close

తాజా వార్తలు

పిల్లల పరీక్షలకు ‘అష్టాంగ’ యోగ!

పరీక్షలొస్తున్నాయనగానే పిల్లల కన్నా పెద్దలకే భయం పట్టుకుంటుంది. పట్టుమని పది నిమిషాలైనా కుదురుగా నిలవని గడుగ్గాయిలను పుస్తకాల ముందు కూర్చో బెట్టడం... ఇక పరీక్షల పేరు వింటేనే బెంబేలెత్తిపోయే ‘చిచ్చరపిడుగు’లకు ధైర్యం నూరిపోయడం అంటే సవాలే. మరి దాన్నెలా అధిగమించాలో చూద్దామా!

పిల్లల్ని పరీక్షలకు సన్నద్ధం చేయడం అనేది చిన్నప్పట్నుంచే అర్థమయ్యేలా, నెమ్మదిగా నేర్పించాలి. అప్పుడే పెద్దయ్యాక సమస్య ఉండదు. తమకు తాముగా చదువుకునే నైపుణ్యం అలవడుతుంది. కొందరు చెప్పిన మాట వినరు. మరికొందరు ఎదురు తిరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలనేది ఆయా సమయ సందర్భాలను బట్టి నిర్ణయించుకోవటం ఎంతైనా అవసరం.

1 వాయిదా పద్ధతొద్దు

ఏ రోజు పని ఆరోజు ముగించేస్తే మర్నాటికి భారం తగ్గుతుంది. ఇది చదువులకూ వర్తిస్తుంది. తెల్లారితే పరీక్షలు. ఇప్పుడు పుస్తకాలు ముందేసుకుంటే ఏం లాభం? చాలామంది చేసే తప్పు ఇది. దీంతో ఒత్తిడి, ఆందోళన తారా స్థాయికి చేరుకుంటాయి. పరీక్షల్లో రాణించాలంటే ముందు నుంచే సిద్ధంకావాలి. కాబట్టి చదువుల విషయంలో వాయిదా పద్ధతి వద్దు. కొందరు పిల్లలు తరువాత చదువుకుంటామని మారాం చేయొచ్చు. అలాంటి ‘హామీ’లకు తలొగ్గడం తగదు. ప్రతిరోజూ పిల్లలు ఎంతో కొంత చదువుకునేలా చూడాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కనీసం పరీక్షలకు రెండు, మూడు వారాల ముందు నుంచైనా సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించాలి.

2 అతిగా తలదూర్చొద్దు

చదువుల్లో కొందరికి పెద్దవాళ్ల సాయం అవసరం కావొచ్చు. మాటిమాటికీ సందేహాలు అడగొచ్చు. అలాంటప్పుడు ఎంత పని ఉన్నా సాయం చేయాలి. అప్పుడే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. అయితే కొందరు తమకు తాముగానే చదువుకోవడానికి ఇష్టపడొచ్చు. గైడ్‌లు, స్కూల్‌ నోట్స్‌ సాయంతో ఆయా విషయాలను తెలుసుకోవటానికి ఉత్సుకత చూపుతుండొచ్చు. కాబట్టి పిల్లల స్వభావాలను బట్టి మనమూ వ్యవహరించాలి. అతిగా, అనవసరంగా పిల్లల చదువుల్లో తల దూరిస్తే ఇటు పెద్దవాళ్ల పద్ధతులను పాటించలేక, అటు తమ విధానాన్ని అనుసరించలేక సతమతం కావొచ్చు. పెద్దపిల్లల్లో కొందరికి తోటివారితో కలిసి చదువుకోవటం ఇష్టం ఉండొచ్చు. ముఖ్యంగా కష్టమైన సబ్జెక్టులను కలిసి సాధన చేస్తే త్వరగా అర్థం కావొచ్చు. కాబట్టి ఎప్పుడైనా స్నేహితుల ఇంటికి వెళ్లి చదువుకుంటామంటే కాదనొద్దు. లేదా వాళ్లనే రమ్మనండి.

3 ప్రశ్నకు సమాధానం

కేవలం పాఠాలను, ప్రశ్న జవాబులను చదివినంత మాత్రాన సరిపోదు. చదివినవి గుర్తుండాలి. అవి పరీక్ష రాసేటప్పుడు తిరిగి గుర్తుకురావాలి. అందువల్ల చదువుకోవటం పూర్తయ్యాక ఆయా సబ్జెక్టుల్లో అక్కడక్కడా కొన్ని ప్రశ్నలను ఎంచుకొని పిల్లలను అడగాలి. వాటికి జవాబులు చెప్పేలా ప్రోత్సహించాలి. దీంతో చదువుకున్నవి బాగా గుర్తుండటమే కాదు... ఎక్కడైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకోవటానికి వీలుంటుంది. పరీక్షలకు ఎంతవరకు సన్నద్ధమయ్యామనే విషయం అప్రయత్నంగానే అవగతమవుతుంది.

