close

తాజా వార్తలు

గొడవలు వద్దు ప్లీజ్‌!

‘నేను చెప్పినట్లే జరగాలి...’ అంటూ మీ వారు!
‘మీకేం తెలియదు.. మీరు నన్ను అర్థంచేసుకోరు...’ అని మీరు!
- ఇలా ఏ విషయంలోనైనా  సరే... అవకాశం వచ్చినప్పుడల్లా వాదించుకుంటారా...
తరచూ మనస్పర్థలు, అభిప్రాయభేదాలు వస్తున్నాయా...
ఆ వాదనలు, గొడవలు మీ మధ్య దూరాన్ని మాత్రమే కాదు...
మీ పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

అభిరుచులు వేరైనప్పుడు, ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చనప్పుడు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు...  భార్యా భర్తల మధ్య తరచూ మనస్పర్థలు సహజమే. ఇవే కాకుండా ఆర్థిక సమస్యలు, అహం, ఒకరికొకరు సర్దుకోకపోవడం, అనుమానాలు... వంటివీ చక్కని దాంపత్యంలో చిచ్చు పెడుతాయి. కారణాలేవైతేనేం నలిగిపోయేది మాత్రం పిల్లలే. ఇంట్లో నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటే చిన్నారులు మానసికంగా కుంగిపోతారు. అది వారి భవిష్యత్తు మీదా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతికూల వాతావరణం నడుమ జీవితాన్ని నెట్టుకొస్తారు.

ఎలాంటి ప్రభావం ఉంటుందంటే...
* ఇంట్లో తల్లిదండ్రులు రోజూ గొడవపడుతుంటే పిల్లలు మానసికంగా కుంగిపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం ఘర్షణలు చూసి పోట్లాటలతోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని చిన్నారులు భావిస్తారు.
బంధుత్వాలు ఏర్పరచుకోలేరు... పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. బుడి బుడి అడుగుల నుంచి మొదలు దేన్నైనా అమ్మనాన్నలు నేర్పిస్తేనే నేర్చుకుంటారు. అలాంటిది పెద్దవాళ్లు ఇంట్లో ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకుంటూ గొడవలు పడుతుంటే పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇతరులతో విరోధం ఉన్నట్లుగానే ప్రవర్తిస్తారు. జీవితంలో ఎవరిని నమ్మడానికి ఇష్టపడరు. స్నేహితులు, బంధువులతో సర్దుకుపోలేరు. ఈ పిల్లలతో స్నేహం చేయడానికి తోటివారు కూడా ఇష్టపడరు. భవిష్యత్తులో భాగస్వామితో కూడా సరిగ్గా మెలగలేరు.
మానసిక కుంగుబాటు... తల్లిదండ్రులు అదేపనిగా గొడవపడుతూ... పిల్లల్ని పట్టించుకోకపోవడంతో వారిలో ప్రతికూల భావనలు పెరుగుతాయి. మానసికంగా కుంగిపోతారు. నిత్యం ఆందోళన, అభద్రతాభావంలోనే ఉంటారు.
ఆరోగ్య సమస్యలు... కొందరు చిన్నారులు సరిగ్గా ఆహారం తీసుకోరు. మరికొందరు ఆందోళనలో ఎక్కువగా తినేస్తారు. తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడతారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోలేరు. దీంతో అధికంగా బరువు పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంది. ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. భవిష్యత్తులో దురలవాట్లకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ.
ఆత్మస్థైర్యం తగ్గిపోవడం... ఎప్పుడూ తమను తాము నిందించుకుంటారు. ఏ పనైనా తాము చేయలేమని అనుకుంటారు. బిడియంతో, అపరాధ భావంతో జీవిస్తారు. తమను తాము ప్రతికూలంగా ఊహించుకుంటారు. తమ బలహీనతల గురించే ఎప్పుడూ ఆలోచించుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తారు. అలా వారిలో ఆత్మస్థైర్యం తగ్గుతుంది.
చదువులో వెనక... ఎక్కడ ఉన్నా పిల్లల ఆలోచనలు ఈ ఘర్షణల చుట్టే తిరుగుతుంటాయి. ఉపాధ్యాయులు చెప్పేది సరిగ్గా వినరు. ఏకాగ్రతతో చదవలేరు. దాంతో చదువుల్లో, ఆటపాటల్లో రాణించలేరు.
ఆప్యాయత లేక... తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెద్దవాళ్లు తమ ఒత్తిడిలో పడి పిల్లలకు ప్రేమ, ఆప్యాయతను సరిగ్గా పంచలేరు. ప్రశాంతంగా దగ్గరకు కూడా తీసుకోలేరు. దీంతో చిన్నారులు తమకు భరోసా లేనట్లు భావిస్తారు. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలియక లోలోపల కుంగిపోతారు.

తల్లిదండ్రులుగా ఏం చేయాలంటే...

తామిద్దరూ ఎంత వాదించుకుంటున్నా, గొడవపడుతున్నా... పిల్లలకు ప్రేమ పంచితే చాలానుకుంటారు కొందరు భార్యాభర్తలు. కానీ అది సరైన పద్దతి కాదు. మార్పు పెద్దవాళ్ల నుంచే మొదలు కావాలి. అదెలాగంటే...

కారణాలు తెలుసుకుని...
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు సహజమే. అయితే అవి తరచూ ఎదురవుతోంటే... ఏ సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయో తెలుసుకునేందుకు కారణాలు అన్వేషించాలి. ఆర్థిక వ్యవహారాలా, పిల్లల పెంపకమా, ఉద్యోగపరమైన ఒత్తిడా, ఇద్దరిమధ్యా సరైన అవగాహన లేకపోవడమా, అనుబంధం తగ్గడమా..  ఇలా అన్నింటిపై దృష్టి పెట్టాలి. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా ఉంటుంది కాబట్టి... దాని గురించి ఆలోచించాలి. పిల్లల ఎదుట వాదించుకోకూడదనే నియమాన్ని పెట్టుకుని ఎంత కష్టమైనా సరే పాటించాలి. ఏదయినా సమస్య ఎదురైతే... పరిష్కారం దిశగా ఆలోచించాలే తప్ప లోపాలు వెతికే కోణంలో మాత్రం కాదు.

కలిసి గడిపేలా...
ఇంటి వాతావరణం మార్చడం మీ పనే కాబట్టి... మొదట ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. మీరిద్దరూ కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. అలాగే వీలైనంతవరకూ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం, కలిసి పనులు చేసుకోవడం, మాటల్లో లోపాలు ఎత్తిచూపకపోవడం వంటివన్నీ ఇద్దరూ చేసుకోవాల్సిన మార్పులు. ఆ తరువాత ఇద్దరూ ఉద్యోగులయితే... పిల్లలతో సరదాగా గడిపేందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. అంతా కలిసి భోజనం చేయడం, వాళ్ల గురించి ఆరా తీయడం, చదువులు... ఇలాంటినవ్నీ చేయడం వల్ల మీరు అన్యోన్యంగా ఉన్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు.

ఈ పిల్లల్ని ఎలా గుర్తించొచ్చు...

* తల్లిదండ్రులు గొడవలు పడటం చూసిన వెంటనే ఏడుపు మొదలుపెడతారు. అభద్రతాభావానికి లోనవుతారు.
* అమ్మానాన్నలు ఒకరిపై మరొకరు అరుచుకోవడం చూసి భయపడతారు.
* ప్రవర్తనాపరమైన సమస్యలు కనిపిస్తాయి. బయటి వ్యక్తులతో కలవడానికి ఇష్టపడరు.
* మానసిక కుంగుబాటుకు గురైన లక్షణాలు కనిపిస్తాయి. నిత్యం నిరాశతో సతమతమవుతారు.
* తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. తలనొప్పి, కడుపు నొప్పి, లేదా ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ పెద్దవాళ్ల దృష్టిని గొడవ మీది నుంచి మళ్లించడానికి ప్రయత్నిస్తుంటారు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.