
తాజా వార్తలు
ముంబయి: ‘నేను పొగాకు ప్రమోట్ చేయలేదు’ అని బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ అన్నారు. పొగాకు ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం కల్పించకూడదంటూ రాజస్థాన్‌కు చెందిన నానక్‌రామ్ అనే 40 ఏళ్ల వ్యక్తి కోరిన సంగతి తెలిసిందే. అజయ్ అభిమాని అయిన తను గతంలో ఆయన ప్రమోట్ చేసిన పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల క్యాన్సర్ బారినపడ్డట్లు చెప్పారు. ఈ విషయంపై అజయ్ స్పందించారు. సదరు అభిమానితో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ‘కంపెనీతో నా ఒప్పందం ప్రకారం నేను పొగాకును ప్రమోట్ చేయలేదు. వాణిజ్య ప్రకటనల కోసం ఇలాచీ (యాలకలు)నే ఉపయోగించాం. నా ఒప్పందం ప్రకారం అది పొగాకు కాదు. ఒకవేళ ఆ కంపెనీ ఇలాచీని కాకుండా మరేదైనా అమ్మిందా?అనే విషయం నాకు తెలియదు’ అని అన్నారు.
అనంతరం నటుడిగా తన బాధ్యత గురించి ప్రస్తావిస్తూ.. ‘నేను నా తాజా చిత్రం ‘దే దే ప్యార్ దే’లో పొగ తాగని వ్యక్తి పాత్రను పోషించా. ‘కంపెనీ’ (2002) సినిమాలో ‘మాలిక్ భాయ్’ వంటి పాత్రలో నటించాల్సి వచ్చినప్పుడు పొగ తాగకుండా ఉండటం కుదరదు. కాబట్టి నటులు ఇలా చేయకూడదు అనడంలో అర్థం లేదు. పాత్రను బట్టి మేం నడుచుకోవాల్సి ఉంటుంది’ అని అజయ్ పేర్కొన్నారు.