close

తాజా వార్తలు

నాచుకిరణాలు

ఆప్టో జెనిటిక్స్‌

బాధించే జ్ఞాపకాలని ఎప్పుడు తలుచుకున్నాసరే... గుండెను సన్నగా కత్తితో కోసినంత బాధ! వాటిని మరిచిపోవడం ఎలా? అర్ధరాత్రి ఉలిక్కిపడేలా చేసే కొన్ని ‘షాకింగ్‌’ జ్ఞాపకాలు...వాటి నుంచి బయటపడేదెలా? మనలో ఒక్కో జ్ఞాపకాన్నీ సమూలంగా తుడిచిపెట్టేసే... అల్జీమర్స్‌! ఇక జీవితాంతం ఖాళీ పుస్తకంలా మిగిలిపోవాల్సిందేనా? తప్పని తెలిసినా... వద్దని మెదడు వారిస్తున్నా తాగుడు మానుకోలేని వారిని ఆ సమస్య నుంచి విముక్తి కలిగించడం అయ్యే పనేనా? వీటికే కాదు అనేక మానసిక, శారీరక సమస్యలకి ఆప్టో జెనిటిక్స్‌ సమాధానం ఇస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.. 

నూహ్యంగా వచ్చే ఆలోచనని ‘మెరుపులాంటి ఆలోచన’ అని చమత్కరిస్తాం. అది కేవలం మాట వరసకి అనేమాటేనా? లేక నిజంగానే ఆలోచనలకి...మెరుపుకీ సంబంధం ఉందా? ఉండటమే కాదు...భవిష్యత్తులో మందుల అవసరం లేకుండా కేవలం కాంతిపుంజం సాయంతోనే అంధత్వం, అల్జీమర్స్‌తో సహా అనేక మానసిక సమస్యలకీ పరిష్కారం ఇవ్వొచ్చని అంటున్నారు ఆప్టోజెనిటిక్స్‌ నిపుణులు. మెదడులోని కణాలని కాంతితో నియంత్రిస్తూ... కావాల్సిన విధంగా మెదడుతో పని చేయించుకోవడానికి రూపొందిన శాస్త్రమే ఆప్టోజెనిటిక్స్‌.

కాంతితో ప్రేరేపితమయ్యే ‘చానల్‌రోడాప్సిన్స్‌’ అనే ప్రత్యేక ప్రొటీన్లే ఇప్పుడు ఆప్టోజెనిటిక్స్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సౌరశక్తి సాయంతో ఈ పొట్రీన్లని శాస్త్రవేత్తలు కృత్రిమంగా ల్యాబుల్లో తయారుచేస్తున్నారు. వాటిని మెదడులో ప్రవేశపెట్టి అక్కడ నుంచి కాంతితో కావాల్సిన విధంగా పనిచేయించుకుంటారు. మెదడులో కావాల్సిన చోటికి ఈ ప్రొటీన్లని పంపి బయట నుంచి కాంతి సాయంతో వివిధ అవయాల పనితీరుని పర్యవేక్షిస్తారన్నమాట. బయట నుంచే స్విచ్‌ ఆన్‌ చేయడం, ఆఫ్‌ చేయడం ద్వారా మన మెదడుని నియంత్రిస్తారు.

పాన్‌ అనే చైనా శాస్త్రవేత్త అంధత్వాన్ని పోగొట్టే క్రమంలో ఈ ప్రొటీన్‌ని కృత్రిమంగా తయారుచేసి మెదడులో కంటిచూపుని నియంత్రించే గాంగ్లియన్‌ కణాల స్థానంలో ప్రవేశపెట్టడం ద్వారా ఫలితాలు పొందవచ్చని నిరూపిస్తున్నాడు.

