close

తాజా వార్తలు

బుర్ర కథ!

సంవత్సరాల తరబడి డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. ఎంబీఏ, ఎంటెక్‌ ఇలా ఏ డిగ్రీ కావాలన్నా నచ్చిన యూనివర్సిటీ నుంచి బుర్రలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవడమే! 30 రోజుల్లో మలయాళం... 40 రోజుల్లో ఆంగ్లం పుస్తకాలని కంఠస్థం చేయకుండానే  ప్రపంచంలోని ఏ భాషలోనయినా గడగడా మాట్లాడేయొచ్చు... రాసేయొచ్చు.
లండన్‌లోనో, అమెరికాలోనో ఉన్న మీ స్నేహితురాలితో ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అవసరం లేకుండానే మీ మెదడుతోనే మాటామంతీ కలపొచ్చు. నిన్న రాత్రి మీరు కన్న అందమైన కలని... మీ స్నేహితుడికి బదిలీ చేయొచ్చు. ఎలాన్‌మస్క్‌, జెఫ్‌బెజోస్‌ వంటి వారి అనుభూతులని మీరూ తెలుసుకుని కాసేపు వారి  స్థానంలో ఉండి మేధావుల్లా మురిసిపోవచ్చు. ఇదేమి ‘మ్యాట్రిక్స్‌’ సినిమా సీక్వెల్‌ కథ కాదు.  ‘బ్రెయిన్‌ చిప్‌’ ఆవిష్కరణతో భవిష్యత్తులో ఎదురయ్యే వాస్తవాలే అంటున్నారు శాస్త్రవేత్తలు.  ఫేస్‌బుక్‌, న్యూరాలింక్‌ వంటి సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో... కాసేపు మనమూ భవిష్యత్తులోకి వెళ్లి చూద్దామా?
పరీక్ష హాల్లోకి అడుగుపెడుతుంటే స్లిప్పులు, స్మార్ట్‌ఫోన్లు...బ్లూటూత్‌లు లేవని నిర్ధారించుకున్నాక కదా లోపలికి పంపిస్తారు. భవిష్యత్తులో అవేమి కాదు... మీ బుర్రలో ‘బ్రెయిన్‌ చిప్‌’ లేదని, మీరు ‘బ్రెయిన్‌ కంప్యూటర్‌’ లేదా ‘సైబోర్గ్‌ మనిషి’ కాదని నిర్ధారించుకున్నాకే లోపలికి పంపించే రోజులు రావొచ్చు. అసలేంటి ‘బ్రెయిన్‌చిప్‌’?
మీరే ఓ వైఫై కేంద్రం...
కుట్టుమిషను కుట్టిన కుట్లని దగ్గరగా చూడండి. అలాంటివి ఓ రెండు మూడు కుట్లు వెంట్రుక మందం కన్నా సన్నగా ఉండే ఎలక్ట్రోడులతో మన మాడుపై కుడతారు. దానికి అనుసంధానంగా లోపల మరో చిన్నచిప్‌. అంతే... అక్కడ నుంచి మనమే ఫోన్‌, మనమే ల్యాప్‌టాప్‌, మనమే వైఫై కేంద్రం. ప్రపంచంలోని ఏ సాంకేతిక పరికరంతో అయినా కనెక్ట్‌ అయిపోవచ్చు. ఎటువంటి ఇంటర్‌నెట్‌ లేకుండా మీరే ఓ కంప్యూటర్‌గా మారిపోవచ్చు. సముద్రంలో ఉన్నా... అడవిలో ఉన్నా సమాచారానికి సందేహం ఉండదు. బ్రెయిన్‌ చిప్‌ ఉన్న ఏ వ్యక్తి మెదడుతో అయినా సమాచార మార్పిడి చేసుకోవచ్చు. దీన్నే ‘బ్రెయిన్‌ టు బ్రెయిన్‌ కాంటాక్ట్‌’ అంటారు. మనకొచ్చిన కలలని ఓ ఫోల్డర్‌లో దాచిపెట్టుకోవచ్చు. అవసరం అనుకుంటే వాటిని స్నేహితులతో పంచుకోవచ్చు. మన ఆలోచనలని, జ్ఞాపకాలని క్లౌడ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఇలా యంత్రభాగాలు.. మనుషుల అవయవాలతో కలబోతగా తయారయ్యే మరమనుషులనే సైన్స్‌ ఫిక్షన్‌ భాషలో ‘సైబోర్గ్‌’లని అంటారు. మెదడుని... మెషిన్‌తో అనుసంధానం చేసే ఈ ప్రక్రియనే ఎలాన్‌మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ ఇప్పటికే మొదలుపెట్టింది. ఫేస్‌బుక్‌ కూడా ఫోన్‌, కంప్యూటర్‌ అవసరం లేకుండా కేవలం మెదడు సాయంతోనే మెసేజ్‌లని పంపేందుకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలని అభివృద్ధి చేస్తోంది.
భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వస్తాయి..

