డేటాని విశ్లేషిస్తారు. ఇవేవీ యూజర్‌కి తెలిసే అవకాశమే ఉండదు. కొన్ని ట్రావెల్‌ కంపెనీ యాప్‌లు యూజర్ల యాక్టివిటీని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ ఏయే సైట్‌లు, ఇతర యాప్స్‌ వాడుతున్నారో తెలుసుకుంటున్నాయి. అందుకు తగిన మార్పుల్ని తమ యాప్‌ల్లో కొత్త ఫీచర్స్‌ని జత చేస్తాయి. ఎయిర్‌లైన్స్‌ యాప్‌లు కొన్నయితే టికెట్టు బుకింగ్‌ మొదలు.. మీతోనే ప్రయాణం. ఎక్కడెక్కడికి తిరుగుతున్నారు? కొన్ని సందర్భాల్లో ట్రావెల్‌ ప్లాన్‌ చేసుకునేందుకు మైక్రోఫోన్‌లు, వెనక కెమెరాని ఎనేబుల్‌ చేస్తున్నాయి. ఇక కొన్ని యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసే క్రమంలో ఎలాంటి పర్మిషన్స్‌ అడగవు. తర్వాత అప్‌డేట్‌ పేరుతో అనుమతులు కోరుతూ ఇన్‌స్టాల్‌ అవుతాయి. 

జాగ్రత్త పడడం ఎలా?

* నెట్టింట్లో ఏది టైప్‌ చేస్తున్నా స్పృహతో ఉండాలి. ఎవరు గుర్తుపెట్టుకుంటారు అనుకోవద్దు. కీవర్డ్‌లను ట్రాక్‌ చేసేందుకు నిత్యం ఒక వ్యవస్థ పని చేస్తుంది. 
* బ్యాంకింగ్‌ వ్యవహారాలు చేసేటప్పుడే నెట్టింట్లో సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం. సింపుల్‌ సెక్యూరిటీ చిట్కా ఏంటంటే.. బ్యాంకింగ్‌కి వాడే ఫోన్‌ నెంబర్‌ని స్మార్ట్‌ ఫోన్‌లో వాడకుండా ఉండడం. నెట్‌ సదుపాయం లేని బేసిక్‌ ఫోన్‌లో వాడడం మంచిది. అప్పుడు ఓటీపీలు, ఇతర బ్యాంకింగ్‌ మెసేజ్‌లు ఇతరులకు చిక్కవు.  
* కంప్యూటర్‌లో డేటా లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని వాడుకుని ప్రకటనలు వచ్చేలా చేసే విధానాన్ని అడ్డుకోవాలంటే ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే బ్రౌజర్లను వాడడం మంచిది. అలా కాకుంటే.. మీ డేటాని బ్రౌజర్లు, సెర్చింజన్‌లలో తక్కువ వాడడం మంచిది. 
* మాల్వేర్‌లు, రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌లు క్షణాల్లో చేరతాయి. అందుకే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. యాప్‌ స్టోర్‌లోకి వెళ్లే ఇన్‌స్టాల్‌ చేయండి. కొన్ని యాప్‌లను అధికారిక వెబ్సైట్‌ల్లోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దీంతో నకిలీ యాప్‌లకు చెక్‌ పెట్టొచ్చు. ఉదాహరణకు ఏదైనా బ్యాంకింగ్‌ యాప్‌ని ప్రయత్నించాలనుకుంటే మీరు వాడుతున్న బ్యాంకు అధికారిక సైట్‌లోకి వెళ్లి దాన్నుంచే యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే మంచిది. 
* ఇతరులు పంపిన ఏపీకే ఫైల్స్‌ని వాడి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయొద్దు. ఏపీకే ఫైల్స్‌లో మాల్వేర్‌లు, ట్రోజన్స్‌ని నిక్షిప్తం చేయడం చాలా సులభం. 
* యాప్‌లను అప్‌డేట్‌ చేసిన ప్రతిసారీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ పర్మిషన్స్‌ని చెక్‌ చేయండి. 
* ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్న యాంటీ మాల్వేర్‌లు, డెస్క్‌టాప్‌ ఫైర్‌వాల్స్‌ వాడడం సురక్షితం.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.