close

తాజా వార్తలు

పబ్‌జీని పక్కకు పెడదాం!

ఉన్న చోటు పట్టించుకోవడం లేదు.. రాత్రీ, పగలు తేడా లేదు.. టైమ్‌ చూసుకోవడం లేదు.. ఎక్కడ చూసినా పబ్‌జీ ప్లేయింగే!! వ్యసనమైపోయింది చాలా మందికి! మరైతే, కట్టడి చేయడం ఎలా?

ఒక్కరే కాదు.. ఇంటిల్లిపాదీ.. ఎవరు ఎక్కడున్నా.. కలిసికట్టుగా జట్టుగా.. ఒకరికొకరు సాయపడుతూ ఆడేస్తున్నారు. ఏదో సరదాకి అయితే ఒకే. కానీ, గంటలు గంటలు అలుపు లేకుండా గేమ్‌లోనే గడిపేస్తున్నారు. దీంతో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్లు ‘పబ్‌జీ అడిక్షన్‌’లో చిక్కుకుంటున్నారు. ఓ నివేదిక ప్రకారం మొబైల్‌ గేమింగ్‌ మోజులో పడి తిండి, నిద్రలను సైతం మర్చిపోతున్నారట. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలవకుండా గేమ్స్‌ ఆడుతూ ఒంటరిగా గడిపేందుకే ఇష్టపడుతున్నారు. వారంలో ఏకంగా 12 గంటల పాటు గేమ్స్‌ ఆడేస్తున్నారు. దీంతో దేశంలోని కొన్ని చోట్ల పబ్‌జీ గేమ్‌ ఆడడాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. అందుకని వారంలో ఆరు గంటలు మాత్రమే గేమ్‌ ఆడేలా పబ్‌జీ మొబైల్‌ సంస్థ ‘టైమ్‌ లిమిట్‌’ని పెట్టే ఆలోచన చేస్తోంది. ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి ఆప్షన్‌ లేదు. అయితే, ఎక్కువ శాతం మంది మొబైల్‌ గేమింగ్‌పై నియంత్రణ అనివార్యంగా భావిస్తున్నారు. అందుకు తగిన థర్డ్‌పార్టీ యాప్‌లను ప్రయత్నిస్తున్నారు. కేవలం గేమ్స్‌పైనే కాకుండా ఫోన్‌లో ఎంత సమయం ఏమేం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. హద్దు మీరుతున్నట్టు అనిపిస్తే చెక్‌ పెట్టేందుకు వీలవుతుంది.

మంచి కోరుతుంది
‘యాక్షన్‌డ్యాష్‌’

రోజంతా మనం ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం?.. లాంటి వాటిపై శ్రద్ధ పెట్టి మనకి దిశానిర్దేశం చేసేవారిని గైడ్‌ అంటాం. అలాగే, రోజూ మనం స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం?.. లాంటి విషయాల్ని ట్రాక్‌ చేసే వాటిని ‘డిజిటల్‌ వెల్‌ బీయింగ్‌’ యాప్‌లు అంటున్నారు. అలాంటిదే యాక్షన్‌డ్యాష్‌ కూడా. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఫోన్‌లో మీ యాక్టివిటీలపై నిఘా మొదలవుతుంది. సోషల్‌ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారు? గేమ్స్‌ని ఎంత టైమ్‌ ఆడుతున్నారు?.. ఇలా అన్నింటినీ ట్రాక్‌ చేసి చెబుతుంది. రోజూ లేదంటే వారం పాటు ఏమేమి చేశారో రిపోర్టు రూపంలో పొందొచ్చు. గేమింగ్‌కి ఎక్కువగా అలవాటు పడినట్టుగా అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావచ్చు.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/2YHDj7w

