close

తాజా వార్తలు

కీర్తి సురేశ్‌ గురించి మీకివి తెలుసా?

‘మహానటి’ వద్దనుకుని..

సాక్షాత్తూ సావిత్రే దిగి వచ్చారా!.. అన్నంతగా ‘మహానటి’లో ఒదిగిపోయి మెప్పించారు కీర్తి సురేష్‌. ‘శైలజ’గా తెలుగు వారికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘మహానటి’గా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సావిత్రి పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుని శభాష్‌ అనిపించుకున్నారు. మరి ఇంతగా మెప్పించిన ఆమె తొలుత సావిత్రి పాత్రలో నటించకూడదని అనుకున్నారు.. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలా ఆమె గురించి అందరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం..

బాలనటిగా..

మలయాళ నిర్మాత సురేష్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి సురేశ్‌. 2000లో బాలనటిగా తెరంగేట్రం చేశారు. తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మలయాళ చిత్రం ‘పైలట్స్‌’ ఆమె తొలి సినిమా. దీంతోపాటు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ తదితర చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా ఆరేళ్ల కిందట మలయాళంలో వచ్చిన ‘గీతాంజలి’. 2016లో ‘నేను శైలజ’తో ఆమె తెలుగులో అరంగేట్రం చేశారు.

ఈతలో మేటి 

చిన్నతనంలో కీర్తి సురేశ్‌ స్విమ్మింగ్‌ బాగా చేసేవారట. తన ఇంటి దగ్గరున్న ఓ శిక్షణా కేంద్రంలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. పాఠశాల, కళాశాలలో జరిగే నృత్య, నాటన ప్రదర్శనల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. అలాగని ఆమె చదువులో వెనకపడలేదండీ.. అందులోనూ ముందుండేవారట.

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని..

మాస్‌, క్లాస్‌ సినిమాలతో ఆల్‌రౌండర్‌ అనిపించుకున్న కీర్తి సురేశ్‌ డిజైనర్‌గా రాణించాలని అనుకున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కూడా పూర్తి చేశారు. భవిష్యత్తులో సొంతంగా బొటిక్‌ను ప్రారంభిస్తానని చెప్పే కీర్తి.. ఇటీవల తను సొంతంగా డిజైన్‌ చేసిన దుస్తుల్ని ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు.

విజయ్‌కి వీరాభిమాని

తమిళ స్టార్లు విజయ్‌, సూర్య అంటే కీర్తి సురేశ్‌కు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి విజయ్‌కు వీరాభిమాని. ‘భైరవ’ (2017)లో ఆయనకు జోడీగా నటించే అవకాశం వచ్చినందుకు తెగ సంబరడిపోయింది. ఇక సూర్య యాక్షన్‌ సినిమా ‘సింగం’ అంటే కూడా కీర్తి సురేశ్‌ ఎంతో ఇష్టం.

డ్రీమ్‌ రోల్‌

‘వసంత కోకిల’లో శ్రీదేవి, ‘క్వీన్‌’లో కంగన, ‘కహానీ’లో విద్యా బాలన్ పోషించిన రోల్స్‌  అంటే ఆసక్తి. అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతుంటారు.

న్యూ లుక్‌లో..

స్వతహాగా శాకాహారి అయిన కీర్తి సురేశ్‌ వ్యాయామం, యోగాకు అధిక ప్రాముఖ్యం ఇస్తుంటారు. ఇన్నాళ్లూ కాస్త బొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు చాలా స్లిమ్‌గా తయారయ్యారు. తెగ కసరత్తులు చేసి తగ్గారు. ఆమె కొత్త లుక్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల ఆమె సన్నబడ్డ ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి.

‘మహానటి’ వద్దనుకుంది..

‘‘మహానటి’ ప్రభావం నాపై ఎప్పటికీ ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం... ఇలా ఎక్కడికి వెళ్లినా ‘మహానటి’ గురించే మాట్లాడుతుంటారు. మొదట నా దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు చేయనని చెప్పాలనుకొన్నా. సావిత్రిలా నేను కనిపిస్తానో లేదో, అలా చేయగలనో లేదో అని భయపడ్డా. ఒక మంచి సినిమా తర్వాత కథానాయికకి యువతరంలో క్రేజ్‌ పెరగడం సహజం. కానీ ‘మహానటి’ తర్వాత పెద్దవాళ్లు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. గుంటూరు వెళ్లినప్పుడు ఓ పెద్దాయన వచ్చి ‘మీరు సావిత్రిగారే కదా?’ అని అడిగారు. ‘నేను సావిత్రిగారిని కాదండీ, అలా నటించాను’ అని చెప్పా. ‘లేదు లేదు మీరు సావిత్రిగారే’ అన్నారు’ అని ఓ సందర్భంలో కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.