close

తాజా వార్తలు

వినూత్నతకే పీఠం... వికాసానికే పాఠం!

విద్యార్థి లక్ష్యం విజ్ఞానాన్ని ఆర్జించడం. అందుకోసం కేవలం పుస్తకాలతో కుస్తీ పడితే సరిపోదు. పాఠాలను బట్టీ పడితే చాలదు. నేర్చుకునే ప్రతి అంశాన్ని స్వయంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలి. అలాంటి నవ్య విద్యావిధానాన్నే ఈతరం పిల్లలకు చేరువ చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన అపూర్వ. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

మేం ముఖ్యంగా నాలుగు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. అందులో మొదటిది ప్రయోగాల ద్వారా చదువు. అలాగే వేసవి శిబిరాలు, బడి తరువాత సులువుగా చదువుకోవాలనుకునే వారి కోసం మేకర్‌ స్పేస్‌, టీచర్‌ ట్రైనింగ్‌, తల్లిదండ్రులకు అవగాహనా కార్యక్రమాలు ఇలా ఎన్నో చేస్తున్నాం. వీటన్నింటినీ నిర్వహించేందుకు లియో అండ్‌  మైక్‌ సంస్థను  కిందటేడాది నేను, అభిలాష్‌ కలిసి ప్రారంభించాం.  మా సంస్థను కిందటేడాది రిజిస్టర్‌ చేయించినా... ఎప్పటినుంచో ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. మా సేవల గురించి విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు వాళ్లందరితో మాట్లాడేదాన్ని. పాఠశాలలకూ వెళ్లేదాన్ని. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేశాం. పిల్లల వికాసానికి సంబంధించి తల్లిదండ్రులకు ఉండే ఆలోచనలు, అభిప్రాయాల్ని పరిగణించి మాదైన ప్రణాళికలు రూపొందించాం. పిల్లల అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు కొత్త అంశాలను కూడా చేరుస్తున్నాం.
వాళ్లే ప్రయోగం చేసేలా...
విద్యా రంగంలో ‘బాగా నేర్చుకోవడం (లెర్నింగ్‌ బెటర్‌) ఎలా’ అనే అంశంపై పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తాం. పిల్లలకు వారి లక్ష్యంపై స్పష్టత వచ్చేలా, వారి శక్తి సామర్థ్యాలను తెలియజెప్పడమే ఈ శిక్షణ ప్రధానోద్దేశం. ఉదాహరణకు తరగతిలో చెప్పిన పాఠాన్ని ఇక్కడ మా సంస్థలో ‘మేకర్‌ స్పేస్‌’ అనే విభాగంలో పిల్లలకు ప్రయోగం ద్వారా వివరిస్తాం. వారితోనూ ప్రయోగాలు (హ్యాండ్‌ పాన్‌ లెర్నింగ్‌) చేయిస్తాం.  అందుకు అవసరమైన పరికరాలు మా దగ్గర ఉంటాయి. ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ చదివే పిల్లల వరకు ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒకటో తరగతి విద్యార్థి మానవ జీర్ణవ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే... అందులో ఉండే శరీరభాగాలు, అవి చేసే పనులు తాను స్వయంగా రూపొందించి నేర్చుకుంటాడు. అలాగే రోబోటిక్స్‌, ప్రోగామింగ్స్‌... ఏదైనా స్వయంగా చేస్తూ దానిలో ఉండే భాగాలు, అమరిక, విధులు, లాభాలు... ఇలా సమస్తం తెలుసుకోవచ్చు. వీటితోపాటు యాటిట్యూడ్‌, ఇతర నైపుణ్యాలు కూడా నేర్పిస్తాం. ప్రయోగాలు చేసే క్రమంలో పిల్లలు ఓడిపోవడం సహజమే. అది గుర్తిస్తే గనుక వాళ్లు చేసే పొరపాట్లను చెబుతాం. సలహాలూ ఇస్తాం. వీటన్నింటివల్లా పెద్దయ్యాక ఏదైనా సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే స్థితిలో ఉంటారు. మా ప్రాజెక్టుల్లో భాగంగా ‘స్టెమ్‌’ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌)ని కూడా అనుసంధానిస్తాం. ఇందులో ఇప్పుడు ఆర్ట్స్‌ కూడా చేరి ఇది కాస్తా స్టీమ్‌ (ఎస్‌టీఈఏఎమ్‌) అయ్యింది. ఏ పని చేయాలన్నా ఈ స్టీమ్‌లోని అయిదు అంశాలు ఉండాల్సిందే. అలాగే వయసును బట్టి ఫొటోగ్రఫీ, లఘుచిత్రాలు, కోడింగ్‌ ఇలా ఏవయినా మా దగ్గర ప్రయోగాలు చేయొచ్చు. వీటన్నింటివల్లా వారిలో బృందస్ఫూర్తి అలవడుతుంది. సమస్యలను పరిష్కరించే విధానమూ వస్తుంది.