●చూడకూడని సంఘటనని చూసినప్పుడు ఎదురయిన షాక్‌ పదేపదే గుర్తొచ్చి వేదనకు గురవుతున్నారు. అర్ధరాత్రి మీరు ఒక అడవిలో చిక్కుకున్నారు. చిమ్మచీకటి. ఎక్కడి నుంచో ఏవో జంతువుల అరుపులు. అంతే గుండె ఝల్లుమంది. ఇదే కల పదేపదే వచ్చి మిమ్మల్ని భయపెడుతోంది. కాంతిపుంజం సాయంతో సంబంధిత నాడీకణాలని ఆఫ్‌ చేయడం ద్వారా ఆ చేదు జ్ఞాపకాలని తొలగిస్తారు. అలాగే మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పదేపదే ఎందుకు తాగాలనుకుంటున్నాడు? ఇష్టం లేకపోయినా ఆ పనిని ఎందుకు చేస్తున్నాడు? అతని మెదడుని నియంత్రించే మార్గం లేదా? స్క్రిజోఫ్రినియా, అల్జీమర్స్‌, కుంగుబాటు, మూర్ఛ వంటి ఇతర సమస్యల సంగతేంటి? ఇప్పటివరకూ ఉన్న మందులు ఎంతవరకూ ఫలితాన్నిస్తున్నాయి. తీవ్రమైన నొప్పిని తగ్గించుకోవడానికి వాడే పెయిన్‌కిల్లర్స్‌తో దుష్ప్రభావాలు పెరుగుతున్న నేపథ్యంలో నేరుగా సమస్యని పరిష్కరించే ఆప్టోజెనిటిక్స్‌ ఫలితాలు శాస్త్రవేత్తల్లో ఆశలు పెంచుతున్నాయి.

డీప్‌బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ పద్ధతిని ఉపయోగించి అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌, మతిమరుపు, మానసిక సమస్యలకు పరిష్కారం అందించడంతో పాటు గుండెకొట్టుకునే పనితీరులో వచ్చే హెచ్చుతగ్గులని నియంత్రించే పేస్‌మేకర్ల తయారీ ద్వారా హృద్రోగ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.●

 అమెరికాకు చెందిన కెండల్‌ అనే అంకుర సంస్థ... కాంతితో జంతువుల మెదడుని నియంత్రించే పరికరాన్ని తయారుచేసింది. దీనికి ‘వైర్‌లెస్‌ రౌటర్‌ ఫర్‌ ద బ్రెయిన్‌’ అని నామకరణం చేసింది. ●

నాచు ఇచ్చిన స్ఫూర్తితోనే

క్లామైడోమోనాస్‌ అనేది ఒకరకం పచ్చని నాచు. మిల్లీమీటర్‌లో వందోవంతు ఉంటుంది దీని పరిమాణం. కంటికి కనిపించనంత చిన్నగా ఉంటుంది. ఆహారతయారీ కోసం కిరణజన్యసంయోగక్రియ చేసుకోవడానికి దానికుండే చిన్నచిన్న చేతుల్లాంటి ఫ్లాగెల్లాల సాయంతో సూర్యుని కాంతి ఎక్కడుంటే అక్కడకు పరుగులు పెడుతుంది. అలా వెళ్లడానికి కారణం... ఆ నాచులో ఉండే ‘చానల్‌రోడాప్సిన్స్‌’ అనే ప్రత్యేకమైన ప్రొటీన్లు. అంటే ఇక్కడ కాంతి ఒక రిమోట్‌ కంట్రోల్‌లా పనిచేసి ప్రొటీన్లని ఎలా కావాలనుకుంటే అలా ఆడిస్తుందన్నమాట. ●

నానో టెక్నాలజీతో కలిస్తే అద్భుతాలేనా?

అది న్యూయార్క్‌లోని బుఫాలో విశ్వవిద్యాలయం. మూలకణాల సాయంతో కృత్రిమంగా తయారుచేసిన మెదడు. అందులో అమర్చిన వైర్‌లెస్‌ పరికరాలు, లేజర్‌ కాంతి పుంజాలు పనిచేయడం మొదలుపెట్టాయి. చేయిపెట్టకుండానే... ఔషధాల అవసరం లేకుండానే. ముఖ్యంగా... మెదడులోని ఎఫ్‌జీఎఫ్‌ఆర్‌ఐ అనే జన్యువుని ప్రేరేపించడం, నిర్వీర్యం చేయడం వంటివి చేశారు. నిజానికి ఇదో పెద్ద విజయం. కారణం ఆ జన్యువు అనుమతితోనే మరో 4,500 జన్యువులు పనిచేస్తాయి. అందుకే దీనిని ‘బాస్‌ జన్యువ’ు అని కూడా అంటారు. ఈ జన్యువు మానవుడు పసిగుడ్డుగా ఉన్నది మొదలు వృద్ధాప్యం వరకూ ఎన్నో విషయాల్లో పాలుపంచుకుంటుంది. కాంతిపుంజాల సాయంతో కనుక దీనిని వేగంగా నియంత్రిస్తే... రొమ్ము క్యాన్సర్‌ని మనం అదుపుచేయగలుగుతాం అనేది బుఫాలో బృందం గట్టి నమ్మకం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.