4 సమయానికి తగు సబ్జెక్టు

పిల్లలు బాగానే చదవొచ్చు. కానీ ఏది ముందుగా చదవాలనేది సరిగా నిర్ణయించుకోలేకపోవచ్చు. కాబట్టి పరీక్షల తేదీలను బట్టి ఆయా సబ్జెక్టులను వరుస క్రమంలో చదివేలా చూడాలి. లేదా కష్టమైన సబ్జెక్టులను ముందుగా, తేలికైనవి తర్వాత చదవమని చెప్పొచ్చు. చిన్న పిల్లలు రోజుకు రెండు, మూడు గంటలు చదివితే చాలు. కాస్త పెద్ద పిల్లలకైతే నాలుగైదు గంటలు సరిపోవచ్చు. ఆయా సబ్జెక్టులకు కేటాయించాల్సిన సమయాన్ని బట్టి టైం టేబుల్‌ తయారు చేయించి, దాన్ని అనుసరించేలా చూడటం ఉత్తమం. అలాగే తెలుగు, ఇంగ్లిషు, హిందీ పాఠాలను.. గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం పాఠాలను మార్చి మార్చి చదివేలా చేయగలిగితే విసుగు తలెత్తకుండా చూసుకోవచ్చు.

5 పాత ప్రశ్నాపత్రాల సాధన

పెద్ద తరగతుల పిల్లలకు పాత ప్రశ్నాపత్రాల సాధన ఎంతో మేలు చేస్తుంది. పాఠశాల లైబ్రరీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల దగ్గర్నుంచి వీటిని అడిగి తీసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో కనీసం ఒకట్రెండు ప్రశ్నాపత్రాలనైనా నిర్ణీత సమయంలో సాధన చేయిస్తే ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో తెలుస్తుంది. పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలనేదీ అర్థమవుతుంది.

6 తగినంత నిద్ర కీలకం

పిల్లలను కొందరు రాత్రిపూట మరీ ఎక్కువసేపు చదివిస్తుంటారు. తెల్లవారుజామునే నిద్ర లేపి పుస్తకాల ముందు కూర్చోబెడుతుంటారు. ఇది సరికాదు. పిల్లలకు తగినంత నిద్ర అవసరం. రాత్రిపూట కనీసం 8 గంటలసేపైనా నిద్రపోయేలా చూడాలి. లేదంటే  మెదడు చురుకుదనమూ మందగిస్తుంది. దీంతో పరీక్షకు కూర్చున్నప్పుడు చదివిన విషయాలు గుర్తురాక ఇబ్బంది పడతారు. పెద్ద పిల్లల్లో కొందరు నిద్రమత్తు ముంచుకు రాకుండా టీ, కాఫీల వంటివి తాగుతుంటారు. ఇదీ సరికాదు. అవసరమైతే త్వరగా పడుకొని ఉదయాన్నే   లేచి చదువుకోవటం మంచిదని వివరించి చెప్పాలి.

7 ఒత్తిడి చేయొద్దు

ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే రకరకాల ఒత్తిళ్లకు లోనవుతున్నారు. పరీక్షల పేరుతో వారిని ఇంకా ఒత్తిడికి గురిచేయటం తగదు. విమర్శించటమూ సరికాదు. ఇది మనసులో ప్రతికూల భావనలకు బీజం వేస్తుంది. ఒత్తిడికి గురవుతోంటే ‘ప్రయత్నిస్తే మార్కులు బాగా తెచ్చుకోవచ్చు’ అంటూ ప్రోత్సహించాలే తప్ప భయపెట్టకూడదు. 

8 పరీక్ష రోజున కూడా... 

పరీక్ష జరిగే నాడు పిల్లలను పెందలాడే నిద్రలేపి, సిద్ధం చేయాలి. తేలికైన అల్పాహారం, పాలు ఇవ్వాలి. కొద్దిసేపు సబ్జెక్టును పునశ్చరణ చేసుకోమని చెప్పాలి. మనసుకు విశ్రాంతి, హాయి భావన కలిగేలా గాఢంగా, నెమ్మదిగా శ్వాస తీసుకోవటం నేర్పించాలి. అవసరమైన పెన్నులు, పరీక్ష అట్ట వంటివి బ్యాగులో పెట్టుకున్నారో లేదో చూడాలి.  బాగా రాయమంటూ ప్రోత్సహించాలి.
- పి.భాగ్యలక్ష్మి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.