close

తాజా వార్తలు

ఆతిథ్యం అజేయంగా నిలిచేనా?

కప్పులందు ప్రపంచకప్‌ వేరయా అని ఊరికే అనలేదు. క్రికెట్‌లో ఎన్ని కప్పులు గెలిచినా.. వరల్డ్‌కప్‌ గెలవాలని ప్రతి జట్టు కలలు కంటుంది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. చివరి దాకా పోరాడుతుంది. మొత్తానికి సాకారం చేసుకుంటుంది. అంతటి గొప్ప టైటిల్‌ను సొంత గడ్డపై వారి అభిమానుల మధ్య గెలుచుకుంటే ఆ మధురక్షణాల్ని మాటల్లో వర్ణించలేము. గత రెండు ప్రపంచకప్‌ల్లో ఇదే సెంటిమెంట్‌ పనిచేసింది. 2011లో ఆతిథ్యమిచ్చిన భారత్‌.. కడదాకా పోరాడి టైటిల్‌ను ముద్దాడిన క్షణాలు ఇప్పటికీ మన మదిలో పదిలమే. 2015లో ఆస్ట్రేలియా ఇదే కథను పునరావృతం చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిస్తోంది. సొంత అభిమానుల మద్దతు.. టైటిల్‌ ఫేవరెట్లలో ఇదీ ఓ జట్టు కావడంతో ఇంగ్లాండ్‌ కూడా ఆతిథ్య సెంటిమెంట్‌తో వరల్డ్‌కప్‌ అందుకునేలా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మూడో జట్టుగా చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఇంగ్లిష్‌ జట్టు చరిత్ర సృష్టిస్తుందో? లేక బోల్తా పడుతుందో చూడాలి. ఇదిలాఉంటే గత రెండు టోర్నీల్లో ఆతిథ్య జట్ల హవా ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం..

ఆరంభం మనతోనే..

క్రికెట్‌లో ఫామ్‌, అదృష్టంతో పాటు సెంటిమెంట్‌కూ కాస్త చోటుంది. ఫలానా రంగు జెర్సీతోనే దిగితేనే విజయం సాధిస్తాం. ముందు ఓటములు ఎదురైతేనే తర్వాతి నుంచి గెలుపు బావుట ఎగరవేస్తాం.. ఇలా ఒక్కో జట్టు తమకు కలిసొచ్చిన సెంటిమెంట్‌తో ముందుకు సాగటం సర్వసాధారణం. తాజా టోర్నీలోనూ ఇవి చూస్తూనే ఉన్నాం. అయితే రెండోసారి ప్రపంచకప్‌ అందుకున్న టీమిండియా(2011) మాత్రం సరికొత్త సెంటిమెంట్‌కు తెరలేపింది. అదే ఆతిథ్య జట్టే టైటిల్‌ అందుకోవడం. అప్పటివరకూ జరిగిన 9 టోర్నీల్లోనూ ఏ జట్టూ ఇలా ట్రోఫీ గెలిచిన దాఖలాలు లేవు. 1979లో ఇంగ్లాండ్‌కు ఇలాంటి అవకాశం దొరికినా ఫైనల్లో విండీస్‌ ముందు తలవంచింది. కానీ 2011లో భారత్ మాత్రం అలా కాదు. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ కలిసి సంయుక్తంగా టోర్నీని నిర్వహించాయి. వాంఖడే వేదికగా శ్రీలంకతో ఫైనల్లో గెలిచి సొంత గడ్డపై వరల్డ్‌కప్‌ గెలిచిన తొలి జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది. 

టోర్నీ ఇలా..

14 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. గ్రూపు-ఎలో పాకిస్థాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జింబాబ్వే, కెనడా, కెన్యా ఉండగా..  గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గ్రూపు దశలో ఒక్కో జట్టు మిగతా జట్లతో ఆరు మ్యాచ్‌లాడాయి. ఇందులో టాప్‌-4లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. 

భారత్‌ జయభేరి.. 

గ్రూప్‌-బిలో ఉన్న భారత్‌ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను టై చేసుకొని, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడింది. దీంతో గ్రూప్‌ దశలో 9 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. క్వార్టర్స్‌లో ఆసీస్‌ రూపంలో మనకు బలమైన ప్రత్యర్థి ఎదురైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందు ఆసీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్‌ 47.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

దాయాదితో సెమీస్‌..

