close

తాజా వార్తలు

కొట్టేద్దాం... కేంద్ర కొలువు

ఎనిమిది విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో పరిశోధన సంస్థలు, రక్షణ రంగ విభాగాలు. వీటిలో ఇంజినీరింగ్‌ పనుల పర్యవేక్షణ, పథకాల అమలుకు సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏటా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేస్తుంది. డిప్లొమా అర్హతతో ఈ కొలువులను సాధించుకోవచ్ఛు మంచి జీతం, ఇతర అలవెన్స్‌లు, సౌకర్యాలు ఉంటాయి. రెండంచెల నియామక పరీక్షలు దాటితే సర్కారీ ఇంజినీరుగా స్థిరపడిపోవచ్ఛు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సాంకేతిక అర్హతలున్న నిరుద్యోగులకూ, చిరుద్యోగులకూ ఇదో బంగారు అవకాశం. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ లేదా డిప్లొమా చదివి, 18- 32 సంవత్సరాల మధ్య వయసుంటే దరఖాస్తు చేసుకోవచ్ఛు నియామకాల కోసం పేపర్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, పేపర్‌-2 రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైతే గ్రూప్‌ బి (నాన్‌-గెజిటెడ్‌)లో జూనియర్‌ ఇంజినీర్స్‌ పోస్టుల్లో మంచి వేతనంతో సెంట్రల్‌ కొలువు పొందవచ్ఛు.

జూనియర్‌ ఇంజినీర్‌గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సి.పి.డబ్ల్యు.డి., మిలిటరీ, ఇంజినీరింగ్‌ సర్వీసు, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్‌, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ తదితర సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. వీరికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ. 35,400 - 1,12,400 స్కేలుతో దాదాపు రూ. 50- 55 వేల జీతం వస్తుంది. ఒక జూనియర్‌ ఇంజినీర్‌ అదే విభాగంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువ. డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా పదోన్నతి లభిస్తుంది.

డిప్లొమా అభ్యర్థులు అదనంగా శ్రమించాలి

* ముందుగా పరీక్ష విధానాన్నీ, సిలబస్‌నూ పూర్తిగా అవగతం చేసుకోవాలి. ఇది ప్రిపరేషన్‌లో మొదటి మెట్టు.

* సిలబస్‌ను ఒకటి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలిస్తే ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అర్థమౌతుంది.

* మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలు ఎంచుకోవడం ప్రధానం.

* ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్‌ ఆధారంగా ఉంటాయి. కానీ డిప్లొమాతోపాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీ పడతారు.అందుకని డిప్లొమా విద్యార్థులు కొంత ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ● అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. రోజూ కనీసం 5 నుంచి 6 గంటల సమయం కేటాయించాలి.

* ప్రాథమికాంశాలపై అవగాహన తెచ్చుకొని, ఆపై గత సంవత్సరాల, ఆన్‌లైన్‌ మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. ప్రతి వారాంతం, నెలకొకసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. ● పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్య అంశాలను చిన్న చిన్న పట్టికల రూపంలో సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. ఇవి రివిజన్‌కు ఉపయోగం. ● పునశ్చరణ ఎంతో ముఖ్యం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా రివిజన్‌ చేయాలి. ● ప్రిపరేషన్‌ అనంతరం ఎస్‌.ఎస్‌.సి. జేఈ మాక్‌టెస్ట్‌లు రాయడం చాలా కీలకం. ఇవి రాసిన తర్వాత చేసిన తప్పులను గుర్తించి సవరించుకోవాలి.● వీలైనంత వరకు సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటూ, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించాలి. ఏ సమయంలోనూ ఒత్తిడికి గురికాకూడదు.

ఏ పేపర్‌కు ఎలా సిద్ధం కావాలి?

పేపర్‌- I: ఈ పేపర్‌ 3 భాగాలుగా ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు. సమయం మాత్రం 120 నిమిషాలుంటుంది. అంటే సమయ పాలన అత్యంత కీలకం. ప్రణాళికాబద్ధంగా, కాన్సెప్టువల్‌గా సరైన సాధన అవసరం. ప్రశ్నలు డిప్లొమా స్థాయిలో ఉంటాయి. థియరీ బేస్డ్‌ ప్రశ్నలు ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ తగినంత సమయం కేటాయించాలి. ప్రశ్నలకు సరైన సమాధానాలను వేగంగా గుర్తించటం ముఖ్యం. జవాబులు త్వరగా గుర్తించాలంటే విస్తృతమైన సాధన అవసరం. పరీక్షా సమయంలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగిన ప్రశ్నలను మొదట ఎంచుకొని తక్కువ సమయంలో పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని, ఎక్కువ వ్యవధి పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్ఛు

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్‌, క్లాసిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌, అనాలజీస్‌ అంశాలు ముఖ్యం. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివినవారికి ఈ అంశాలు వారు చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో సాధన చేస్తే మార్కులు సాధించవచ్ఛు

జనరల్‌ అవేర్‌నెస్‌: అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహననూ, సమాజంపై అవి చూపే ప్రభావాన్నీ పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై సాంకేతిక అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ రోజూ వార్తా పత్రికలు, ముఖ్యమైన వార్తా సంచికలు, ప్రామాణిక పాఠ్యపుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేస్తే జవాబులు గుర్తించడం సులువ.

జనరల్‌ ఇంజినీరింగ్‌: ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రశ్నలు అడుగుతారు.

సివిల్‌ ఇంజినీరింగ్‌: అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహనను పొంది తమ అభ్యాసనను మొదలుపెట్టడం మంచిది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే- బిల్డింగ్‌ మెటీరియల్స్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌, సర్వేయింగ్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ఎంతో కీలకం.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషీన్స్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో అధిక ప్రశ్నలు వస్తున్నాయి.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పాత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఎలక్ట్రికల్‌ మెషీన్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయిదు జవాబులు రాస్తే చాలు

పేపర్‌ - II (కన్వెన్షనల్‌ టైప్‌): పేపర్‌-I లో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులను పేపర్‌-II రాయటానికి అనుమతిస్తారు. పూర్వపు ప్రశ్నపత్రాలను బట్టి... ఇందులో మొత్తం ఆరు ప్రశ్నలు; ప్రతి ప్రశ్నకూ 60 మార్కులు. కానీ ప్రతి ప్రశ్ననూ 3-4 విభాగాలుగా విభజించారు. ప్రతి విభాగానికీ 10- 20 మార్కులు కేటాయించారు. మొత్తం ఆరు ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

సివిల్‌ ఇంజినీరింగ్‌లో గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్‌, సర్వేయింగ్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, స్ట్రక్చరల్‌ అనాలిసిస్‌ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం గమనించవచ్ఛు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి వస్తే ప్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషీన్స్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఐసీ ఇంజిన్స్‌, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ సబ్జెక్టులు ముఖ్యమైనవి. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ మెషీన్స్‌, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, పవర్‌ సిస్టమ్‌లు ప్రాధాన్యమున్న సబ్జెక్టులు.

ముఖ్యమైన తేదీలు●

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 12.09.2019

* ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేది: 14.09.2019 ● అభ్యర్థులు http://ssc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు పూరించాలి. చేతిరాత ద్వారా, పోస్టులో దరఖాస్తులను స్వీకరించరు. ● పరీక్ష రుసుము రూ. 100. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి ఫీజు మినహాయింపు ఉంది.

(పరీక్షా విధానం, నమూనా ప్రశ్నలు, గత పరీక్షల కటాఫ్‌ మార్కులు, ఉద్యోగ బాధ్యతల వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్ఛు)

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.