close

తాజా వార్తలు

ఫైనల్ పోరు ఆసీస్‌-భారత్‌ మధ్యే కానీ..

క్రికెట్‌కు ఇది మంచిది కాదు: ఇయాన్‌ ఛాపెల్‌

లండన్‌: ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండు సెమీస్‌లు, ఓ ఫైనల్‌ సహా మొత్తంగా మరో వారంలో ఈ మెగా టోర్నీ మురిపెం ముగిసిపోనుంది. అంచనాలు తలకిందులు కాలేదు. సంచలనాలూ కనిపించలేదు. అనుకున్నట్లే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. దీనిలోభాగంగా కొందరు క్రీడా పండితులు ఓ అడుగు ముందుకేసి.. అప్పుడే ఫైనల్లో తలపడే జట్లు ఇవి అంటూ లెక్కలు కడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ తన గళాన్ని కాస్త వినూత్నంగా వినిపించారు. ఫైనల్‌ పోరు ఆసీస్‌-భారత్‌ మధ్య ఖాయంగా కనిపిస్తున్నా, ఆటపరంగా అది అంత ఆరోగ్యకరం కాదంటున్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని ఆంతర్యాన్ని ఆయన ఇలా బయటపెట్టాడు.

‘క్రీడా విశ్లేషకుల అంచనాలే నిజం అయ్యాయి. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌లే సెమీస్‌కు చేరాయి. అద్భుతమైన ఆటతో టోర్నీలో మంచి ప్రదర్శన సాగించాయి ఈ జట్లు. అందుకు తగ్గ వనరులూ ఆ జట్లకు అదనపు బలం. తమ తమ బోర్డుల నుంచి ఆర్థిక, ఆరోగ్యకరమైన ప్రోత్సాహం, ఆటగాళ్లలో చక్కని సమన్వయం వంటివి ఇంకొన్ని కారణాలు. ఇది అభినందించదగ్గ విషయమే. అయితే, సంచలనాలు లేకుండానే ముందుగా అనుకున్న జట్లే రేసులో ఉండటం కాస్త చప్పగా అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌కు ఇది అంత మంచిది కాదు. తమ జట్టే గెలవాలని సగటు క్రికెట్‌ అభిమాని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ టోర్నీకో కొత్త జట్టు ఛాంపియన్‌గా కనిపిస్తేనే ఆటపై ఆసక్తి పెరుగుతుంది. 1983లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో భారత్‌ విండీస్‌పై విజయంతో తొలిసారి ట్రోఫీ ముద్దాడింది. 1992లో పాకిస్థాన్‌ కూడా అలాగే. 1996లో శ్రీలంక అదే చరిత్ర సృష్టించి ఇలా సంచలనాలకు బాటలు పరిచింది. అప్పటికి అదే ఘనచరిత్ర. 

ఇంగ్లాండ్‌ ఓకే.. 
కానీ నెల రోజులకు పైగా సాగుతున్న ఈ టోర్నీలో ఆశించినంత కొత్తదనం కనిపించలేదు. లీగ్‌లో శ్రీలంక టైటిల్‌ ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌కు షాకిచ్చి సెమీస్‌ అవకాశాలకు గండి కొట్టింది. గత రెండు వారాలు ఇలాంటి పోరాటాలు మరికొన్ని కనిపించినా సెమీస్‌ మాత్రం మళ్లీ ఆ నాలుగు జట్లకే పరిమితమైంది. మిగతా మూడు జట్లు ఏమో కానీ ఇంగ్లాండ్‌ 1992 తర్వాత మళ్లీ సెమీస్‌ గడప తొక్కడం శుభపరిణామమే. 

సఫారీలకు మళ్లీ నిరాశే..
దక్షిణాఫ్రికా తలరాత ఈ సారి కూడా మారలేదు. సెమీస్‌ దాకా పోరాడలేక ఆరంభంలోనే చేతులెత్తేసింది. బంగ్లాదేశ్‌ ఇప్పటివరకూ 6 సార్లు టోర్నీలో పాల్గొంది. ఒక్క 2015లో తప్ప ఇంకెప్పుడూ ముందడుగు వేయలేకపోయింది. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ జట్లు బలమైనవే అయినా ఈసారి టోర్నీలో నిరాశపరిచాయి. 

ఈ జట్లు ఇప్పటికే..
ఆరు సార్లు ఛాంపియన్‌, రెండు సార్లు రన్నరప్‌ అయిన ఆస్ట్రేలియా మళ్లీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. దేశం పరంగా చూసుకుంటే ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ ఆట విషయంలో కాదు. రెండు సార్లు ఛాంపియన్‌, ఓ సారి రన్నరప్‌ టీమిండియా కూడా సెమీస్‌ చేరింది. కివీస్‌ పరిస్థితి కూడా దాదాపు అంతే. 1992 నుంచి సెమీస్ గడప తొక్కుతూనే ఉంది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం వీటి మధ్య ఫైనల్‌ పోరుతో అంత ఉత్కంఠ కనిపించకపోవచ్చు. శ్రీలంక కూడా ఓసారి ఛాంపియన్‌గా, రన్నరప్‌గా రెండు సార్లు నిలిచిన సంగతి తెలిసిందే.  

ఐసీసీ ధోరణి మారాలి..
ఇప్పటివరకూ ప్రపంచకప్‌ అన్ని టోర్నీల్లో కలిపి మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. 2007లో విండీస్‌లో జరిగిన టోర్నీలో 16 జట్లు పోటీపడ్డాయి. ఇక 2011, 15 టోర్నీలో 14కు చేరాయి. ఈ టోర్నీ ఏకంగా 10కి పడిపోయింది. ఇలా వరుసగా జట్ల సంఖ్య తగ్గుతుండటం క్రికెట్‌కు మంచిదికాదు. ఐసీసీ ఈ విషయంలో దృష్టి పెట్టాలి. ఆలోచనధోరణి మార్చుకోవాలి. చిన్నజట్లను ప్రోత్సహించాలి. బలమైన జట్లతో నిత్యం వాటికి టోర్నీలు నిర్వహిస్తుండాలి. అవి కూడా ఎదిగేలా అవకాశాలు కల్పిస్తుండాలి. అప్పుడే అవి కూడా ఛాంపియన్‌గా ఎదగడానికి పోరాటాలు చేస్తాయి. అప్పుడే సరికొత్త సంచలనాలకు చోటు ఉంటుంది.’ అని ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.