close

తాజా వార్తలు

పోరాట యోధుడు

అది టీ20 అయినా వన్డేలైనా..టెస్టులైనా ఓ వైపు పరుగుల వరద పారిస్తూనే ఉంటాడు. ప్రశంసలందుకుంటూనే ఉంటాడు. కానీ అతడు ‘వీడు కాస్త తేడా’ టైపు. అద్భుతంగా ఆడుతున్నా.. దుందుడుకు స్వభావంతో నిత్యం వివాదాల్లో నానుతూనే ఉంటాడు. విమర్శలతో తడిసిముద్దవుతూనే ఉంటాడు. క్రమశిక్షణ గల సైనికుడిలా మైదానంలో దూసుకుపోతాడు. అంతలోనే క్రమశిక్షణ చర్యలకు గురవుతాడు. వివాదాలు అతడి కెరీర్‌లో అంతర్భాగం. కానీ ఎన్నిసార్లు పడ్డా.. అన్నిసార్లూ బలంగా లేచాడు. టాంపరింగ్‌ అనంతరం తాజా పునరాగమనం అతడి కెరీర్‌లో అత్యంత ముఖ్యమైంది. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన అతడికి ఈ ఏడాది ఐపీఎల్‌ మేలి మలుపు. తాజా ప్రపంచకప్‌ పెద్ద గెలుపు. పడిలేచిన ఆ పోరాట యోధుడే డేవిడ్‌ వార్నర్‌!

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడకుండానే..

వార్నర్‌ అరంగేట్రమే ఓ సంచలనం. న్యూసౌత్‌వేల్స్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన అతడు.. ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ కూడా ఆడకుండానే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 132 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. 2009లో తన తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 43 బంతుల్లో 89 పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. 2011లో టెస్టు అరంగేట్రం చేశాడు. అన్నింట్లోనూ అదే జోరు కొనసాగించాడు. ఆస్ట్రేలియా రెండు సార్లు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన వార్నర్‌... 345 పరుగులతో ఆసీస్‌ 2015 ప్రపంచకప్‌ గెలవడంలోనూ కీలకమయ్యాడు. 

ఎంత గొప్పగా ఆడినా..

దురదృష్టమో.. స్వయంకృతమో కానీ ఎంత గొప్పగా ఆడినా ఆ ప్రదర్శనను కూడా మరుగున పడేసేలా వార్నర్‌ ఎక్కువగా తప్పుడు కారణాలతోనే వార్తల్లో నిలిచాడు. దురుసు ప్రవర్తనతో అతడు వార్తల్లో నిలిచిన తొలి సందర్భం 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ. తొలి మ్యాచ్‌ తర్వాత పబ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు రూట్‌తో ఘర్షణకు దిగి, అతడిపై చేయిచేసుకున్న వార్నర్‌.. ఆ తర్వాత టోర్నీలో ఆడకుండా సస్పెండయ్యాడు. సస్పెన్షన్‌లో ఉండగా ఆస్ట్రేలియా ‘ఎ ’ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అతడు.. అక్కడ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్‌ సొలెకైల్‌తో గొడవకు దిగాడు. ఇద్దరూ దాదాపుగా కొట్టుకున్నంత పనిచేశారు. ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకోకుంటే అదీ జరిగేదే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌ సస్పెన్షన్‌ను పొడిగించింది. దీంతో అతడు యాషెస్‌లో తొలి మూడు టెస్టులకూ దూరమయ్యాడు. 2014 దక్షిణాఫ్రికా పర్యటనలో ఆతిథ్య జట్టు బాల్‌ టాంపరింగ్‌ చేస్తోందంటూ ఆరోపించి వార్నర్‌ కలకలం రేపాడు. తోటి ఆటగాళ్లే వార్నర్‌తో ఏకీభవించని నేపథ్యంలో ఐసీసీ అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత పెట్టింది. వార్నర్‌ అదే సిరీస్‌లో దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్‌ డికాక్‌తోనూ గొడవపడ్డాడు. ఓ రోజూ మైదానం నుంచి పెవిలియన్‌కు వస్తూ ఓ అభిమానితోనూ ఘర్షణకు దిగాడు. అతడు వార్నర్‌ను కొరికాడు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే వార్నర్‌ వివాదాల జాబితా పెద్దదే.

గుర్రపు స్వారీ కోసం..

