close

తాజా వార్తలు

సృజనకులు మీరే

సృజనాత్మకత పుట్టుకతోనే అబ్బుతుందని చాలామంది భావిస్తారు. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల్లో తెలివితేటలు కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉన్నట్టుగానే కొందరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ ఉండొచ్చు. తక్కువున్నంత మాత్రాన కొత్తగా ఆలోచించే, ప్రయత్నించే నైపుణ్యాలు లేవనుకోవటానికి లేదు. సృజనాత్మకశక్తి అనేది పెద్దవాళ్ల ప్రోత్సాహంతో, ఆసరాతో పెంపొందే నైపుణ్యం. ఇది చిన్నారుల ఆరోగ్యం, ఆనందం, విశ్వాసానికి ప్రతీక. సృజనాత్మకత కేవలం లలిత కళలకే పరిమితమయ్యేది కాదు. సమయానికి అనుగుణంగా నడచుకునేలా... సవాళ్లను, సమస్యలను పరిష్కరించేలా మనిషిని తీర్చిదిద్దే సాధనం కూడా. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగే ధైర్యాన్నీ కల్పించే మార్గం. నిజానికి మనం పిల్లలకు సృజనాత్మకతను ఇవ్వలేకపోవచ్చు గానీ సృజనాత్మక దృష్టితో చూసే గుణాన్ని మాత్రం కచ్చితంగా పెంపొందించొచ్చు. కాకపోతే తగిన అవకాశాలను కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఏకాగ్రత, ఆశావహ దృక్పథం, పోటీతత్వం వంటివీ మెరుగవుతాయి. మరి చిన్నప్పట్నుంచే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేదెలా?

* వారి ప్రయత్నాలపై దృష్టి...
బొమ్మలు గీసినపుడో, ఏదైనా ప్రాజెక్టు చేసినపుడో పిల్లలు అవి ఎలా ఉన్నాయో చెప్పమని పెద్దవాళ్లను అడుగుతుంటారు. ఇలాంటప్పుడు పిల్లలను నిరాశ పరచటం తగదు. మొత్తం పూర్తయ్యాక చెబుతాలే అనీ కసురుకోకూడదు. ఎన్ని బొమ్మలు వేశారు? అవి బాగా ఉన్నాయా? అనే వాటి కన్నా పిల్లలు ఆయా పనుల్లో ఎంతగా నిమగ్నమయ్యారో.. అవి వారికెంత సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయో గమనించాలి.  ఇలాంటి గుణాలే పిల్లలను కొంగొత్త విషయాల వైపు ఆకర్షిస్తాయనే సంగతిని తెలుసుకోవాలి.

* ప్రత్యేక స్థలం ఉండేలా...
సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించటానికి, రకరకాల ప్రయోగాలకు పిల్లలను ఉత్సాహపరచినప్పటికీ.. వాటిని రోజూ ఒకే సమయంలో చేసేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించాలి. దీంతో బొమ్మలు వేయటం, క్లేతో ఆడుకోవటం, ప్రాజెక్టు పనుల వంటివి పూర్తయ్యాక ఆయా వస్తువులు ఒకదగ్గర ఉండేలా చూసుకోవచ్చు.

* విసుగుకు వెరవొద్దు
పిల్లలకు చాలా త్వరగా మొహం మెత్తుతుంది. త్వరగా విసుగు వచ్చేస్తుంటుంది. అప్పటివరకూ కారుతో ఆడుకున్న వాళ్లు కాస్తా కొద్దిసేపటికే బొమ్మలు వేయాలనుకుంటారు. కాసేపటికే అదీ బోర్‌ కొట్టొచ్చు. నిజానికి ఈ విసుగు కూడా మంచిదే. ఇది కొత్త విషయాల గురించి ఆలోచించేలా మనసును పురికొల్పుతుంది. చుట్టుపక్కల పరిస్థితులు, పరిసరాలతో మమేకమయ్యేలా చేస్తుంది. తమ లోపలి, బయటి ప్రపంచాన్ని తరచి చూడటానికి పిల్లలకు కొంత ఖాళీ సమయమూ అవసరమేనని గుర్తించాలి. ఇది సృజనాత్మకత దృష్టి పెంపొందటానికీ తోడ్పడుతుంది.

* భిన్నంగా ఆలోచించనివ్వండి
వినూత్నంగా, కొత్తగా ఆలోచించే పిల్లలు ఇతరుల కన్నా కాస్త భిన్నంగా కనిపిస్తుంటారు. తమదైన శైలిలో పనులు చేయటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో చిన్నారులను కసురుకోవటం, తప్పుపట్టటం మంచిది కాదు. దీంతో పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. తాము చేస్తున్నది తప్పేమో అనే అయోమయంలోనూ పడిపోతుంటారు. అందువల్ల పిల్లలకు తమ కళ్లతో లోకాన్ని చూసే అవకాశాన్ని కల్పించాలి. సొంతంగా ఆలోచించుకునే వెసులుబాటు ఇవ్వాలి. పెద్దవాళ్ల అభిప్రాయాలను, దృక్పథాలను వారిపై బలవంతంగా రుద్దటం సమంజసం కాదు. చిన్నారులకూ ఒక వ్యక్తిత్వముంటుంది. అది వయసుతో పాటు బలపడుతూ వస్తుంటుంది. దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి పెద్దవాళ్లుగా అండగా నిలబడాలి. ఇది భిన్నంగా ఆలోచించే నైపుణ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది.

