close

తాజా వార్తలు

నీ ముఖమే నేకోరుతున్నా..

డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల మోతలేదు. గుర్తింపు పత్రాలు, యునిక్‌ నంబర్లని చూపించాల్సిన జంఝాటం లేదు.. మీరు చూస్తే చాలు! ఓ నవ్వు రువ్వితే చాలు! షాపింగ్‌ చేయాలనుకున్నా, సినిమా టిక్కెట్‌ కొనుక్కోవాలన్నా, హోటల్‌లో తినాలనుకున్నా, ఓ ఓరచూపు విసిరితే సరి. బిల్లు కట్టేసినట్టే!  ఎయిర్‌పోర్టులో, బ్యాంకులో మీ ముఖమే మీ పాస్‌వర్డ్‌. వాహ్‌.. అద్భుతమైన పరిజ్ఞానం కదా? ఇంకొంచెం ముందుకెళితే... ప్రపంచంలో ఏమూలకి వెళ్లినా  మిమ్మల్ని గమనించే కెమెరాల కళ్లు నీడలా మీ వెంటే ఉంటాయి. ఆఫీసులో పనిమానేసి నిద్రపోయినా, కారు డ్రైవింగ్‌లో అప్రమత్తంగా లేకపోయినా, సరైన ఆధారం లేకుండా దేశం విడిచి వెళ్లాలనుకున్నా మీ ముఖమే మిమ్మల్ని పట్టిస్తుంది. ఫేస్‌ రికగ్నిషన్‌ ఇప్పుడో సరికొత్త విప్లవం. అయితే గోప్యత లేకపోవడం ‘ప్రైవసీ క్రైసిస్‌’ వంటివి మన ముందున్న సవాళ్లు..

రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ఎయిర్‌పోర్టులు, రహదారి కూడళ్లు.. నిత్యం కిక్కిరిసి ఉంటాయి. ఆ రద్దీ ప్రాంతాల్లో ఎవరు మంచివాళ్లు? ఎవరు నేరగాళ్లు.. ఎవరు బాధితులు? అని గుర్తించడం నిన్నటివరకూ కష్టమైన, అసాధ్యమైన పనే! కానీ కృత్రిమమేధస్సుతో పనిచేసే ఫేస్‌ రికగ్నిషన్‌ ప్రక్రియ ఆ పనిని సులభతరం చేసేస్తోంది. వేలు, లక్షలమందిలో ఉన్నాసరే గురి తప్పకుండా నేరగాళ్లని ఇట్టే గుర్తుపట్టేస్తుంది. నేరగాళ్లని పట్టించేది వారి వెంట ఉన్న ఫోనో, ఇతర ఆధారాలో అనుకుంటే పొరపాటు. వారి ముఖకవళికలే వారిని పట్టిస్తాయి. అసలు ఏంటీ ఫేస్‌ రికగ్నిషన్‌?

ఎలా గుర్తిస్తారు?
మనం వేలిముద్రలని స్కాన్‌ చేసినట్టుగా... కెమెరాల సాయంతో ముఖాన్ని వివిధ భంగిమల్లో స్కాన్‌ చేస్తారు. ముక్కు, పెదవులు, కనుబొమలు, గడ్డం, ముఖంలో ఇతర వంపులని ముఖ్య కేంద్రాలుగా పరిగణించి నోడల్‌ పాయింట్స్‌ని గుర్తిస్తుంది కెమెరా. 80కి పైగా ఉండే ఈ బిందువుల ఆధారంగా మన ఫేస్‌ ప్రింట్‌ తయారవుతుంది. ఇలా గుర్తించిన చిత్రాలకి ఆయా వ్యక్తుల వయసు, లైంగికత, దేశం, ఇతర సామాజిక వివరాలు జతచేస్తే వారిని ఎక్కడున్నా క్షణాల్లో గుర్తుపట్టేయొచ్చు. నిన్నటివరకూ ఫేస్‌బుక్‌, ఫోన్‌ అన్‌లాక్‌ వంటి ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అయిన ఈ పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రయోజనాల కోసం వాడాలనుకుంటున్నారో చూద్దాం.

ఇళ్లకు భద్రత 

అమెరికాలో ఇప్పటికే ఇళ్లు, ఆఫీసులకు ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఎఫ్‌ఆర్‌ కెమెరాలను భద్రత కోసం అమర్చుకున్నారు. ఇవి అపరిచితులు ప్రవేశిస్తే  ఆ సమాచారాన్ని ఇట్టే తెలియజేస్తాయి. 

చైనాలో... ‘అక్కడా’ వదలరు 

అత్యధిక జనాభాగల చైనా తమ దేశంలో నేరాలు తగ్గించడానికి, పౌరులకు భద్రత పెంచడానికి ఎఫ్‌ఆర్‌ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తోంది.  వచ్చే ఏడాది 40 కోట్ల కెమెరాలని దేశమంతటా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది. తమ దగ్గర ఉన్న డేటాతో.. ఎఫ్‌ఆర్‌ కెమెరాలు పౌరుల చర్యలని పోల్చిచూస్తూ వారిపై నిఘా ఉంచుతాయి. వివిధ సందర్భాల్లో పౌరుల ప్రవర్తనని నమోదు చేస్తుంటాయి. కెమెరా ఇచ్చిన వివరాల ఆధారంగా పౌరులకు ‘సోషల్‌ క్రెడిట్‌ స్కోర్‌’ ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. పౌరుల్లో సత్ప్రవర్తన పెంచడమే ఈ సోషల్‌ క్రెడిట్‌ స్కోర్‌ లక్ష్యం అని అంటోంది. కేఫ్‌లు, రెస్టారెంట్లు మొదలుకుని... పబ్లిక్‌ టాయిలెట్లలో సైతం ఈ కెమెరాల నిఘా ఉంటుంది. ఎవరైనా పరిమితికి మించి టాయిలెట్‌ పేపరుని వాడాలనుకుంటే ఒకసారి ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోవాల్సిందే. ఒక వేళ ఇష్టానుసారం వాడితే వాళ్లపైన చెడ్డ పౌరుడనే ముద్ర వేస్తుంది.