వార్నర్‌ గొడవలన్నీ చూసే వాళ్లకు ఆశ్చర్యం కలిగించొచ్చేమో కానీ.. అతడికి మాత్రం మామూలే. అతడు మొదటి నుంచీ ఇంతే. క్లబ్‌ క్రికెట్‌ ఆడేటప్పుడు ఓసారి గుర్రపు స్వారీ కోసం మ్యాచ్‌కు డుమ్మాకొట్టి క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు. అయితే ఇవేమీ అతడి ఆటపై పెద్దగా ప్రభావం చూపలేదు. పరుగులు వరద పారిస్తూనే సాగాడు. కానీ మంచి పేరు సంపాదించలేకపోయాడు. ఐతే అతణ్ని దగ్గరగా చూసినవాళ్లు మాత్రం వార్నర్‌ మంచి మనిషి అంటారు.

అన్నీ ఓ ఎత్తయితే..

వార్నర్‌ కెరీర్‌లో వివాదాలన్నీ ఓ ఎత్తయితే.. 2018లో బాల్‌ టాంపరింగ్‌ వివాదం ఓ ఎత్తు.. కాదు వంద ఎత్తులు. అది అతడి కెరీర్‌నే సంక్షోభంలో పడేసింది. అథముడిగా, ఆట ప్రతిష్టకే మచ్చ తెచ్చిన క్రికెటర్‌గా అతణ్ని అథఃపాతాళానికి నెట్టేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ ఒక టేప్‌తో బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఏడాది నిషేధం విధించింది. అక్కడితో అతడి బాధలు తీరలేదు. స్వదేశంలోనే అభిమానులు ఈసడించుకోవడంతో వార్నర్‌ తీవ్ర క్షోభకు గురయ్యాడు. అతడి కుటుంబమంతా ఎంతో సతమతమైంది. ఇక అతడి కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నారు అంతా..!

మారిన మనిషి

నిషేధం వార్నర్‌లో సంకల్పాన్ని పెంచింది. ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడే కానీ.. క్రికెట్‌కు కాదు. దేశవాళీలో ఆడుతూ, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మళ్లీ ఆసీస్‌కు ఆడడమే లక్ష్యంగా సాగాడు. మనిషీ మారిపోయాడు. బ్యాటింగ్‌లో దూకుడు తగ్గకపోయినా.. వ్యక్తిగా దూకుడు తగ్గించుకున్నాడు. సౌమ్యుడిగా మారిన అతడు.. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండడం మొదలు పెట్టాడు. ప్రపంచకప్‌ ఆడాలన్న లక్ష్యంతో ఉన్న అతడికి 2019 ఐపీఎల్‌ ఓ వరమే అయింది. అద్భుత ఫామ్‌తో సిరీస్‌ ఆసాంతం అదరగొట్టిన అతడు.. ఇంగ్లాండ్‌కూ టికెట్‌ సంపాదించాడు. అక్కడా దంచేస్తున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు 89.40 సగటుతో 447 పరుగులు చేశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా అభిమానుల మనసులు గెలిచాడు.

ఓ మంచి క్రికెటర్‌..!

ఐపీఎల్‌లో బ్యాటుతో పరుగుల వరద పారించడంతో పాటు.. దూకుడు తగ్గించుకోవడంతో.. టాంపరింగ్‌ వివాదాన్ని మరిచిపోయి హైదరాబాద్‌లో అభిమానులు అతడికి బ్రహ్మరథం పట్టారు. అందుకే ఆస్ట్రేలియాకు వెళ్తూ.. మీ మద్దతు మరువలేనంటూ అతడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. అణకువగా ఉండడం, అభిమానుల ప్రేమను పొందడంలో ఉన్న సంతోషం తెలిసొచ్చిందేమో.. ‘మంచి క్రికెటర్‌గా రిటైర్‌కావాలనుకుంటున్నా’ అని వినయంగా ప్రకటించేశాడు వార్నర్‌. ప్రపంచకప్‌లో ఓ చిన్నారి అభిమానికి తన ‘మ్యాచ్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు ట్రోఫీని ఇవ్వడం ద్వారా తన మంచి మనసును చాటుకున్న వార్నర్‌కు మనమూ బెస్టాఫ్‌ లక్‌ చెబుదామా!

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.