 

* చిందర వందర చేయనివ్వండి
పిల్లలు... ముఖ్యంగా పారాడే, అప్పుడప్పుడే నడక నేర్చుకునే పిల్లలు విచిత్రంగా కనిపించే అన్నింట్లోనూ వేలు పెట్టాలని చూస్తుంటారు. గచ్చు మీద నీళ్లు పడితే చేత్తో రాయొచ్చు. అమ్మ పిండి కలుపుతుంటే పిసకటానికి ప్రయత్నించొచ్చు. దుస్తులు ఉతుకుతున్నప్పుడు బకెట్లో సబ్బు నురగను చేత్తో తాకొచ్చు. ప్రమాదకరం కానంతవరకు ఇలాంటి పనులతో పిల్లలను ప్రయోగాలు చేయనివ్వచ్చు. ఆ తరువాత శుభ్రం చేయొచ్చు. మనకివి అనవసరమైన, చిందర వందర పనులుగా కనిపించొచ్చు గానీ పిల్లల ఉత్సాహానికి, ఉత్సుకతకు ఇవి పెద్ద నిదర్శనాలు. ఒకరకంగా ఇవన్నీ సృజనాత్మక దృష్టికి సోపానాలనే చెప్పుకోవచ్చు.
 

పిల్లలు బాల బ్రహ్మలు. నిత్య సృజనశీలురు. ప్రతి దాన్నీ తరచి చూసే ఆసక్తి.. లోగుట్టును తెలుసుకోవాలనే జిజ్ఞాస వారి సొంతం. ఇవి వారిలో అనుక్షణం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయి. చిన్నారుల్లో ఇలాంటి సృజనాత్మక దృష్టిని కాపాడుకోవటం.. దాన్ని ప్రోత్సహించటం, పెంపొందించటం పెద్దవాళ్లుగా మన కర్తవ్యం, బాధ్యత.

మరకలు మంచివే

చేతులకు మట్టి అంటుకుంటుందేమో, దుస్తులు మాసిపోతాయేమోనని చాలామంది తమ పిల్లలను బయటకు పంపరు. ఇంట్లోనే ఆడుకోవాలంటారు. అది పట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దని ఆంక్షలు పెడుతుంటారు. ‘వరండాలోకి వెళ్లావంటే చూడు’ అంటూ బెదిరిస్తారు. దీంతో పిల్లల పరిధి తగ్గిపోతుంది. బయటి వాతావరణాన్ని, పరిస్థితులను ఆకళింపు చేసుకోవటం, నేర్చుకోవటం తగ్గుతుంది. ఇది సృజనాత్మకశక్తినీ దెబ్బతీస్తుంది. పిల్లల రక్షణ గురించి ఆలోచించటం తప్పు కాదు గానీ అది వారిలో ఆలోచనా శక్తిని దెబ్బతీసేలా ఉండకూడదు. కాబట్టి అవసరమైతే బయటకు వెళ్లనివ్వండి.

పక్కాగా ఎందుకు...

‘ప్రాక్టీస్‌ మేక్స్‌ మ్యాన్‌ పర్‌ఫెక్ట్‌’ అన్నది ఆంగ్ల నానుడి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని మన వేమన కూడా ఏనాడో చెప్పాడు. కాబట్టి ఏదైనా నేర్చుకోవటానికి, చేసి చూపటానికి పిల్లలకు కొంత సమయం ఇవ్వాలి. కాస్త పెద్ద పిల్లలనైనా సరే... ఎప్పుడూ అన్ని పనులను కచ్చితంగా చేయాలని ఆశించటం, అలా చేయకపోతే నిందించటం మంచిది కాదు. దీంతో వారిలో కొత్తగా ఆలోచించే నైపుణ్యం కొరవడుతుంది. బొమ్మలు వేయటం.. లేదూ వాటికి రంగులు వేయటం వంటి పనులను వారికి నచ్చిన రీతిలో పూర్తి చేసే అవకాశం ఇవ్వాలి. తప్పుల ద్వారానే విజయానికి మార్గం పడుతుందనే సంగతిని మరవరాదు. ఏదైనా సరిగా చేయనప్పుడు అలా ఎందుకు జరిగిందనే దాని గురించి పిల్లలు ఆలోచిస్తారు, తమదైన రీతిలో విశ్లేషిస్తారు. మళ్లీ అలా జరగకుండా చూసుకోవటమెలా అనేది  నేర్చుకుంటారు. అంటే ఓటములు పిల్లల్లో ఎదుగుదలకు, సృజనాత్మక దృక్పథానికి అవకాశం కల్పిస్తాయన్నమాట.
- పి.భాగ్యలక్ష్మి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.