close

తాజా వార్తలు

కొత్తవారిని చూసి భయపడుతున్నాడు!

మా బాబు వయసు తొమ్మిది నెలలు. ఇంట్లో చాలా చురుగ్గా ఉంటాడు. బయటకు వేడుకలకు తీసుకువెళ్లినప్పుడు మాత్రం బాగా భయపడతాడు. అక్కడి శబ్దాలకు ఏడుస్తాడు. ‘మీ అబ్బాయి చిన్నదానికే భయపడుతున్నాడు అలా ఉండకూడదు...’ అని బంధువులు, స్నేహితులు అంటున్నారు. ఇదేమైనా సమస్యా! ఏం చేయాలి?

- ఓ సోదరి

 

సాధారణంగా చిన్నారులకు తల్లిదండ్రులతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, బయట కొత్తవారిని చూసినా చిన్న పిల్లలు అభద్రతకు లోనవుతారు. ఆందోళన చెందుతారు. దీన్ని ’స్ట్రేంజర్‌ ఫోబియా’ అంటారు. అయితే   ఇది చాలా సహజం. ఇతరులు మీ బాబు విషయంలో చెబుతున్నది విని తల్లిదండ్రులుగా మీరు భయపడుతూ ఉండొచ్చు. కానీ ఈ విషయంలో ఆ బాధ అవసరం లేదు. మనచుట్టూ ఉన్నవారిలో చాలామంది తమకు జరిగిన అనుభవాల్ని ఇతరులకు అన్వయిస్తారు. వారి పిల్లల్లానే మిగిలిన చిన్నారులు కూడా ప్రవర్తిస్తారని అనుకుంటారు. దాంతో లేనిపోని అనుమానాల్ని లేవనెత్తుతుంటారు. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్నవారు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇది సరికాదు. ముందు పిల్లల్లో ఈ పరిస్థితి సర్వసాధారణం అని గుర్తించండి. దాన్నుంచి బయటపడేందుకు జాగ్రత్తలు తీసుకోండి. అందుకోసం ఈసారి మీరు బయటకి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...ముందుగానే, అక్కడ మీ బాబు వయసున్నవారెవరైనా ఉన్నారేమో వాకబు చేయండి. అలాగే వాడికి ఇష్టమైన ఆటవస్తువులేవైనా దొరుకుతాయేమో తెలుసుకోండి. తనకు ఇష్టమైన వస్తువులను కూడా మీ వెంట తీసుకువెళ్లండి.
అలాగే మీరు పార్టీలు, పెళ్లిళ్లు...వంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు నేరుగా జనసమూహం ఎక్కువగా ఉన్నచోటుకు మొదట వెళ్లొద్దు. ముందు బాబుకు తెలిసిన వారి దగ్గరకు వెళ్లండి. వారితో కాసేపు గడిపాక క్రమంగా ఆ వాతావరణానికి అతడు అలవాటు పడతాడు. అప్పుడు నెమ్మదిగా అందరిలోకి తీసుకువెళ్లాలి. ఇలా చేయడంవల్ల చిన్నారిలోని ఆందోళన, అభద్రత తగ్గుతాయి. దీన్ని ‘గ్రాడ్యుయల్‌ సిస్టమాటిక్‌ డీ సెన్సిటైజేషన్‌’ అంటారు. అలానే, కొందరు...ప్రేమతోనైనా సరే! చిన్నారులను చూడగానే తల్లిదండ్రుల చేతుల నుంచి లాగేసుకుంటారు. దాంతో పిల్లలు ఒక్కసారిగా భయపడతారు. కాబట్టి ఎవరూ అలా చేయకుండా చూడండి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎక్కువసేపు బాబుని మీ దగ్గరే ఉంచుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో బాగా తెలిసిన వ్యక్తికి అప్పగించండి. ఆ తరువాత కొంచెం తెలిసిన వ్యక్తికి... ఇలా నెమ్మదిగా అతడికి అక్కడి వ్యక్తులను పరిచయం చేయండి. దీనివల్ల బాబుకి ఆందోళన తగ్గి ధైర్యం వస్తుంది. భయం పోయి అందరితోనూ కలవగలుగుతాడు. అలాకాకుండా వెళ్లిన ప్రతిచోటా ఏడుస్తుంటే కొద్దిసేపు ఆ పరిసరాలకు దూరంగా తీసుకువెళ్లి ఆడించండి. ఆపై తిరిగి తీసుకొచ్చి మళ్లీ అందరిలోనూ కూర్చోబెట్టండి. క్రమంగా ఆ వాతావరణానికి అలవాటు పడతాడు. వయసుపెరిగే కొద్దీ అందరిలోనూ కలిసిపోతాడు.

- మీ సందేహాలను ‌vasukid@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.