close

తాజా వార్తలు

ఎక్కేద్దాం... ఊహల రెక్కల గుర్రం!

మీరే డైరెక్టర్‌... మీరే హీరో... మీదే మ్యూజిక్‌... మీరే కెమెరామన్‌... ఒక్క రచయిత తప్ప...ఎలాగబ్బా అంటారా? పుస్తకం చదివితే! అవును.. చదవడమంటూ మొదలుపెడితే ఆ ఆల్‌రౌండర్‌ మీరే అవ్వొచ్చు...మీ ఊహాశక్తికి పదునుపెట్టొచ్చు... మీరు చదివే సీన్‌ మీరే క్రియేట్‌ చేసుకోవచ్చు... ప్రతి ఫీల్‌ను సొంతంగా ఆస్వాదించొచ్చు...
పుస్తకం... కాగితాలు మాత్రమే కాదు. మనిషిని మరో లోకంలోకి తీసుకువెళ్లే ఓ సాధనం. ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేది పుస్తకమే. మహనీయుల భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని, వారి అడుగుజాడలను ఆవిష్కృతం చేసేది ఇదే. గత చరిత్రనూ, వర్తమానాన్ని నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులోకి తీసుకువెళ్లే విజ్ఞాన గని. ఉన్నట్టుండి ఇప్పుడీ పుస్తకాల గురించి ఎందుకంటారా? ఎందుకంటే మరి ఇవాళ అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం (ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ బుక్‌ డే).

 

మనం తప్పక చదవాల్సిన పుస్తకాల్లో కొన్ని..

* పరమానందయ్య శిష్యుల కథ
* అల్లాఉద్దీన్‌ కథలు
* నసీరుద్దీన్‌ కథలు
* మర్యాద రామన్న కథలు
* పేదరాశి పెద్దమ్మ కథలు
* చందమామ కథలు
* భట్టి విక్రమార్క కథలు
* మన శరీరం కథ
* సైన్స్‌తో సరదాలు
* నరావతారం
* అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర
* చిన్నతనంలో ఇందిరకు నెహ్రూ రాసిన లేఖలు
* సింద్‌బాద్‌ సాహస యాత్రలు
* శివాజీ జీవిత చరిత్ర
* చొప్పదంటు ప్రశ్నలు
* 1001 ప్రపంచ వింతలు

 

 

 

 

పుస్తకం మనకిచ్చేది...

* సునిశిత ఆలోచనా శక్తి అలవడుతుంది
* మానసిక ప్రశాంతత, ఉత్సాహం
* సమకాలీన అంశాలపై అవగాహన
* మాండలిక పదాలు, కొత్త పదాలు పరిచయమవుతాయి భాషా జ్ఞానం, ఊహా శక్తి పెరుగుతాయి
* రకరకాల సంస్కృతులకు సంబంధించిన విషయాలపై అవగాహన
* మహనీయుల జీవితాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతాం
* మానసిక దృఢత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతాయి
* మెదడు చురుకుగా అవుతుంది
* మానవ విలువలు అర్థమయ్యేలా చేస్తాయి.

 

ఎన్నో రకాలు!

* జీవిత చరిత్రలు
* ఆత్మ కథలు
* కల్పనా సాహిత్యం(కథలు, నవలలు, నాటకాలు, కవితలు)
* విజ్ఞాన సర్వస్వం (ఎన్‌సైక్లోపీడియా)
* యాత్రా పుస్తకాలు
* గేయాలు, పద్యాలు...

 

ఇలా చదివేద్దాం!

పుస్తక పఠనాన్ని సంపూర్ణంగా ఆస్వాదించటానికి కొన్ని చిట్కాలు
* ప్రశాంత వాతావరణంలో వెలుతురు వచ్చేచోట కూర్చుని పుస్తకం తెరవాలి.
* ముఖచిత్రం ఎలా ఉందో గమనించాలి. దాన్ని రూపొందించిన చిత్రకారుడి వివరాలు లోపలి పేజీల్లో ఉంటాయి.
* వెనక అట్ట మీద పుస్తక సారాంశం గానీ, ముఖ్యాంశాలు గానీ క్లుప్తంగా ఉండవచ్చు. వాటిని చదవాలి.
* రచయిత పేరు చూడాలి. అనువాద పుస్తకమైతే మూలభాష, రచయిత, అనువాదకులు ఎవరో పరిశీలించాలి.
* ముందుమాట ఉంటే దాన్ని చదవటం వల్ల పుస్తకం దేని గురించో, దాని ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. ఒకవేళ ముందు మాట అస్పష్టంగా అనిపించినా పుస్తకం పూర్తిచేశాక చదివితే మరింత బాగా అర్థమవుతుంది.
* పుస్తకంలోని కథ గానీ, సారాంశం గానీ  ఏమిటో చప్పున తెలుసుకోవాలని విషయం అక్కడక్కడా చూస్తూ హడావుడిగా పేజీలు తిప్పెయ్యటం చేయకూడదు.
* రచయిత రాసిన వర్ణనలు, భాషా చమత్కారాలు అర్థం చేసుకుంటూ, జాతీయాలు, సామెతలు లాంటివి గమనిస్తూ ముందుకుసాగాలి.
* పుస్తకం పూర్తిచేశాక దీనిలో విషయం ఏమిటి? దీన్ని చదవటం వల్ల ఆహ్లాదం కలిగిందా? తెలియనివి  నేర్చుకోగలిగానా? ఏదైనా సాధించటానికి ప్రేరణ కలిగిందా?.. ఇలాంటి ప్రశ్నలు వేసుకుని జవాబులు మననం చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది..

 

ప్రముఖులు చెప్పిన మాటలు

మంచి పుస్తకాలు మన దగ్గరుంటే మంచి మిత్రుడు దగ్గర లేని లోటు తీరుతుంది
- గాంధీజీ
అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక
- కాళోజీ
మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం, మంచి మిత్రుడు గ్రంథాలయంతో సమానం
- ఏపీజే అబ్దుల్‌ కలాం
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో
- కందుకూరి వీరేశలింగం
కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి
- బేకన్‌
మంచి పుస్తకాన్ని మొదటి సారి చదువుతున్నప్పుడు ఒక కొత్త స్నేహితుడిని పరిచయం చేసుకున్నట్లే అనిపిస్తుంది. అదే పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు పాత స్నేహితుడిని కలుసుకున్నంత ఆనందంగా ఉంటుంది
- ఓల్టేర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.