
తాజా వార్తలు
విజేత
వాణిజ్య ప్రపంచంలో గోద్రేజ్ది ఓ బ్రాండ్ ఇమేజ్. అరవైవేల కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న కంపెనీ. దాని పగ్గాలు అందుకోవాలంటే... భవిష్యత్తు వ్యూహచతురత, అందరినీ ఏకతాటిపై నడిపించే నేర్పు, ఆటుపోట్లను తట్టుకోగలిగే మనోనిబ్బరం కావాలి. వారసత్వం ఉన్నా...అందరికీ అలాంటి నాయకత్వ లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఇంటి అమ్మాయి సంస్థలో చేరిన కొన్నాళ్లకే తన సత్తా నిరూపించుకుని పాలనా పగ్గాలు అందుకోగలిగింది. ఆమే నిసాబా గోద్రేజ్.
నిసాబా గోద్రేజ్ చదువు, వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తున్నా... వ్యక్తిగత జీవితానికి, తన అభిరుచులకూ తగిన ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా ఆమెకు గుర్రపు స్వారీ, పర్వతారోహణ అంటే ఆసక్తి ఎక్కువ.
చిన్నప్పటి నుంచే సొంత ఆలోచనలు ఉన్న నిసాబా అంటే... తండ్రి ఆది గోద్రేజ్కి అమితమైన ప్రేమ. తన లాజిక్స్‌తో తండ్రి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగింది. సంస్థలోకి అడుగుపెట్టిన తరువాత సమూల మార్పులు చేయాలనుకుందామె. అదేమీ చిన్నవిషయం కాదు...సంస్థలో సీనియర్ మేనేజర్ల స్థానంలో యువ ప్రతిభావంతులకు చోటు కల్పించాలనుకుంది. ఆ నిర్ణయం చాలామందికి రుచించలేదు. అయినా సరే! తండ్రితో ఆ పని చేయించింది. అలా ఒక్కో విభాగంలోకీ అడుగుపెడుతూ తనదైన ముద్ర చూపించింది.
సామాజిక సేవలో... నిసాబా వ్యాపారాన్ని చక్కగా నిర్వహించడమే కాదు... ఆమెకు సేవాభావమూ ఎక్కువే. ఈ సంస్థ సామాజిక బాధ్యతతో నిర్వహించే గుడ్ అండ్ గ్రీన్ విభాగం ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలూ జరుగుతున్నాయి. గ్రామీణాభివృద్ధి, బాలికల చదువు, ఆరోగ్యం వంటివాటిపై పనిచేస్తోందీ సంస్థ. టీచ్ ఫర్ ఇండియా ఎన్జీవోతో కలిసి పనిచేస్తోంది.
వ్యాపారనాయకత్వం అంటేనే బోలెడు సవాళ్లు. వాటిని స్వీకరించడం, అధిగమించడం అంత సులువేం కాదు. అందులోనూ తనకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకున్న వేలకోట్ల కుటుంబ వ్యాపార సామ్రాజ్య నిర్వహణా బాధ్యతలు... తీసుకోవడం అంటే మాటలు కాదు. ఎన్నో అంచనాలు, మరెన్నో లక్ష్యాలు చేరుకోవాల్సి ఉంటుంది. అంతటి సత్తా నిసాబాకి ఉంది కాబట్టే... ఆమె గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లోని కీలకవిభాగమైన గోద్రేజ్ కన్జ్యూమర్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టగలిగింది. ఇవే కాదు...గోద్రేజ్ కార్పొరేట్ స్ట్రాటజీ, హ్యూమన్ క్యాపిటల్ నిర్వహణా ఆమే చూసుకుంటోంది.
ఆ స్థాయికి ఎలా అంటే...
నిసాబా... ఆ స్థాయికి చేరుకోవడం వెనక ఆమె కష్టం ఎంతో ఉంది. చదువయ్యాక... సంస్థకు చెందిన అగ్రోవెర్ట్ బోర్డులో స్థానం సంపాదించింది. ఉత్పత్తి రూపకల్పన, ఆర్థిక, మానవవనరులు, మార్కెటింగ్, స్ట్రాటజీ... ఇలా ప్రతి విభాగంలోనూ ఆమె పనిచేసింది. ఉదయం ఎనిమిదిన్నరకే ఆమె ఆఫీసుకు చేరుకుని, మెయిళ్లు పంపడం, ఫోన్లు మాట్లాడటం... ఆరోజు ప్రణాళికను రూపొందించుకోవడం... వంటివన్నీ ఇతర ఉద్యోగుల సాయం లేకుండానే చేసేస్తుంది. బాబు జోరాన్ పుట్టిన నెలరోజులకే చంకనెత్తుకుని విధులు నిర్వహించేది. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆమె... పాతతరం పరిశ్రమని కొత్తబాటలో పరుగులుపెట్టించింది. కొన్నాళ్లకే అగ్రోవెర్ట్ సంస్థను లాభాలబాట పట్టించింది. సంస్థలో ప్రతిభావంతులైన యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. సంప్రదాయ మార్కెట్ మెలకువల్ని పాటిస్తూనే... ఇతర సంస్థలతో పోటీపడి గోద్రేజ్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో విలువ పెంచగలిగింది.
వ్యాపార విస్తరణలో...
నూట ఇరవై ఏళ్ల క్రితం...ఓ చిన్న షెడ్డులో తాళాలు తయారీ ప్రారంభించింది గోద్రేజ్ సంస్థ. ఇప్పుడు అది వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన మహా సామ్రాజ్యం. దీనిలోనే గోద్రేజ్ కన్జ్యూమర్స్ది కీలకస్థానం. తలకి వేసుకునే రంగు నుంచి దోమల నివారణకు వాడే మందుల వరకూ ఎన్నో ఉత్పత్తులు దీని కిందకే వస్తాయి. గృహోపకరణాలు... వ్యవసాయ రంగంతో సహా వివిధ విభాగాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. అలాంటి సంస్థలో నిసాబా కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టింది. మూడు కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను అరవై వేల కోట్ల రూపాయలకు పెంచింది. మార్కెట్‌ని గోద్రేజ్ కొత్త ఉత్పత్తులవైపు దృష్టి మళ్లించడం, వాటిపై ప్రయోగాలు చేయడం ఆమె విజయాలు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కేశ సంరక్షణ, సబ్బులు, క్రిమికీటకాల నివారణా ఉత్పత్తులపై దృష్టిపెట్టి సంస్థను ఉన్నత స్థాయికి చేర్చింది.
వ్యక్తిగతం...
గోద్రేజ్ సంస్థల వ్యవస్థాపకుడు ఆది గోద్రేజ్, పరమేశ్వర్ గోద్రేజ్లకు ముగ్గురు సంతానం. వారిలో నిసాబా రెండో అమ్మాయి. 1978లో పుట్టిన ఆమె యూనివర్శిటీ ఆఫ్ పెన్సెల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్లో బీఎస్సీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతాను వివాహం చేసుకుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో, వ్యాపార విస్తరణలో కొత్త వ్యూహాలను అమలుచేయడంలో ఆమెకు తిరుగులేదు. విదేశీ కంపెనీల కొనుగోళ్లలో ఆ సంస్థ అనుసరిస్తోన్న లీప్ ఫ్రాగ్ వ్యూహం పనిచేయడంలో ఆమెదే కీలకపాత్ర. గడిచిన పన్నెండేళ్లల్లో జీసీపీఎల్ మెరుగైన వృద్ధిని సాధించడంలో నిసాబా కృషి చెప్పలేనిది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