ఉపాధ్యాయులకీ ప్రత్యేక శిక్షణ...
ప్రయోగాల ఆధారిత చదువు ఎలా చెప్పాలో టీచర్లకూ తెలియాలి కాబట్టి... మేం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. ఉపాధ్యాయులు పిల్లలతో ఎలా ఉండాలి... విద్యార్థులతో ప్రయోగాలు ఎలా చేయించాలి... ఇలా శిక్షణలో భాగంగా ఎన్నో అంశాలు చెబుతాం. మా లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు. అలా ఇప్పటివరకూ కొంతమంది టీచర్లకు శిక్షణ ఇచ్చాం. మరిన్ని పాఠశాలలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సాంకేతికత మేళవించిన ప్రయోగాత్మక చదువు ఆధారంగా ఈ శిక్షణ ఉంటుంది. మా విద్యావిధానం పిల్లల్లో ఆసక్తిని, నేర్చుకోవాలనే తపనను కలిగిస్తుంది. ప్రశ్నలు వేసే గుణాన్ని పెంపొందిస్తాం. అలాగే పిల్లలతో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ తల్లిదండ్రులకూ విడతల వారీగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే... టీచర్లు, ఉపాధ్యాయులు కలిస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది మా నమ్మకం.
ప్రముఖ పాఠశాలల్లో...
పిల్లలు వాడే త్రీడీ ప్రింటర్లు, ఎడిటింగ్‌ నేర్చుకోవడానికి లాప్‌టాప్‌లు, రోబోటిక్‌ టూల్స్‌, ఉడ్‌వర్క్‌... కోసం అవసరమైన వస్తువులన్నీ వివిధ ప్రాంతాలనుంచి తెప్పించాం. స్కూలు అయిపోయిన తరువాత వారు ఇక్కడికి వచ్చి ఇష్టమైంది నేర్చుకుని వెళ్లొచ్చు. త్వరలో మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. ఇవన్నీ నేర్చుకునేందుకు కొంత నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు... విద్యార్థులు ఇక్కడ కావాల్సిన ప్రయోగాలు చేయొచ్చు. ఇప్పటివరకూ కొన్ని ప్రముఖ స్కూళ్లతో కలిసి పనిచేశాం. ఇప్పటివరకూ పయోనీర్‌ వరల్డ్‌, చెరక్‌, సుచిత్రా అకాడమీ, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌... వంటి స్కూళ్లు మా క్లయింట్ల జాబితాలో చేరాయి. మా సేవల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం.


నా గురించి...
నేను పుట్టింది హైదరాబాద్‌లో. బెంగళూరులో సైకాలజీలో బీఏ, హైదరాబాద్‌ విశ్వవిద్యాయలంలో మాస్‌ కమ్యూనికేషన్‌లో ఎం.ఎ. చదివా. ఆ తరువాత ‘క్రెయా లెర్నింగ్‌ అండ్‌ రిసెర్చ్‌’ సంస్థలో  చేరా. విద్యారంగంలో ఇదొక పెద్ద సంస్థ. పిల్లలకు వాళ్లు స్వయంగా నమూనాలను తయారు చేసేలా (హ్యాండ్‌ పాన్‌ లెర్నింగ్‌లో) శిక్షణ ఇచ్చేది. అక్కడ దాదాపు ఆరేళ్లు పనిచేశా. పిల్లలకు శిక్షణ ఇవ్వడమే కాదు, మార్కెటింగ్‌, ప్రయోగాల ప్రణాళిక రూపొందించడం, ఉపాధ్యాయులకు శిక్షణ... ఇలా దాదాపు అన్ని విభాగాల్లో పనిచేశా. అక్కడ చేస్తున్నప్పుడే దేశంలోని కొన్నివేల మంది విద్యార్థులు, ఎందరో టీచర్లు, తల్లిదండ్రులతో మాట్లాడా. కొన్ని వందల స్కూళ్లకు వెళ్లా. ఆ అనుభవం, అవగాహనతోనే ఈ సంస్థను ప్రారంభించా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.