close

తాజా వార్తలు

మోటూ... పత్లూగా!

పిల్లలు - పెంపకం

పిల్లలు కాస్త సన్నగా అయితే చాలు... చిక్కిపోతున్నారని ఏవో ఒకటి పెట్టేసి బరువు పెరిగేలా చేస్తాం. అదే కాస్త బరువు పెరిగితే... ఎంత బొద్దుగా ఉన్నారో అని మురిసిపోతాం. ఎటు తీసుకున్నా... పిల్లలు లావుగా ఉంటేనే ఆరోగ్యకరం అనే భ్రమలో ఉంటాం. కానీ ఆ లావే వాళ్లకు చేటు చేస్తుందని  ఎప్పుడయినా ఆలోచించారా... లేదంటే మాత్రం ఇకపై పట్టించుకోండి అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

పొద్దున్నే గ్లాసు పాలు, కాసేపయ్యాక ఇడ్లీ లేదా దోశ... మరో రెండు గంటలాగి అన్నం... మధ్యలో చిరుతిళ్లు... మళ్లీ రాత్రి భోజనం... ఇలా విడతల వారీగా పిల్లలకు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాం. ఎదిగే క్రమంలో వాళ్లకు అవన్నీ అవసరమే. అయితే ఈ రోజుల్లో చిన్నారులు అక్కడితో ఆగడంలేదు. కాస్త    పెద్దయ్యేకొద్దీ రోడ్డువారన దొరికే చిరుతిళ్లు, చిప్స్‌, పిజా, బర్గర్‌ వంటి బేకరీ పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ అంటూ పరిమితి లేకుండా లాగించేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటారనే ధోరణిలో మనమూ చూసీచూడనట్లు వదిలేస్తాం. వీటన్నింటికీతోడు వాళ్లకి శారీరక శ్రమ లేకపోయినా పెద్దగా పట్టించుకోం. మనం చేసే ఆ చిన్న నిర్లక్ష్యమే వాళ్లను స్థూలకాయులుగా మార్చేస్తోంది. ఎదిగే క్రమంలో వాళ్లు బరువు పెరగడం మామూలే కానీ అది మితిమీరితే మాత్రం... చిన్నారులు మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల కాలంలో ఈ సమస్య మనదేశంలో పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలో 20 శాతం మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారట. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా బడికి వెళ్లే పిల్లల్లో 15.8 శాతం మంది ఈ సమస్య ఎదుర్కొంటారని సర్వేలు చెబుతున్నాయి. చైనాలో 2025 నాటికి 48.5 మిలియన్ల పిల్లలు అధిక బరువుతో బాధపడతారని అధ్యయనాల అంచనా. అదే సమయంలో భారతదేశం 17.3 మిలియన్ల పిల్లలతో దాని తరువాతి స్థానంలో నిలవనుంది. 1980 నుంచి ఈ సమస్య పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. కేవలం ఆహారం తీసుకోవడమే దీనికి కారణమా అంటే కాదు. మరికొన్ని ఉన్నాయి.

జీవనశైలి మొదలు... 

* పొడుగ్గా ఉండే తల్లిదండ్రుల పిల్లలు కూడా దాదాపుగా పొడుగ్గానే ఉంటారు. అలాగే అధిక బరువు కలిగిన తల్లిదండ్రుల పిల్లలు కూడా ఇదే విధంగా ఉండొచ్చు. ఇది కొందరికి వంశపారంపర్యంగా వస్తుంది. చాలా సందర్భాల్లో చిన్నతనంలోనే ఊబకాయం రావడానికి కారణమిదే. 
* పిల్లలకు తల్లిపాలను మించిన పోషకాహారం ఉండదు. అయితే కొందరు బాల్యం నుంచే డబ్బా పాలు అలవాటు చేస్తారు. ఆరు నెలల తరువాత ఇంట్లో చేసిన పోషకాహారం కాకుండా చిరుతిళ్లు, బయటి ఆహారం మొదలుపెడతారు. దాంతోనూ బరువు పెరుగుతారు. పెద్దయ్యే కొద్దీ ఇలాంటి ఆహారానికే అలవాటు పడతారు. దీనిలో    కెలొరీలు ఎక్కువ. పోషకాలు తక్కువ. అవే చేటు చేస్తాయి. 
* ఇప్పటి పిల్లల్లో ఊబకాయం రావడానికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పు. ఒకప్పుడు పిల్లలు బయటికెళ్లి ఆడుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చదువుల పేరుతో ఎక్కువసేపు కదలకుండా గడుపుతున్నారు. ఇంట్లోనే ఉండి టీవీ, ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. దాంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇప్పుడు ఊబకాయానికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరక శ్రమ లోపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చిన్న చిన్న వాటికే కుంగిపోతారు. ఎదుగుదల కూడా ఉండదు. 
* పిల్లలు అన్నింట్లో రాణించాలని కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువ. దాంతో చదువుతోపాటు, ఆటపాటలు, ఇతర కళల్లో ముందుండాలని వాళ్లకు విరామం లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ చిన్నారుల్లో ఒత్తిడికి దారి తీస్తాయి. దాన్నుంచి బయటపడేందుకు మితిమీరి తినేయడం కూడా ఓ కారణమే. 