ప్రమాదాలు జరగకుండా: వాహనదారుడు నిద్రలేమితో ఉన్నా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తున్నా.. ఆ విషయాన్ని గుర్తించి అప్రమత్తం చేయడానికి జపాన్‌లోని స్టార్టప్‌ కంపెనీలు ఎఫ్‌ఆర్‌ సాయంతో కొన్ని యాప్‌లు తయారుచేశాయి. కొత్తతరం ఎస్‌యూవీ వాహనాల్లో ఈ ఎఫ్‌ఆర్‌తో పనిచేసే ఫీచర్లని ప్రవేశపెట్టి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

రాబోయే ఒలింపిక్స్‌లో సైతం క్రీడాకారులు, ప్రేక్షకులు కాకుండా అసాంఘిక శక్తులు, అనుమతి లేనివారు మైదానాల్లో ప్రవేశించకుండా ఉండేందుకు ఐడీ కార్డులని కాకుండా ఈ ఫేస్‌ రికగ్నిషన్‌ విధానాన్ని వాడుకోవాలని చూస్తోంది జపాన్‌ ప్రభుత్వం.

వ్యాధులని వేగంగా పసి గట్టేస్తాయి: జన్యుపరమైన వ్యాధులని నిర్థారణ చేసేందుకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ఎఫ్‌ఆర్‌ విధానం సమర్థంగా పనిచేస్తుందట. జన్యుపరమైన వ్యాధులున్న వారి చిత్రాలను సేకరించి వాటిని నమూనా చిత్రాలుగా తీసుకుంటారు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే కెమెరాలు వాటితో పోల్చి చూస్తూ... చాలా తేలిగ్గా, వేగవంతంగా కొత్తవారిలో వ్యాధి నిర్థారణ చేస్తాయి.

పోలీస్‌ వాహనాలకు: పోలీస్‌ వాహనాలకు అమర్చిన ఎఫ్‌ఆర్‌ కెమెరాలు.... చుట్టుపక్కల ఎవరైనా నేరగాళ్లు ఉంటే వారిని అప్పటికే తమ వద్ద ఉన్న డేటాతో పోల్చిచూసుకుని ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తాయి. ఒకే చోట నేరగాళ్లు ఎక్కువమంది ఉంటే అక్కడ నేరం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తాయి.

అక్రమ వలసలకు అడ్డుకట్ట: మనుషుల అక్రమరవాణా, అమ్మాయిలపై వేధింపులు... మిస్సింగ్‌ కేసులు. వీటికి ఫేస్‌ రికగ్నిషన్‌తో సమర్థంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని స్టార్టప్‌ సంస్థలు. తప్పిపోయిన అమ్మాయి ఫొటో లేదా... వీడియోని సేకరించి ఫేస్‌ ప్రింట్‌ తీయడం ద్వారా... ఆన్‌లైన్‌లో లేదా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ అమ్మాయిని గుర్తించవచ్చు. ఒక దేశం నుంచి మరొక దేశానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నప్పుడు ఎఫ్‌ఆర్‌ ద్వారా తేలికగా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో ఇప్పటికే ఈ ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం ద్వారా కొన్ని మిస్సింగ్‌ కేసుల్లో విజయం సాధించారు.
పనిచేసే చోట నిద్రపోతే పని ప్రదేశాల్లో ఉండేవారిని నిరంతరం ఈ ఎఫ్‌ఆర్‌ కెమెరాలు సమీక్షిస్తుంటాయి. ఉద్యోగుల్లోని నిద్ర, సంతోషం, అలసట వంటి భావోద్వేగాలని, ముఖకవళికలని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. నిద్రపోయే వారిని తట్టిలేపడానికి కూడా పరికరాలని తయారు చేస్తున్నాయి కొన్ని సంస్థలు.

గోప్యత మాటేంటి?: మనం ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాం. ఎవరితో మాట్లాడాం. మన బంధువులు... మన స్నేహితులు అందరి గురించి ఆరాతీస్తాయి ఈ కెమెరాలు. ఆఖరుకి మనం పబ్లిక్‌ టాయిలెట్లని ఎన్నిసార్లు వాడుకున్నాం అనే విషయాన్ని కూడా లెక్కగట్టి చెబుతాయి. మన అనుమతి లేకుండా మనల్ని స్కాన్‌ చేయడం, మనపై నిఘా వేయడం అనేది మన గోప్యతకు భంగం కలిగించడమే కదా? అలా సేకరించిన డేటాని సంస్థలు మంచి కోసమే వాడతాయా.. లేక మనకు ఇబ్బంది కలిగించే అంశాలు కూడా ఉంటాయా? అసలు మన అనుమతితోనే మన డేటాని తీసుకుంటున్నాయా లేక ఎక్కడ నుంచి ఈ డేటాని సేకరిస్తున్నాయి. ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. ఇప్పటికయితే ఈ విషయాలపై పూర్తి సమాచారం లేదు కాబట్టి... సామాజిక మాధ్యమాల్లో ప్రతి సందర్భాన్ని నమోదు చేయకపోవడం, కాస్త అప్రమత్తంగా వ్యవహరించడమే మంచిది.
 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.