సెమీస్‌లో పాక్‌తో పోరాటం. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనూ మనదే విజయం. భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. సచిన్‌(85) రాణించాడు. తర్వాత మన బౌలర్లు రెచ్చిపోయారు. బౌలింగ్‌ చేసిన ఐదుగురు తలో రెండు వికెట్లు తీయడంతో 49.5 ఓవర్లలో పాక్‌ 231 పరుగులకే చాపచుట్టేసింది.  

ఫైనల్లో మహీ మురిపెం..

ముంబయి వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. లంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని ఎంఎస్‌ ధోనీ(91నాటౌట్‌) కడదాకా నిలిచి మరీ భారత్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో గంభీర్‌(97) పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఇలా సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో టైటిల్‌ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర లిఖించింది.  

ఆసీస్ అదే జోరు‌..

2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ సంయుక్తంగా నిర్వహించాయి. 14 జట్లు రెండేసి ఫూల్‌లుగా విడిపోయి తలపడ్డాయి. ఫూల్‌-ఏ లో న్యూజిలాండ్‌, ఆసీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌ ఉన్నాయి. న్యూజిలాండ్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ అపజయమే లేకుండా ఆ దశలో అగ్రస్థానంలో కొనసాగింది. తర్వాతి స్థానాల్లో ఆసీస్‌, లంక, బంగ్లాదేశ్‌ నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఫూల్‌-బి లో భారత్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, యూఏఈ ఉన్నాయి. ఢిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లోనూ బంగ్లాదేశ్‌పైనా భారత్‌దే విజయం. కానీ సెమీస్‌లో ఆస్ట్రేలియా ముందు తలవంచక తప్పలేదు. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. స్మిత్‌(105) శతకంతో చెలరేగాడు. టీమిండియా మాత్రం 46.5 ఓవర్లలోనే 233 వద్ద ఆలౌటైంది. ధోనీ(65) మాత్రమే పోరాడాడు. దీంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమణ. 

కివీస్‌తో ఆసీస్‌ ఢీ.. 

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 45 ఓవర్లకి 183 పరుగులకే ఆలౌటైంది. అసలే ఆల్‌టైమ్‌ ఫేవరెట్.. అందులోనూ నాలుగుసార్లు టైటిల్‌ విజేత.. ఛేదించాల్సిన లక్ష్యం కూడా అంత పెద్దదేమీ కాదు. దీనికితోడు సొంతమైదానంలో ఓ జట్టు మరో టైటిల్ అందుకోవడానికి ఇంత కంటే గొప్ప వాతావరణం ఇంకేం కావాలి. ఫించ్‌(0)ముందే ఔట్‌ అయినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ జట్టును గెలిపించారు.33.1 ఓవర్లలోనే ఆసీస్‌ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇలా సొంతగడ్డపై టైటిల్‌ గెలిచిన రెండో జట్టుగా క్లార్క్‌సేన భారత్‌ సరసన చేరింది. 

ఇంగ్లాండ్‌కు నిలుస్తుందా?

క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌ కానీ ఆ జట్టు ఇప్పటికీ వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడే అదృష్టానికి నోచుకోలేదు. ముందుగా మూడు సార్లు(1975, 79, 83) ఆతిథ్యం ఇచ్చినా శూన్యహస్తాలు తప్పలేదు. మరో మూడు సార్లు(1979, 87, 92) చివరి దాకా పోరాడినా దురదృష్టం రన్నరప్ రూపంలో వెక్కిరించింది. అయినా ఇంగ్లాండ్‌ పట్టు వదల్లేదు. అప్పటి నుంచి ఇంకా పోరాడుతూనే ఉంది. కానీ ఈసారి మామూలుగా కాదు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో బరిలోకి దిగింది. కానీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ప్రస్తుతం పాయింట్లపట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలిస్తేనే ఆ జట్టు సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ ఆతిథ్య హవాను కొనసాగించడం కష్టమే. కానీ సొంత అభిమానుల మధ్య పోరాటం కావున ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. చివరిదాకా తెగించి ఆడే ఆటగాళ్లు జట్టు నిండా ఉండటంతో కచ్చితంగా ఇంగ్లాండ్‌ ముందడుగు వేస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వేళ అదే జరిగితే తర్వాత ఇంగ్లాండ్‌ను ఆపడం ఏ జట్టుకైనా కష్టంతో కూడకున్న పనే. అన్నీ కలిసొస్తే సొంతగడ్డపై టైటిల్‌ గెలిచిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆసీస్‌తో ఓటమి అనంతరం ఆ జట్టు సారథి మోర్గాన్‌ అన్నట్లు ఇక వారి రాత వారి చేతుల్లోనే ఉంది. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.