close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2019 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రమాదం నుంచి పరిహారం దాకా!

మోజుపడి కొన్న కారులో జోరుగా  రైడింగ్‌ చేస్తాం...  ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలో తెలియక గుడ్లు తేలేస్తాం... ఖాళీగా ఉంటే బైక్‌పై జాలీ రైడింగ్‌ చేసేస్తాం... బండి యాక్సిడెంట్‌కి గురైతే బీమా దక్కించుకోవడం తెలియక బిక్కమొహం వేస్తాం... రైడింగ్‌ రాజాలు, స్టీరింగ్‌ ఓనర్లలో చాలామందిది ఇదే పరిస్థితి... ఈ దుస్థితి తప్పాలంటే ముందీ విషయాలు తెలుసుకోవాలి... సమస్య తీరాలంటే ఆచరణకు సదా సిద్ధంగా ఉండాలి... అదెలాగంటే!!

అనుకోని సంఘటనలు మనల్ని గందరగోళంలో పడేస్తాయి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినపుడు ఒకరకమైన షాక్‌కి గురవుతాం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా లెక్కలేనంత నిర్లక్ష్యంతో డ్రైవింగ్‌ చేసే వాహనదారులు, రోడ్డుకు అడ్డదిడ్డంగా పరుగులు పెట్టే పాదచారులు ప్రమాదాలకు కారణమవుతూనే ఉంటారు. ఒక్కోసారి మన తప్పిదాలూ చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి? ఆ గడ్డు పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
1 తప్పు మనదా? అవతలివాళ్లదా? అన్నసంగతి పక్కనబెడితే వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి.  అప్పుడేం చేయాలి?
ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్‌లకు ఫిర్యాదు చేయాలి. బీమా కంపెనీకి సమాచారం అందించాలి. ఒకవేళ వాహనం నడిపేవాళ్లు గాయాలపాలై  కంప్లైంట్‌ చేయలేని పరిస్థితుల్లో ఉంటే తర్వాతైనా ఫిర్యాదు చేయొచ్చు. ఆలస్యానికి కారణమేంటో వివరించగలగాలి. కుదిరితే సన్నిహితుల ద్వారా సమాచారం అందించాలి. ఒకవేళ మనం ఆసుపత్రిలో చేరితే అక్కడ్నుంచే సమాచారం పోలీసులకు వెళ్లిపోతుంది.
2 మన వాహనాన్ని వేరొకరు ఢీకొట్టారు. పోలీస్‌ కేసు వద్దనీ, కొంత నష్టం భరిస్తానని రాజీకొచ్చారు. అప్పుడేం చేయాలి? బీమా కంపెనీ నుంచి ఆ పరిహారం ఎలా పొందాలి?
ప్రమాదంలో ఎవరి వాహనాలకు నష్టం జరిగినా పద్ధతి ప్రకారం ముందుకెళ్తేనే బీమా కంపెనీ నుంచి పరిహారం దక్కుతుంది. మన మోటార్‌సైకిల్‌ లేదా కారు ప్రమాదానికి గురైనపుడు ముందు పోలీసులు బీమా కంపెనీకి సమాచారం అందించాలి. ఎఫ్‌ఐఆర్‌, ఇతర పత్రాలు జత చేసిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే ఓన్‌ డ్యామేజీ కింద నష్టపరిహారం త్వరగానే అందుతుంది. మన కారణంగా ఇతరులకు, ఇతరుల ద్వారా మనకు నష్టం జరిగినపుడు థర్డ్‌పార్టీ బీమా పరిహారం అందాలంటే తప్పనిసరిగా న్యాయప్రక్రియ ద్వారానే సాధ్యం. దీనికోసమే మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిం ట్రైబ్యునళ్లు ఉన్నాయి. వీటిద్వారా వెళ్తే ఒక్కోసారి నెలలు, ఏళ్లు పట్టొచ్చు. ఇవేం గొడవలొద్దు ఎంతో కొంత మొత్తం ఇచ్చిపుచ్చుకొని సెటిల్‌మెంట్‌ చేసుకోవాలి అనుకుంటారు చాలామంది. ఇలా కోర్టు బయట చేసుకున్న సెటిల్‌మెంట్‌ మొత్తం రాబట్టుకోవాలనుకుంటే ఒక్కోసారి దశాబ్దాలు పట్టొచ్చు.