*ఆఫీసులు ఇక ఇలా ఉండవు: ‘బ్రెయిన్‌ టు బ్రెయిన్‌ కాంటాక్ట్‌’ మొదలయితే ఆఫీసుల్లో సంప్రదాయ పని విధానాలు ఉండకపోవచ్చు. గంటలగంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆపసోపాలు పడి ఆఫీసులకు రావడం, కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేయడం వంటివి భవిష్యత్తులో కనిపించవేమో! మీ మెదడులోని సమాచారాన్ని బాస్‌కి పంపిస్తే అతను తన మెదడుకి అనుసంధానించిన ప్రింటర్‌కి కలిపి ఒక ప్రింటవుట్‌ తీసుకుంటాడు. ఎవరింట్లో వాళ్లు ఉంటూనే బ్రెయిన్‌ లాన్‌తో అనుసంధానం అయి మీటింగులు నిర్వహించుకుంటారు.
* స్కిల్‌ ప్యాకేజీలు: కష్టపడి నైపుణ్యాలు పెంచుకోవడం కాకుండా... ఒకరి మెదడులోని నైపుణ్యాలని మరొకరు తమ బుర్రలోకి డౌన్‌లోడ్‌ చేసుకునే రోజులు వస్తాయి. అలా అని ఉచితంగా కాకపోవచ్చు. కంపెనీలు వీటిని ‘స్కిల్‌ ప్యాకేజీలు’గా అమ్మకానికి పెట్టొచ్చు. యూనివర్సీటీలు కూడా ఎంబీఏ, ఎంటెక్‌ వంటి డిగ్రీలని బుర్రలోకి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తాయట.
* బ్రెయిన్‌ హ్యాకింగ్‌ జరుగుతుందా?: ఇంటర్‌నెట్‌తో అనుసంధానించిన మన మెదడు మరొకరి నియంత్రణలోకి వెళ్లడం కూడా సులభమేనంటున్నారు టెక్‌ నిపుణులు. మన డబ్బు కోసమో, మన ప్రతిభ కోసమో మనల్ని కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్‌ని హ్యాక్‌ చేస్తే సరిపోతుంది కదా! భవిషత్తులో బ్రెయిన్‌ హ్యాకర్లతో ఇటువంటి చిక్కులుంటాయనేది ఓ ఊహ.
* ఇన్ని అద్భుతాలు జరగడానికి ఇంకా సమయం పట్టొచ్చు. కానీ ఏఐ.. అదే... కృత్రిమ మేధతో పనిచేసే తెలివైన రోబోలు రంగంలోకి దిగితే మన ఉద్యోగాల సంగతేంటి? వాటిని ఎదుర్కొనే సత్తా మనలో ఉందా? అందుకోసమే మన మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నది మరికొందరి వాదన.
వైద్యరంగంలో పెనుమార్పులు...
మనిషి చనిపోతే అతనితో పాటు మెదడు, గుండె వంటివి కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే. శరీరంతోపాటే.. జ్ఞాపకాలు కూడా అంతర్థానం అయిపోతాయి. శరీరం పోయినా వాళ్ల మెదడులోని సమాచారాన్ని, జ్ఞాపకాలని బ్రెయిన్‌ టెక్నాలజీ సాయంతో అలాగే భద్రపరుచుకోవచ్చని అంటున్నారు నయాతరం సాంకేతిక నిపుణులు. మెదడుకి అనుసంధానించిన బ్రెయిన్‌చిప్‌ మెదడు పొరల్లోని జ్ఞాపకాలని డౌన్‌లోడ్‌ చేసుకుంటుంది. అవసరం అయితే మరో మెదడులోకి బదిలీ కూడా చేస్తుంది. ఈ ప్రయోగాలు విజయవంతం అయితే అల్జీమర్స్‌తో పాటు ఒత్తిడి, తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ దిశగా కోతి, ఎలుకలు వంటి జంతువులపై జరిగిన కొన్ని ప్రయోగాలు పక్షవాతం, పార్కిన్‌సన్‌ బాధితుల్లో ఆశలు రేపుతున్నాయి.  పక్షవాతం వచ్చిన ఓ కోతికి మెదడులో చిప్‌ని అమర్చి... మరోచిప్‌ని పక్షవాతం కారణంగా పనిచేయని దాని ఎడమకాలిలో అమర్చారు. కోతి ఇచ్చిన ఆదేశాలు మేరకు దాని ఎడమకాలు పనిచేయడం మొదలుపెట్టింది. అది సొంతంగా చక్రాల కుర్చీని నడపడం, మర చెయ్యిని కదిలించడం వంటి చర్యలు చూసిన తర్వాత వీటిని మనుషులపై ప్రయోగించి విజయం సాధించడానికి పెద్దగా సమయం అవసరం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. వీటితోపాటు పిల్లల్లో వచ్చే ఏడీహెచ్‌డీ, బుద్ధిమాంద్యం, ఏకాగ్రతాలోపం వంటి సమస్యలకు ఈ బ్రెయిన్‌చిప్‌ సరైన పరిష్కారాలని అందించగలుగుతుందని వైద్యరంగం నమ్ముతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.