close

తాజా వార్తలు

70 దాటినా... సాహసానికి సై

ఆమెది ఏడు పదుల వయసు అయినా... యువతతో పోటీపడే ఉత్సాహం.... సాహసం అంటే వెనకడుగు వేయని తత్వం... ఇవన్నీ ఆమెను మలివయసులో 400 సాహసకృత్యాలు చేసేలా ప్రోత్సహించాయి. ఆమే సుధా మహాలింగం. ఆ విశేషాలేంటంటే...

ది 2016. అప్పటికే సుధకు 64 ఏళ్లు. ఆస్ట్రేలియాలోని గ్రేట్‌బారియర్‌ రీఫ్‌ సందర్శనకు వెళ్లారామె. సాహసాలను ఇష్టపడే ఆమె ఫసిఫిక్‌ మహాసముద్రంలో డైవింగ్‌ చేయాలనుకున్నారు. అప్పటి వరకు డైవింగ్‌ అంటే తెలియదు. మొత్తం పది మందితో కలిసి నీటిలో దూకారు. వాళ్లతోపాటు ఒక శిక్షకుడూ ఉన్నాడు. సముద్రం అడుగు భాగానికి చేరుకున్నాక అతడు ఆమెను వదిలేశాడు. ఆమెకు పైకి ఎలా రావాలో తెలియని పరిస్థితి.  పైగా ఆక్సిజన్‌ సిలిండర్‌ పూర్తిగా అయిపోయింది. చాలామటుకూ ఉప్పునీటిని మింగేసి, చనిపోతానని అనుకునే సమయంలో ఆమెను శిక్షకుడు పైకి తీసుకొచ్చాడు. ఇలాంటి అనుభవాలు సుధకు చాలానే ఉన్నాయి. చెన్నైలో పుట్టిపెరిగిన ఆమె పదేళ్లపాటు ప్రముఖ ఆంగ్ల పత్రికలో బిజినెస్‌ విభాగంలో పని చేశారు. ఆ తరువాత ఎనర్జీ సెక్టార్‌ ఎనలిస్ట్‌గా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ ఎనాలసిస్‌లో చేరారు. దేశంలో ఉన్న బొగ్గు, చమురు వంటి సహజశక్తి వనరులు గుర్తించడం ఆమె పని. ఉద్యోగంలో భాగంగా అంతర్జాతీయ సదస్సులకు ఎన్నోసార్లు విదేశాలకు వెళ్లేవారు. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు సెలవు తీసుకుని అక్కడ కొత్త అనుభూతిని కలిగించే సాహసాలు చేయడానికి ఇష్టపడేవారు.

ఆసక్తి ఎలా పెరిగిందంటే...
సుధా మహాలింగం మొదట్లో భర్తతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్లేవారు. క్రమంగా ఒంటరిగా వివిధ ప్రదేశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆమెకు 44 ఏళ్లు. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే విషయాన్ని భర్తతో చెప్పి   మానస సరోవర్‌ యాత్రకు బయలుదేరారు. అది 32 రోజుల యాత్ర. 29 మంది సభ్యులతో ఆ సాహసయాత్ర సాగుతుంది. ప్రభుత్వం అనుమతించిన మొదటి బృందంలోనే సుధకు అవకాశం లభించింది.  ఇలా ఇప్పటి వరకు మొత్తం 400 సాహసయాత్రలు పూర్తి చేశారు. కొన్ని  దేశాలకు 12 సార్లకు పైగా వెళ్లొచ్చారు. మొత్తంగా 65 దేశాలను చుట్టొచ్చారామె.  వీటన్నింటితో కలిపి ఆమె ఆరు ఇండియన్‌ పాస్‌పోర్టులు తీసుకున్నారు.

క్లిష్టపరిస్థితులను లెక్కచేయకుండా...
సుధ మూడేళ్లక్రితం అన్నపూర్ణ బేస్‌క్యాంప్‌, రెండేళ్లక్రితం ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌నకు వెళ్లారు. ‘అక్కడ ఎప్పుడూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు పోతాయి. దారులూ సరిగ్గా ఉండవు. ఒక బేస్‌క్యాంప్‌ నుంచి మరో చోటకు చేరుకోవాలంటే ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఎక్కడా ఆగకుండా పది, పదిహేను గంటలపాటు నడవాలి. నిద్రపోవడానికీ సమయం ఉండదు. 65 ఏళ్ల వయసులోనూ భుజంపై బరువున్న బ్యాగు మోస్తూ ఇవన్నీ చేశా. అలసిపోకుండా గమ్యాన్ని చేరుకున్నా. అన్నపూర్ణ శిఖరంపై 16వేల అడుగులు, ఎవరెస్టు శిఖరం 21 వేల అడుగుల వరకు చేరుకున్నా’ అని చెబుతారు సుధ. మరోసారి ఆమె... ఇరాన్‌లోని మినార్‌ చూడటానికి వెళ్లారు. అది పురాతన పార్శీ దేవాలయం. దాని కట్టడమే భిÅన్నంగా ఉంటుంది. ఆ  అందాలు చూస్తూ అక్కడే చాలా సమయం గడిపేశారామె. సాయంత్రం కావడంతో మినార్‌ ద్వారాలన్నీ మూసేశారు. అక్కడ ఆమె ఇరుక్కుపోయారు. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మినార్‌ పైకి ఎక్కి గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఆ అరుపులు విని అక్కడికి ముంబయి నుంచి వచ్చిన కొందరు  ఆమెను కాపాడారు. ఓసారి ఇండోనేషియాలోని బోర్నియో రెయిన్‌ ఫారెస్ట్‌ ఓరాంటన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకోవాలంటే నది దాటి కొంతదూరం ట్రెక్కింగ్‌ చేయాలి. ఎన్నో విషపూరితమైన పురుగులు, పాములు, జలగలు, చీమలు ఉంటాయి. రోజంతా వర్షం పడుతుంది. నేలంతా బురదగా ఉంటుంది.   ఆ వర్షంలోనూ విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. వాటన్నింటినీ తట్టుకుంటూ ఐదు రోజుల పాటు ఆ అడవిలో గడిపారామె. తాను ఇక్కడితో ఆగిపోలేదని... త్వరలో మరిన్ని సాహస యాత్రలు చేయబోతున్నానట్లు చెబుతారు సుధ.

వ్యాయామం చేస్తా...

రివర్‌ రాఫ్టింగ్‌, పారాగ్లైడింగ్‌, స్కూబా డైవింగ్‌, జిప్‌లైనింగ్‌ వంటి సాహసాల్లో నిత్యం పాల్గొంటారు సుధ. ఇప్పటివరకు చేసిన సాహసకృత్యాలు, తన అనుభవాలన్నింటినీ కలిపి ‘ట్రావెల్‌ గాడ్‌ మస్ట్‌ బి క్రేజీ’ అనే పుస్తకం రాశారు. ఏడాదిలో  సుమారు ఆరేడు సాహసయాత్రలు చేస్తుంటారు. త్వరలో ఆఫ్రికాలోని మడగాస్కర్‌కు వెళ్లనున్నారు. ఆమె భర్త ప్రభుత్వాధికారి. ఆయన సహాయంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నానంటున్నారామె. ‘25 ఏళ్ల నుంచి రోజూ చేసే వ్యాయామాలే నా శక్తికి కారణం. ఇంట్లో చేసిన పోషకాహారాన్ని మాత్రమే తీసుకుంటా. ఇవే నా ఆరోగ్య రహస్యం’ అని అంటారామె.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.