3 ఎవరో వ్యక్తి మన వాహనాన్ని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. బండి పాడైంది. ఏం చేయాలి?
వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయిన వ్యక్తిని, వాహనాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ అయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదీ కుదరనపుడు పోలీసులకు సమాచారం అందించి, డ్యామేజీ అయిన మన వాహనాన్ని, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీయాలి. భవిష్యత్తులో సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. తర్వాత వాహనాన్ని అక్కడ్నుంచి కదిలించాలి.
4 దురదృష్టవశాత్తు మనం ఒక ప్రమాదానికి కారణయ్యాం అనుకుందాం. అవతలివాళ్లకు సాయం చేయాలనుకున్నా ఆ పరిస్థితి లేనపుడు ఎలా స్పందించాలి?
ఇలాంటి సందర్భాల్లో ప్రమాద కారకులు చేసే మొదటి తప్పు సంఘటనా స్థలం నుంచి పారిపోవడం. చుట్టుపక్కల జనం దాడి చేసి కొడతారనే భయం, చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అత్యధికులు ఇలాగే చేస్తారు. ఇది ఆచరణీయం కాదు. మన కారణంగా తప్పు జరిగితే ఎదుటివాళ్లతో సామరస్యపూర్వక పరిష్కారం ఆలోచించాలి. అంతకన్నా ముందు క్షతగాత్రులైనవారిని బాధ్యతగా ఆసుపత్రిలో చేర్చాలి. ఈ పరిస్థితి లేనపుడు, జనం దాడికి ప్రయత్నిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవాలి.
5 ప్రమాదం జరిగినపుడు పోలీసులు, బీమా ప్రతినిధులు వచ్చేంతవరకు బండిని అక్కడ్నుంచి కదిలించకూడదు అంటారు. నిజమేనా?
అదేం లేదు. ఫలానాచోట ప్రమాదం జరిగింది అని సమాచారం అందించిన తర్వాత ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా వాహనాన్ని పక్కకి జరపొచ్చు. బండి ఏ వర్క్‌షాప్‌లో ఉందో చెబితే బీమా ప్రతినిధి సర్వేయర్‌ వచ్చి అక్కడే నష్టం అంచనా వేస్తారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవరిది తప్పు? ఈ వివరాలన్నీ పోలీసులు చూసుకుంటారు.
6 బండికి చిన్న డ్యామేజీ జరిగినా క్లెయిం చేసుకోవాలంటే ప్రక్రియ అంతా పూర్తి చేయాలా?
కాంప్రెహెన్సివ్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే ప్రతి ప్రమాదానికీ నష్టపరిహారం పొందవచ్చు. అయితే సంవత్సరం మొత్తంలో ఎలాంటి క్లెయిం చేసుకోకపోతే బీమా కంపెనీలు వచ్చే ఏడాది  నో క్లెయిం బోనస్‌ కింద ప్రీమియాన్ని గరిష్ఠంగా యాభైశాతం తగ్గిస్తాయి. వాహనం మార్చేసి కొత్త వాహనం కొనుక్కున్నా దాన్ని బదలాయించుకోవచ్చు. ఉదాహరణకు ఓ కారుకి ఇరవై వేల ప్రీమియం ఉంటే వచ్చే ఏడాది పదివేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంటుంది. కానీ చిన్నచిన్న క్లెయింలు చేసుకుంటే ఎన్‌సీబీ నష్టపోతాం. పైగా లోడింగ్‌ ప్రీమియం అదనంగా చెల్లించాలి. దీనికి బదులు చిన్న ప్రమాదాలకు నష్టపరిహారం తీసుకోకుండా ఉంటేనే మేలు.

