close

తాజా వార్తలు

రోదస్త్రీ నడక

చరిత్రలో ఆమె

నాసా చరిత్రలో ఈ నెల 29న ఓ అద్భుతం జరగనుంది. కేవలం మహిళా వ్యోమగాములతో అంతరిక్షయానం నిర్వహిస్తోందీ సంస్థ. ఇలా ఒక మహిళాబృందం రోదసిలోకి వెళ్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

నాసా ప్రత్యేక మిషన్‌ ద్వారా గ్రహాంతరాల్లో ఘనమైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు మహిళలు. గగనాంతర రోదసిలోకి ఒంటరిగా వెళ్తున్నారు.  మహిళలు స్పేస్‌ వాక్‌ చేయడం ఇది మొదటిసారేం కాదు! ఇంత వరకూ పురుషులతో కలిసి వెళ్లారే కానీ, మహిళలు మాత్రమే బృందంగా  అంతరిక్షంలోకి వెళ్లింది లేదు. నాసా తాజా ఆపరేషన్‌ స్పేస్‌వాక్‌తో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. అమెరికా సైనిక విభాగంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌, నాసా ఆస్ట్రోనాట్‌ ఇంజినీర్‌ అన్నె మెక్లెయిన్‌, మరో ఆస్ట్రోనాట్‌ క్రిస్టినా కోచ్‌ ఈ నవ శకానికి నాంది పలుకుతున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న అన్నె మెక్లెయిన్‌తో కలిసి క్రిస్టినా ఈ సాహసయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను స్త్రీలే పర్యవేక్షించడం మరో విశేషం. గతంలో 1984లో రష్యాకు చెందిన వ్యోమగామి స్వెట్లానా సావిట్‌స్కయా తొలిసారి ఒంటరిగా స్పేస్‌వాక్‌ చేసిన మహిళగా నిలవగా, ఇప్పుడు స్పేస్‌వాక్‌ మిషన్‌లో అందరూ మహిళలే ఉండటం ప్రత్యేకం.
ఎప్పుడు?: మార్చి 29
ఎంత దూరం వెళ్తారు?: భూమి ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తు వరకూ దూసుకెళ్తారు.
ఏం చేస్తారు?: ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ బయట స్పేస్‌ వాక్‌ చేస్తారు. రెండు స్టేషన్ల పవర్‌ ఛానల్స్‌ను నవీకరిస్తారు.
రోదసిలో ఎంత సమయం?: 7 గంటలు


ఇద్దరూ ఇద్దరే

అటాకింగ్‌ ఆస్ట్రోనాట్‌... అన్నె మెక్లెయిన్‌ 2013లో నాసా ఆస్ట్రోనాట్‌ బృంద సభ్యురాలిగా ఎంపికైంది. ఈమె వయసు 40 ఏళ్లు. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. అమెరికా మిలటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొని... యూఎస్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. ‘2015లో నాసాలో శిక్షణ ముగించా. అమెరికా ఆర్మీ మేజర్‌గా, అటాక్‌ హెలికాప్టర్‌ పైలెట్‌గా, ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాన’ంటారు అన్నె. గత డిసెంబరు నుంచి ఆమె ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నారు.

చిన్ననాటి కల.. క్రిస్టినా

బాల్యం నుంచి సాహసాలతో సావాసం చేయడం క్రిస్టినా కోచ్‌కు అలవాటు. అంటార్కిటిక్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో పని చేసిన క్రిస్టినాకు మైనస్‌ 105 డిగ్రీల ఉష్ణోగ్రతను ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఈ అనుభవం స్పేస్‌వాక్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటారామె. 2015 జూన్‌లో ఆస్ట్రోనాట్‌ శిక్షణ ముగించారు. ‘చిన్నప్పటి నుంచి వ్యోమగామి కావాలని బలంగా అనుకునేదాన్ని. ఖగోళశాస్త్రంపై ఆసక్తి ఉండేది. స్పేస్‌ఫ్లైట్‌లో ప్రయాణం అంటే ఓ ఛాలెంజ్‌. ఈ మిషన్‌ కోసం చాలా శ్రమించా. 40 ఏళ్ల వయసులో ఇప్పటికి నా కల నెరవేరుతోంద’ని అంటారు క్రిస్టినా.

సహకరించే వారూ మహిళలే.. ఈ ఇద్దరు నారీమణుల సాహస యాత్రకు సహకరిస్తున్న వారంతా కూడా మహిళలే. కెనెడా స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్‌ కంట్రోలర్‌ క్రిస్టెన్‌ ఫాసియల్‌, హోస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించనుండగా, మహిళా స్పేస్‌ వాకర్స్‌ లీడ్‌ ఫ్లైట్‌ డైరెక్టర్‌ మేరీ లారెన్స్‌, జాకీ కాగే తమ వంతు సహకారం అందించడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.