మరేం చేయాలి... 

దీనికి పెద్దపెద్ద చికిత్సలు అవసరంలేదు. వాళ్ల జీవన విధానంలో చిన్నచిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. అదెలాగంటే... 

* పిల్లలు రోజూ కనీసం గంటసేపు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. గ్రోత్‌, రిలాక్సేషన్‌ హార్మోన్లు విడుదలవుతాయి. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. 
* చిన్నతనంలో తల్లిపాలు పట్టాలి. పెరిగే కొద్దీ ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు బదులు ఇంట్లో చేసిన సమతుల పోషకాహారాన్ని అందించాలి. క్షణాల్లో తయారయ్యే జంక్‌ఫుడ్‌, కృత్రిమ చక్కెరలున్న పానీయాలకు దూరంగా ఉంచాలి. 
* ఆహారంలో  తప్పకుండా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. వీటిలో పోషకాలుంటాయి. అధిక కెలొరీలు ఉండవు. 
* పిల్లల్ని నిత్యం చురుగ్గా ఉంచాలి. ఎంత చదువుల ఒత్తిడి ఉన్నా సరే... నడక, జాగింగ్‌ తప్పనిసరి. వాళ్లకు ఇష్టం ఉన్న ఆటల్లో     చేర్పించాలి. అలాగే ఈత, యోగా తరగతులకు పంపించినా ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించాలి. ఇంటిని శుభ్రపరచడం, మెట్లు ఎక్కి దిగమనడం, సైకిల్‌ తొక్కించడం... వంటివీ అవసరమే. ఇవన్నీ చేసినప్పుడు వారికి నచ్చింది ఇవ్వడమో, మెచ్చుకోవడమో చేయాలి. దీనివల్ల వారిలో ఇంకా కష్టపడాలనే ఆసక్తి పెరుగుతుంది. 
* పాఠశాలకు, ఏదైనా పనులకు సైకిల్‌పై పంపించాలి. లేదా నడక అలవాటు చేయాలి. 
* మీరు చేర్చించే పాఠశాలలో తప్పకుండా ఆట   మైదానం ఉండేలా చూసుకోవాలి. కచ్చితంగా ఆటకు కొంత సమయం కేటాయించే పాఠశాలలోనే చేర్పిస్తే మంచిది. 
* ఆరు నెలలలోపు చిన్నారులకు ఫోన్‌ లాంటి వస్తువులు అస్సలు ఇవ్వకూడదు. ఆ తరువాత కూడా ఎలక్ట్రానిక్‌ పరికరాలకు వీలైనంత దూరంగా ఉంచాలి. ఒకవేళ ఫోను ఇచ్చినా... కొంత సమయం కచ్చితంగా పెట్టాలి. టీవీ చూసే సమయాన్ని కూడా తగ్గించాలి. ఇలా చేస్తే ఊబకాయం సమస్య చాలామటుకు తగ్గుతుంది. 

బరువు పెరిగితే ఏమవుతుంది... 

* బాల్యం నుంచే ఊబకాయంతో బాధపడేవారు పెద్దయ్యాక మానసిక సమస్యల బారిన పడతారు. స్నేహితులు, ఇతరులు తమ అధిక బరువును చూసి మోటూ అని హేళన చేస్తుంటే కుంగిపోతారు. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. దేనిని ప్రయత్నించడానికి ఇష్టపడరు. చిన్న చిన్న పనులకే అలసటకు గురవుతారు. చదువుల్లోనూ రాణించలేరు. 
* అధిక బరువు కారణంగా జీవితాంతం కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, చర్మ సంబంధ సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
* ప్రవర్తనా పరమైన సమస్యలు కూడా కనిపిస్తాయి. నిత్యం ఆందోళనకు  గురవుతుంటారు. నలుగురిలో కలవలేరు. ఓటమి భయం వెంటాడుతుంది. 
* శ్వాస సంబంధిత వ్యాధులు వేధిస్తుంటాయి. ఆడపిల్లలు అయితే... పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ బారిన పడొచ్చు. 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.