close

తాజా వార్తలు

అప్పటి కుర్రాళ్లే.. నేటి హీరోలు

‘యువ ఆటగాళ్లు భావి భారత క్రికెటర్లు. వారిలో సత్తా తెలుసుకొనేందుకు, భవిష్యత్‌ తారలుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతా..’ అండర్‌ 19 భారత్‌ టీమ్‌ కోచ్‌గా ది గ్రేట్‌ వాల్‌  రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆశల ఆకాంక్షలకు ప్రతిరూపాలుగా నిలవాలన్నా.. గత వారసత్వానికి ప్రతీకలుగా మారాలన్నా యువ క్రికెటర్లు ఎంతో కీలకం. అండర్‌ 19 నుంచి దేశ జట్టులోకి ప్రవేశించి రికార్డులు కొల్లగొట్టిన ఆటగాళ్లకు కొదవ లేదు. కేవలం భారత్‌లో మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ అండర్‌-19 క్రికెటర్లకు పెద్ద పీట వేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ వంటి ఆటగాళ్లు అప్పటి అండర్‌-19 ప్రపంచకప్‌.. నేటి వన్డే ప్రపంచకప్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇలా అండర్‌-19 ప్రపంచకప్‌లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఎందరో క్రికెటర్లు ఇప్పుడు కలిసి వన్డే ప్రపంచకప్‌లో పోరాడుతున్నారు. వారు ఎవరెవరంటే..

మళ్లీ కెప్టెన్‌గా వచ్చాడు
ప్రస్తుత ప్రపంచకప్‌ భారత జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లలో ఏడుగురు అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆడిన వారే. కానీ, ఈ ఏడు మందిలో టైటిల్‌ను ముద్దాడిన ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే. 2008 జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో  దక్షిణాఫ్రికాపై ఫైనల్‌లో గెలిచి భారత్‌ ట్రోఫీని అందుకుంది. ఈ టోర్నీలో సారథిగా విరాట్ కోహ్లీ, ఉపసారథిగా రవీంద్ర జడేజాలు వ్యవహరించారు. కోహ్లీ అదే ఏడాది భారత జట్టుకు ఎంపికై రికార్డులను బద్దలు కొడుతూ.. నేడు టీమిండియా కెప్టెన్‌గా, ప్రపంచ నంబరు వన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2009లో జట్టులో స్థానం దక్కించుకున్న జడేజా కెరీర్‌ మాత్రం.. ఎన్నో ఒడిదొడుకులతో సాగింది. 2006 అండర్‌-19 ప్రపంచకప్‌లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మతో కూడా జడేజా కలిసి ఆడాడు.

ఆసీస్‌ నుంచి ముగ్గురు
2006లో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌కు డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, ఉస్మాన్‌ ఖవాజా ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. సెమీ ఫైనల్‌లో పాక్‌ చేతిలో కంగారులు కంగుతినడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అనంతరం వార్నర్‌ కొన్ని ఏళ్లలోనే ఆసీస్‌ జట్టులో చోటు సంపాదించి కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఖవాజా జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఫించ్‌ దేశవాళీ క్రికెట్లో రాణించి వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ ముగ్గురూ జట్టుకు ఎంతో కీలకంగా మారారు. డేవిడ్‌ వార్నర్‌ 447 పరుగులతో టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆరోన్‌ ఫించ్‌ 396 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఖవాజా కీలక ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా.. 187 పరుగులతో పర్వాలేదనిపిస్తున్నాడు.

అప్పటి పులులే ఇప్పుడూ
మొన్న వెస్టిండీస్‌కు షాక్‌ ఇచ్చారు.. నిన్న కంగారులుకు ముచ్చెమటలు పట్టించారు.. మేము పసికూనలేమి కాదు.. బలమైన ప్రత్యర్థులమే అని ప్రపంచానికి చాటి చెబుతున్నారు బంగ్లా పులులు. బంగ్లాదేశ్‌ జట్టులో షకిబ్ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, తమీమ్‌ ఇక్బాల్‌ పాత్ర ఎంతో కీలకం. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను దెబ్బ తీయడంలో వీరి ముగ్గురి పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోనూ అదరగొడుతున్నారు. వీరి ముగ్గురు దోస్తానా ఇప్పటిది కాదు.. 2006లో అండర్‌-19 ప్రపంచకప్‌లో కలిసి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రపంచకప్‌లో షకిబ్‌ 425 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

కలిసి మరోసారి..
న్యూజిలాండ్‌ జట్టులో కేన్‌ విలియమ్సన్‌, ట్రెంట్ బౌల్ట్‌, టిమ్‌ సౌథి ఎంత కీలమమైన ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎన్నో ఏళ్లుగా జట్టుని విజయ తీరాలకు చేర్చుతున్నారు. కానీ, ఈ ముగ్గురూ కలిసి 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో తమ దేశం కోసం పోరాడారనే విషయం చాలా కొంత మంది క్రికెట్‌ అభిమానులకు మాత్రమే తెలుసు. 2008లో కోహ్లీ సేన చేతిలో ఓటమి పాలై కివీస్‌ సెమీఫైనల్‌కు చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం వరుస విజయాలతో దూసుకెళ్తూ తొలి టైటిల్‌పై కన్నేసింది. ప్రపంచకప్‌ కల ఈ సారైనా నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే‌.

త్రిదళంతో టాపర్‌
2015 వన్డే ప్రపంచకప్‌లో ఎదురైన ఘోరపరాభవం నుంచి ఇంగ్లాండ్‌ జట్టు ఎన్నో పాఠాలను నేర్చుకుంది. అనంతరం ఇంగ్లాండ్‌ జట్టు యువ క్రికెటర్లకు పెద్దపీట వేస్తూ జట్టు రూపురేఖలనే మార్చేసింది. నాలుగేళ్లుగా  బెన్‌స్టోక్స్‌, రూట్‌, బట్లర్‌ రాణిస్తూ వన్డేలో ఇంగ్లీష్‌ జట్టును అగ్రస్థానంలో నిలబెట్టారు. ఈ త్రిదళం ఇప్పుడే కాదు.. 2010 అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ కలిసి దేశం కోసం పోరాడారు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న జేమ్స్‌ విన్స్‌ కూడా 2010 అండర్‌ ప్రపంచకప్‌లో వీరితో  కలిసి ఆడినవాడే. అన్ని జట్లలో కంటే అత్యధికంగా అండర్‌-19, వన్డే ప్రపంచకప్‌ కలిసి ఆడుతున్న ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టులోని వారే. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌కు నేడు హిట్టర్లు కొదవ లేకపోవడంతో సొంతగడ్డపై తొలి ప్రపంచకప్‌ను ముద్దాడుతుందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

 - ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.