వెన్నెలింత చల్లగా ఎందుకు?
close

తాజా వార్తలు

Published : 25/04/2019 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెన్నెలింత చల్లగా ఎందుకు?

ప్రశ్న: సూర్యుడి నుంచి భూమికి చేరే సూర్యకిరణాలు వేడిగా ఉంటాయి. అవే కిరణాలు చంద్రునిపై పడి మనకు వెన్నెల రూపంలో వచ్చినప్పుడు చల్లగా ఉంటాయి. ఎందుకు?

- ఆర్‌. ప్రణవ్‌, 10వ తరగతి, హైదరాబాద్‌,
- ఎన్‌.జాహ్నవి సాయి, 9వ తరగతి, నగరం

 

 

సూర్యకిరణాల్లో వచ్చే వెలుతురుతో పాటు పరారుణ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు కూడా వస్తాయి. ఇందులో పరారుణ కిరణాలు వెచ్చదనాన్ని కల్గి ఉంటాయి. ఇంకా అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు శరీరంలో ఉండే ఎలక్ట్రాన్లు శక్తిని పుంజుకుని ఎక్కువ శక్తి స్థాయికి వెళతాయి. దీంతో చర్మం వేడెక్కుతుంది. పై కారణాల వల్ల సూర్యరశ్మి వేడిగా ఉంటుంది. అంటే ఎండలో వెచ్చదనం మనకు తెలుస్తుంది. పగటిపూట మనకు అనేక వస్తువులు కనిపిస్తాయి. ఉదాహరణకు మీ ఇంటిగోడపై సూర్యకాంతి పడి పరావర్తనం చెందడం వల్ల మీ ఇంటి గోడ మీకు కనిపిస్తుంది. ఇంటిగోడ మీద పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెందిన తర్వాత  ఆ కిరణాలు మీ మీదపడినా వేడిగా అనిపించవు. అలాగే చంద్రునిపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది మనపై వెన్నెల్లా పడ్డప్పుడు వేడిగా అనిపించక చల్లని అనుభూతి పొందుతాం. చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించడానికి కారణం దాని ఉపరితలంపై పడిన సూర్యకాంతిని మనవైపు పరావర్తనం చెందించడం. సూర్యుడు విడుదల చేసే సూర్యకాంతి చంద్రునిపై పడ్డప్పుడు కేవలం  3 నుంచి 12 శాతం మాత్రమే పరావర్తనం చెంది భూమికి చేరుతుంది. ఈ చంద్రకాంతి తీవ్రత భూ కక్ష్యలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతిని శోషించుకున్న చంద్రుడు మిగిలిన కాంతిని పరావర్తనం చెందిస్తాడు. పరావర్తన కాంతిలోని వేడిని కూడా భూవాతావరణం పీల్చేసుకుంటుంది. అందుకే వెన్నెల చల్లగా ఉంటుంది.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ,
ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని