close

తాజా వార్తలు

డేటా వచ్చి పోయేలోపు ఏం జరుగుతోంది?

వాట్సాప్‌ సెక్యూరిటీ

సంభాషణలకైనా.. సమాచారాన్ని చేరవేయడానికైనా.. అందరి ఫోన్లలో ఒక్కటే వారధి వాట్సాప్‌.. నిత్యం వాడుతున్నాంగానీ.. దాంట్లోని సెక్యూరిటీ అంశాలపై ఎప్పుడైనా ఆలోచించారా? లేదనకుండా విధిగా అవగాహన తెచ్చుకోవాలి.. లేకుంటే.. హ్యాకర్లు ప్రయోగించే స్పైవేర్‌లకు చిక్కొచ్చు

గత వారమంతా టెక్నాలజీ ప్రియులు కంగారు పడ్డారు. ఓ హ్యాకర్‌ స్పైవేర్‌ దాడితో వాట్సాప్‌కి ఏమైందని చెక్‌ చేసుకున్నారు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో డేటాని దొంగిలించడం సాధ్యం అవుతుందా? అని సందేహించారు. డేటా సెక్యూరిటీపై తికమక పడ్డారు. స్పైవేర్‌ రూపంలో తమ ఫోన్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారేమోనని భయపడ్డారు. వాట్సాప్‌ వాయిస్‌ కాల్‌ రూపంలో ఫోన్‌లోకి వ్యాపించే స్పైవేర్‌ తమ కాల్‌లాగ్‌లోకి వచ్చిందేమోనని చెక్‌ చేసుకున్నారు. కానీ, దాడిని పసిగట్టడం కష్టమైంది. ఎందుకంటే.. కాల్‌ వచ్చిన తర్వాత క్షణాల్లోనే కాల్‌ లాగ్‌ మాయం అవుతుంది. యూజర్లు స్పైవేర్‌ దాడిని గుర్తించే ఆస్కారం లేదు. దాన్నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. ఇరు ఓఎస్‌ల యూజర్లు ఆ యాప్‌ స్టోరుల్లోకి వెళ్లి వాట్సాప్‌ని కొత్త వెర్షన్‌కి అప్‌డేట్‌ చేసుకోవడమే. యాపిల్‌ యూజర్లు ‘యాప్‌స్టోర్‌’కి వెళ్లి కొత్త వెర్షన్‌కి (2.19.51) అప్‌డేట్ చేయాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్లే స్టోర్‌కి వెళ్లి లేటెస్ట్‌ వెర్షన్‌ని (2.19.134) ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. సర్వీసు ఏదైనా ఒక్కో దానికి ఒక్కో పాస్‌వర్డ్‌ పెట్టుకోండి. యాప్‌ స్టోర్‌ల నుంచి అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు ఆయా యాప్‌లకు ఉన్న ఆదరణ ఎంతో చూడండి. మెసేజ్‌ రూపంలో వచ్చిన లింక్‌లను క్లిక్‌ చేసి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయొద్దు. వాడే సర్వీసు ఏదైనా ‘టు-స్టెప్‌ వెరిఫికేషన్‌’ని ఎనేబుల్‌ చేయడం మంచిది.
విషయం భద్రమేనా?
వాట్సాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్‌ ‘ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’. అంటే.. రెండు మొబైల్స్‌ మధ్య సురక్షితంగా జరిగే సంభాషణ. మీరు ఏ మొబైల్‌ నుంచి డేటాని పంపుతున్నారో ఆ మొబైల్‌ ఒక ఎండ్‌ సిస్టం అయితే... మీరు పంపిన డేటాని స్వీకరించే మొబైల్‌ మరో ఎండ్‌ సిస్టం అన్నమాట. ఈ రెండిటి మధ్య ప్రసారం అయ్యే డేటా ఏదైనా ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లోనే వెళ్తుంది. డేటా మొత్తం ముక్కలు ముక్కలుగా మూడోకంటికి అర్థం కాకుండా మారిపోతుంది. ఉదాహరణకు మీరు ‘హయ్‌’.. అని మెసేజ్‌ పంపితే మధ్యలో ఎన్‌క్రిప్ట్‌ అయ్యి అర్థం కాని భాషలో (హాయ్‌ కాస్తా ‘జీగో’గా) మారిపోతుంది. ఇలా ఎన్‌క్రిప్ట్‌ అయిన పదం డీక్రిప్ట్‌ అయ్యి మామూలుగా మారడానికి ప్రత్యేక అల్గారిథం వ్యవస్థ ఉంటుంది. వాట్సాప్‌లో ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ఉంది. దీంతో యూజర్ల సంభాషణల్ని వాట్సాప్‌ సర్వర్‌ నిర్వాహకులు కూడా గుర్తించడం సాధ్యం కాదు. అంటే.. మీ ఫ్రెండ్‌ పంపిన డేటా మీ మొబైల్‌ని చేరగానే ప్రత్యేక ‘కీ’ పాస్‌వర్డ్‌తో డీక్రిప్ట్‌ అయ్యి ‘జీగో’ పదం ‘హాయ్‌’గా కనిపిస్తుంది. వాట్సాప్‌లో ఇదంతా ఆటోమాటిక్‌గా జరిగే ప్రాసెస్‌. మరైతే, ఇంతటి కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలో హ్యాకర్లు డేటాని ఎలా మానిటర్‌ చేయగలరు? స్పైవేర్‌లను ఎలా పంపగలరు? ఇక్కడే ఓ లాజిక్‌ ఉంది. వినియోగదారులు గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. అదే... ‘మీ డేటాకి ఉన్న స్థితి’. రెండు రకాలుగా డేటా మనుగడ సాగిస్తుంది. ‘డేటా ఆన్‌ మూవ్‌, డేటా ఎట్‌ రెస్ట్‌’.
డేటా ఆన్‌ మూవ్‌..
మీరు పంపిన డేటా మీ మొబైల్‌ నుంచి మరో మొబైల్‌కి వెళ్తున్నప్పుడు ‘డేటా ఆన్‌ మూవ్‌’ అంటారు. ఈ స్థితిలో డేటా మొత్తం ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లోనే ఉంటుంది. ఉదాహరణకు మీరేదైనా వీడియో క్లిప్‌ని వాట్సాప్‌లో మీ ఫ్రెండ్‌కి పంపితే.. అది ట్రాన్స్‌ఫర్‌ అయ్యే క్రమంలో డేటా ఆన్‌ మూవ్‌ స్థితిలో ఉంటుంది. అంటే.. ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో డేటా సురక్షితం అన్నమాట.
డేటా ఎట్‌ రెస్ట్‌
మీరు పంపిన డేటా మరో మొబైల్‌కి చేరాక ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌ నుంచి డీక్రిప్ట్‌ అవుతుంది. అప్పుడే సాధారణ స్థితిలో డేటా యూజర్‌కి కనిపిస్తుంది. యూజర్‌ డిలీట్‌ చేస్తే తప్ప ఎప్పటికీ డేటా అలానే ఉంటుంది. దీన్నే డేటా ఎట్‌ రెస్ట్‌ అంటారు. డేటా ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ ఫోన్‌ ఎవరైనా తీసుకుంటే ఇతరులు ఎవరైనా మీ డేటాని చూడొచ్చు. ఉదాహరణకు అన్‌లాక్‌ చేసి ఫోన్‌ని ఇతరులకు ఇస్తే మీ వాట్సాప్‌లో డేటాని చూడొచ్చు కదా. ఒకవేళ మీరు ఫోన్‌ ఇతరులకు ఇవ్వకున్నా.. నిత్యం నెట్‌కి అనుసంధానమై ఉన్న ఫోన్‌ని స్పైవేర్‌తో హ్యాకర్లు హ్యాక్‌ చేసారు అనుకుందాం. డేటా ఎట్‌ రెస్ట్‌లో ఉన్నప్పుడు వాట్సాప్‌లో ఉన్న డేటానైనా హ్యాకర్లు చూడొచ్చు. మీ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు అన్నీ కనిపిస్తాయి. ఫోన్‌ కెమెరా, మైక్రోఫోన్‌లనూ కంట్రోల్‌ చేసే అవకాశం ఉంది. అంటే.. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థ వాట్సాప్‌కి ఉన్నప్పటికీ డేటా ఎట్‌ రెస్ట్‌లో ఉన్నప్పుడు హ్యాకర్ల చేతికి చిక్కడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాట్సాప్‌ వెబ్‌ మాల్వేర్‌లను ఎంటర్‌ కాకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కువగా వివిధ రకాల ఆఫర్లతో కూడిన మెసేజ్‌ల రూపంలో వస్తాయి. వాటిల్లో ఉన్న లింక్‌లను క్లిక్‌ చేస్తే చాలు. వాట్సాప్‌ హ్యాకర్‌ కంట్రోల్‌లోకి వెళ్లినట్టే. డేటా బ్యాక్‌అప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్‌ డేటాని ఎప్పటికప్పుడు గూగుల్‌ డ్రైవ్‌లోకి ఆటోమాటిక్‌గా బ్యాక్‌అప్‌ అయ్యేలా చేస్తాం. లేదంటే.. ఫోన్‌లోనూ బ్యాక్‌అప్‌ పెట్టుకుంటాం. ఇలా చేస్తున్న బ్యాక్‌అప్‌కి ఎలాంటి ఎన్‌క్రిప్షన్‌ ఉండదు. ఎవ్వరైనా యాక్సెస్‌ చేయొచ్చు. అందుకే బ్యాక్‌అప్‌ డేటాని కూడా ఎన్‌క్రిప్ట్‌ చేయడం మంచిది.
మరిన్ని సెక్యూరటీ వివరాలకు https://www.infosecawareness.in వెబ్‌సైట్‌ని చూడండి
కొత్తగా కొన్ని..

వాట్సాప్‌లో కంటెంట్‌ ఏదైనా ఎన్ని సార్లు ఫార్వర్డ్‌ అయ్యి వచ్చిందో తెలుసుకోవచ్చు. అందుకు వచ్చిన మెసేజ్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేస్తే ‘ఫార్వర్డింగ్‌ ఇన్ఫో’ కనిపిస్తుంది. అందులో ఈ మెసేజ్‌ ఎంతమందికి ఫార్వర్డ్‌ చేశారు తదితర వివరాలు కనిపిస్తాయి.
పంపిన మెసేజ్‌కి స్నేహితుడి నుంచి స్పందన స్టిక్కర్‌ రూపంలో వచ్చింది. నోటిఫికేషన్‌లో ఆ స్టిక్కర్‌ కనిపించదు. చూడాలంటే వాట్సాప్‌ని ఓపెన్‌ చేయాల్సిందే. ఈ ఇబ్బంది లేకుండా త్వరలో నోటిఫికేషన్‌లోనే స్టిక్కర్‌/యానిమేటెడ్‌ స్టిక్కర్లను నేరుగా చూసుకోవచ్చు.
* ఇప్పటి వరకూ ఇమేజ్‌లు, జిఫ్‌లు పంపుకొనే సౌలభ్యం ఉంది. ఈ మధ్యే స్టిక్కర్లు జోడించారు. త్వరలో యానిమేటెడ్‌ స్టిక్కర్లు తీసుకొస్తోంది. ఇక మీ మనసులోని భావాలు కదులుతాయి.
* వాట్సాప్‌లో వచ్చిన వీడియోలను యాప్‌లోనే ప్లే చేసి చూస్తున్నాం. ఇకపై వెబ్‌సైట్‌ లింక్స్‌కు కూడా అదే మాదిరి యాప్‌లోనే చూడొచ్చు. ‘ఇన్‌-యాప్‌ బ్రౌజర్‌ ఆప్షన్‌’తో క్లిక్‌ చేసిన లింక్‌ వాట్సాప్‌ యాప్‌లోనే ఓపెన్‌ అవుతుంది.
* బ్యాటరీ ఆదా..  కళ్లకు శ్రమని తగ్గిస్తూ ఇప్పుడన్నీ ‘డార్క్‌మోడ్‌’ లోకి మారుతున్నాయ్‌. వాట్సాప్‌ కూడా ఇప్పుడు అదే దారిలోకి వచ్చింది. త్వరలో వాట్సాప్‌లో ‘డార్క్‌ మోడ్‌’ వస్తుందట.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.