గూగుల్‌ నిఘా...
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లంతా గూగుల్‌ ప్లే గూటికే వెళ్లేది. గేమ్స్‌తో పాటు ఇతర యాప్‌లు అన్నీ అక్కడే. ఇన్‌స్టాల్‌ చేయడం ఆడడం.. వాడడం.. మరైతే, రోజంతా మీ ఫోన్‌ వాడకం ఎలా ఉందో చెప్పేందుకు గూగుల్‌ ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’ నిఘా పెట్టింది. కేలవం రిపోర్టు చూపించడమే కాదు. హద్దులు దాటితే అలెర్ట్‌ చేస్తుంది. వినకుంటే  అడ్డుకుంటుంది. ఒకవేళ మీరుగానీ, ఇంట్లో పిల్లలుగానీ పబ్‌జీ గేమ్‌ ఎక్కువగా ఆడేస్తున్నట్లయితే ‘టైమ్‌ లిమిట్‌’ పెట్టొచ్చు. ఉదాహరణకు రోజుకి అరగంట పాటు మాత్రమే గేమ్‌ ఆడేలా సమయాన్ని నిర్దేశించొచ్చు. నిర్ణీత సమయం తర్వాత గేమ్‌ ఆడేందుకు వీలుండదు. ‘ఆండ్రాయిడ్‌ పై’ ఓఎస్‌తో ఫోన్‌ని వాడుతున్నట్లయితే ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’తో జట్టు కట్టొచ్చు.
* డౌన్‌లోడ్‌: http://bit.ly/2I4sNRR

‘డిటాక్స్‌’ టానిక్‌
‘డిజిటాక్స్‌’

ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాపీ.. వాడేది ఏదైనా అవి లేకుంటే ఒత్తిడి, ఆందోళనకి గురవుతున్నారంటే మీరు డిజిటల్‌ ప్రపంచానికి కాస్త పక్కకు జరగాల్సిందే. డిజిటల్‌ లైఫ్‌కి ముఖద్వారం ఫోనే కాబట్టి దానిపై నిఘా పెడితే చాలు. మీరు వాడేది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అయితే చాలు. యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని రోజూ మీరేం చేస్తున్నారో చూడొచ్చు. రిమైండర్‌ పెట్టుకుని ఎప్పటికప్పుడు బ్రేక్‌ తీసుకోవచ్చు.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/2CKHqq0

మీదైన సమయం..
స్పేస్‌

ఫోన్‌ వాడకం ఆధారంగా మీరెలాంటి యూజర్‌ అనేది యాప్‌ చెబుతుంది. దీంతో మీరెలా ఉండాలో ‘గోల్‌’ సెట్‌ చేసుకుని ఫోన్‌ వాడొచ్చు. ఉదాహరణకు మీరు మితిమీరి పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నట్లయితే గోల్‌ని సెట్‌ చేసుకుని గేమింగ్‌ అడిక్షన్‌ నుంచి బయటపడొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు యాప్‌ని ప్రయత్నించొచ్చు. ఫోన్‌, ట్యాబ్‌ల్లోనే కాకుండా ఎక్స్‌టెన్షన్‌ రూపంలో బ్రౌజర్‌కి జత చేసుకుని వాడొచ్చు. నెట్టింట్లో మీరెలా విహరిస్తున్నారనేది ట్రాక్‌ చేయొచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌కి తగిన ఎక్స్‌టెన్షన్‌ని క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/2FLOe79

పిల్లలకు ప్రత్యేకం
స్క్రీన్‌టైమ్‌

‘కొంచెం సేపు ఆడుకుంటాం..’ అంటూ మొదలై స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే ఫోన్‌తోనే గడిపే టీన్స్‌ ఎంతో మంది. ఇప్పుడు ఆడుతున్న పబ్‌జీ గేమ్‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తిగా గేమ్‌లో జీవిస్తూ ఆడేస్తుంటారు. అలాంటప్పుడు వారికి నిర్ణీత సమయాన్ని కేటాయిస్తూ ‘పేరెంటల్‌ కంట్రోల్స్‌’ పెట్టేందుకు అనువైన యాప్‌. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/2CLyJvu

‘స్క్రీన్‌లైమ్‌’ యాపిల్‌కి ప్రత్యేకం. సెట్టింగ్స్‌లో బిల్ట్‌ఇన్‌గా కనిపిస్తుంది. గేమ్స్‌కి టైమ్‌ లిమిట్‌ పెట్టుకుని ఆడొచ్చు.

డిజిటల్‌ లైఫ్‌ ఒత్తిడి నుంచి బయటపడేందుకు తగిన యాప్‌ ‘విల్‌’. ఆడియో, వీడియో సెషన్స్‌తో మొబైల్‌ గేమ్స్‌ నుంచి దృష్టిని మళ్లించొచ్చు.
* డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/2FQ37H8

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.