 

క్లెయిం దరఖాస్తు తీరిది

వాహనానికి బీమా చేయడం తేలికే. ప్రమాదం జరిగినపుడు నష్టపరిహారం దక్కించుకోవడమే క్లిష్టమైన ప్రక్రియ. బీమా కంపెనీకి సమాచారం ఇవ్వడం, పత్రాల సమర్పణ, పరిహారం అందుకోవడం.. సుదీర్ఘ ప్రహసనం. సాఫీగా సాగడానికి చేయాల్సినవివి.
ఎఫ్‌ఐఆర్‌ సమర్పణ: నష్టపరిహారం కోరుతూ దరఖాస్తు చేస్తున్నపుడు తప్పకుండా జత చేయాల్సింది ఎఫ్‌ఐఆర్‌ కాపీ. బండిపై సొట్టలు, గీతలు పడటం.. చిన్నచిన్న ప్రమాదాలకైతే ఇదవసరం లేదు. భారీ ప్రమాదం, సంఘటనలో ఎవరైనా చనిపోవడం, వాహనం చోరీకి గురైతే తప్పకుండా ఎఫ్‌ఐఆర్‌ కాపీ సమర్పించాలి.
సమాచారం అందించాలి: ప్రమాదం జరిగిన వెంటనే ఆ వివరాలు బీమా సంస్థకు తెలియచేయాలి. ప్రమాదం జరిగిన 48 గంటల్లోగా ఆ సమాచారం అందించాలని  అత్యధిక బీమా కంపెనీలు కోరతాయి. ఆ సమయం మించితే క్లెయిం నిరాకరిస్తాయి. కొన్ని సంస్థలైతే ఏడురోజుల వరకూ గడువునిస్తున్నాయి. కానీ ఎంత తొందరగా సమాచారం అందిస్తే అంత త్వరగా నష్టపరిహార ప్రక్రియ ముందుకెళ్తుంది. దీంతోపాటు ప్రమాద సమయంలో పాడైపోయిన వాహనాన్ని కొన్ని బీమా సంస్థలు గ్యారేజీవరకు తీసుకెళ్లడానికి సాయపడతాయి.
పత్రాల సమర్పణ: మోటార్‌ క్లెయిం పత్రం, బీమా పాలసీ కాపీ, ఆర్‌సీ, ప్రమాదం జరిగినపుడు వాహనం నడిపిన వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌.. ఇవన్నీ సమర్పించిన తర్వాతే బీమా పరిహార ప్రక్రియ మొదలవుతుంది. ప్రమాదం జరిగినపుడు క్లెయిం కోసం ఏమేం పత్రాలు ఇవ్వాలి? ఎప్పట్లోగా ఇవ్వాలి? ఈ విషయాలు చాలామందికి తెలియదు. కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేసి ముందే అడిగి తెలుసుకోవాలి.
పాలసీ డాక్యుమెంట్‌ చదవాలి: వాహన పాలసీ కవర్‌నోట్‌తోపాటు పాలసీ డాక్యుమెంట్‌ కూడా ఇస్తారు. అందులో పూర్తి వివరాలుంటాయి. దాన్ని క్షుణ్నంగా చదివితే క్లెయిం సందేహాలు సగానికిపైగా తీరతాయి. అవసరమైతే ఎవరైనా న్యాయవాది  సాయం కూడా తీసుకోవచ్చు.

ఈ తప్పులతో తిప్పలు

బీమా క్లెయిం కావాలంటే అన్ని పత్రాలు సమర్పించడమే కాదు.. పక్కాగా ఉండాలి. ఏమాత్రం లోటుపాట్లున్నా, తప్పుడు సమచారం అందించినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఆ చేయకూడని పనులేంటో వివరంగా తెలుసుకుందాం.
వాస్తవాలు దాచొద్దు: ప్రమాదం జరిగినపుడు చాలామంది నిజాలు దాచడానికి ప్రయత్నిస్తారు. నష్టాన్ని మరింత ఎక్కువ చేసి చూపిస్తారు. ఈ రెండూ తప్పే. ఎన్నో ప్రమాద సంఘటనలు చూసిన బీమా ప్రతినిధులు వాస్తవాలను పసిగడతారు. సమాచారం అసంబద్ధంగా ఉందని క్లెయిం నిరాకరిస్తారు.  .
తొందరపడొద్ద్దు: క్లెయిం ప్రక్రియలో మనకు సరైన న్యాయం జరిగిందా? నష్టపరిహారం అందిందా? అని ఓసారి రివ్యూ చేసుకోవాలి. డబ్బులొస్తున్నాయనే సంతోషంలో  తొందరపడి ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయొద్దు. బీమా కంపెనీ ఇచ్చే మొదటి అంచనా (ఫస్ట్‌ ఎస్టిమేట్‌) నష్టపరిహారం విలువ సబబే అని సంతృప్తి చెందాకే  ముందుకెళ్లాలి.

