close

తాజా వార్తలు

ఫోను ఇస్తేనే అన్నం తింటానంటున్నాడు!
మా బాబుకు రెండేళ్లు. నా ఆరోగ్యం సరిగా ఉండదు. దాంతో వాడి ఆలనాపాలనా మా అత్తగారే చూసుకుంటారు. అన్నం తినిపించేటప్పుడు బాబు చేతికి ఫోను ఇస్తారు. వాడు గేమ్స్‌ ఆడుతూ తింటాడు. ఫోను ఇవ్వకపోతే సరిగా తినడు. నాకు అదే అలవాటువుతుందేమోనని భయంగా ఉంది. ఎలా మాన్పించాలి?
- ఓ సోదరి
 

సాధారణంగా రెండు, మూడేళ్ల చిన్నారులు ఆటలు, పాటల ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటారు. వారి దృష్టి మరల్చడానికి  ఆటలు, పాటలు తోడ్పడతాయి. లేదా దృశ్య, శ్రవణ సాధనాలను ఎంచుకోవచ్చు. ఇక, మీ అత్తగారు బాబు అన్నం తిననప్పుడు అతడి దృష్టి మరల్చి తినిపించడానికి ఫోనులో గేమ్స్‌ పెట్టి ఇస్తున్నట్లున్నారు. దాంతో అందులోని దృశ్యాలు, శబ్దాలు అతడిని ఆకర్షిస్తున్నాయి. అలా దానికి అలవాటు పడిపోయాడు. ఫోను ఇస్తేనే అన్నం తింటానని మారం చేస్తున్నాడు. దీన్నే కండిషనింగ్‌ అంటారు. అంటే వారు ఏదైనా చేయాలంటే మనం వారు చెప్పిన పని చేయడమో, అడిగిన వస్తువు ఇవ్వడమో తప్పనిసరన్నమాట. అయితే చిన్నారుల దృష్టిని ఆట, పాటల ద్వారా మరల్చవచ్చు. దానికి ఏం చేయాలంటే... బాబుకు ఇష్టమైన ఆటబొమ్మలతో వాడిని ఆడిస్తూ, పెరట్లో తిప్పుతూ, పరిసరాలను చూపిస్తూ గోరుముద్దలు పెట్టొచ్చు. అయితే అవి బాబుకు తెలియనివి, ఆసక్తి కలిగించేవై ఉండాలి. ఇది అంత సులువేం కాదు. సహనం అవసరం. తిననంటూ మొండికేయొచ్చు. అయినా సరే, మీరు ఫోను ఇవ్వడం కుదరదని చెప్పాలి. దృష్టి అటు వెళ్లకుండా మరిపించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే కొన్ని పద్ధతులు నేర్పాలి. తన పనులు తానే చేసుకునేలా చేయాలి. తోటి చిన్నారులు, కుటుంబసభ్యులు ఎలా భోంచేస్తున్నారో చూపించాలి. క్రమంగా తను కూడా చెంచాతో లేదా చేత్తో తినడం అలవాటు అవుతుంది. చక్కగా తిన్నప్పుడు మెచ్చుకుని తనకి నచ్చేవి ఏవైనా కానుకగా ఇవ్వడం వల్ల మార్పు ఉంటుంది. దీన్నే బిహేవియర్‌ మాడిఫికేషన్‌ అంటారు. తినే చోట కూడా డైనింగ్‌ టేబుల్‌ దగ్గర తన కోసం ఒక ఎత్తయిన కుర్చీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.   తన కోసం ప్రత్యేకంగా గ్లాసు, కంచం.. ఇలా అన్నీ ఉండేలా చూడాలి.  వీటన్నింటి వల్ల తనకు తీసుకునే ఆహారం మీద ఇష్టం ఏర్పడుతుంది. తానేదో గొప్ప అనీ, ప్రత్యేక వ్యక్తి అనీ భావిస్తాడు. ఇంటికి చుట్టాలో, స్నేహితులో, తెలిసినవారో వచ్చినప్పుడు మీ బాబు  పద్ధతులు, లక్షణాల గురించి గొప్పగా చెప్పండి. దాంతో అతడు తన పాత అలవాట్లను మానేస్తాడు. కొత్త విషయాలను, పద్ధతులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తాడు. అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

- మీ సందేహాలను vasukid@enadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.