close

తాజా వార్తలు

డిజిటల్‌ చెల్లింపుల్లో చైనాయే లక్ష్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో చైనాతో పోటీపడుతున్న భారత్‌లో చెల్లింపు సాధనాల సంఖ్య పెరిగిపోతోందని దక్షిణాసియా పేమెంట్స్‌ నెట్‌వర్క్‌ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ నుంచి మరిన్ని పేమెంట్‌ యాప్స్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ, చైనాలో మాత్రం దేశీయంగా తయారు చేసిన కేవలం రెండు యాప్స్‌ మాత్రమే మార్కెట్‌ను శాసిస్తున్నాయన్నారు. నగదు రహిత లావాదేవీల్లో చైనాయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. ఈ క్రమంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రకాల యాప్స్‌కి అవకాశం కల్పిస్తున్నామని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దిలీప్‌ ఆస్బే తెలిపారు. అయినా భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులపై అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గూగుల్‌, పేటీఎంతో పాటు దేశీయ ఆర్థిక సంస్థలకు చెందిన 87 యాప్స్‌ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయినా భారత్‌లో ఇంకా 72 శాతం మంది నగదుతో కూడిన లావాదేవీలవైపే మొగ్గు చూపుతున్నారని ఇటీవల విడుదలైన ఓ అధికారిక నివేదికలో తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులు డిజిటల్‌ చెల్లింపులను అనుమతించడం లేదని నివేదిక తేల్చింది. 2015 తరవాత డిజిటల్‌ లావాదేవీలు ఐదింతలు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులు సగటున 22.4 డిజిటల్‌ లావాదేవీలు జరిపినట్లు పేర్కొంది. అదే చైనాలో ఆ సంఖ్య 2017లోనే 99.7గా ఉన్నట్లు తెలిపింది. నోట్ల రద్దు తర్వాత నగదు చెలామణి కాస్త తగ్గినా.. గత రెండు సంవత్సరాలుగా మళ్లీ పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

అయితే తొలుత డిజిటల్‌ పేమెంట్స్‌ వినియోగంపై ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని.. లావాదేవీల విలువపై కాకుండా సంఖ్యపై యాప్‌లు దృష్టి సారించాలని ఆస్బే అభిప్రాయపడ్డారు. రానున్న ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్స్‌ వినియోగదారుల సంఖ్యను ఐదింతలకు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రస్తుతం యూపీఐలో 10కోట్ల మంది యూజర్లు ఉన్నారని.. దాన్ని 50కోట్లకు చేర్చేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. చైనాలో కేవలం వీచాట్‌ పే యాప్‌లోనే 80కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. చైనాతో పోటీ పడాలంటే భారత యూజర్లకు అనేక యాప్‌లు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.