ఇవీ పాటించండి

వాదనలొద్దు: రెండు వాహనాలు ఢీకొట్టినపుడు ముందు వాగ్యుద్ధం మొదలవుతుంది. తప్పెవరిదైనా తమది కాదన్నట్టే వాదనకు దిగుతారు ఇద్దరు. ఒకరిపై ఒకరు భౌతిక దాడికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే సహనం అవసరం. అతిగా స్పందించటం తగదు. వాదన, గొడవతో సమస్య తీరదు. మౌనంగా ఉండటమే పరిష్కారం. ప్రమాదానికి గురైన వాహనాలను ముందు రోడ్డు పక్కకి తీస్కెళ్లాలి. సమస్య తీరకపోతే ట్రాఫిక్‌ పోలీసులు, పెద్దమనుషులుంటే కలగజేసుకొమ్మనాలి.
రాతపూర్వకంగా: చిన్నచిన్న ప్రమాదాలు జరిగినపుడు కేసుల దాకా వెళ్లకుండా సమస్యను ఏదోరకంగా పరిష్కారం చేసుకోవాలనుకుంటారు చాలామంది. పోలీస్‌స్టేషన్లు, కోర్టులంటూ ఏళ్లకొద్దీ తిరగడం ఇష్టంలేక  బాధితులకు నష్టపరిహారం ముట్టజెప్పి వివాదాన్ని ‘సెటిల్‌’ చేసుకుంటారు. ఈ ఒప్పందం రాతపూర్వకంగా ఉండాలి. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా అవతలివారు కేసు వేయకుండా సాక్ష్యంగా ఉంటుంది. 
హెచ్చరిక బోర్డు: ప్రమాదం కారణంగా రోడ్డుపై ఆగిపోయిన వాహనాలు ఇతరుల రాకపోకలకు అడ్డంకిగా ఉంటాయి. వేరే వాహనాలు వాటిని ఢీకొట్టే ప్రమాదముంది. అది జరగకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదస్థలంలో త్రిభుజాకారపు హెచ్చరికల బోర్డు పెట్టాలి. లేదంటే ముందు, వెనక నుంచి కనిపించేలా సంజ్ఞల గుర్తులైనా ఏర్పాటు చేయాలి. మూల మలుపులు, రాత్రివేళల్లో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
తీవ్ర గాయాలైతే: వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేయాలి. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సాయం చేయాలని చాలామంది మనసులో అనుకున్నా కేసులో సాక్ష్యం చెప్పాల్సి వస్తుందనీ, పోలీసుల వేధింపులు ఉంటాయనే ఉద్దేశంతో ముందుకు రారు. కానీ 2016లోనే సుప్రీంకోరు ‘గుడ్‌ సమారిటన్‌ లా’ తీసుకొచ్చింది. దీనిప్రకారం ప్రమాదాల్లో సాయం చేసిన వారికి న్యాయపరంగా తగిన రక్షణలుంటాయని స్పష్టం చేసింది. ప్రమాద కారకులే కాదు.. ఈ సంఘటనకు సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా ముందుకు రావొచ్చు.
ముందు జాగ్రత్తగా: డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం ఆర్‌సీ, బీమా, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఇతర పత్రాలు.. మన వెంటే ఉండాలి. ప్రమాదంలో మన తప్పేం లేకపోయినా ముందు ప్రస్తావించిన పత్రాల్లో ఒక్కటి మిస్సైనా చిక్కుల్లో పడిపోతాం. మద్యం తాగి వాహనం నడపడం, టెక్ట్సింగ్‌, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడం.. ఇవన్నీ తప్పే. వీటితోపాటు వీలుంటే డ్యాష్‌కామ్‌ కెమెరా వాహనాల్లో అమర్చుకోవాలి. ఇవి మన ప్రయాణాన్ని రికార్డు చేస్తాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ల్లోనూ ఇలాంటి సౌలభ్యం  ఉంది. డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.