close

తాజా వార్తలు

పిల్లలకు ఇద్దాం.. పాలసీ రక్ష

‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. మా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తాం..’ ప్రతి తల్లిదండ్రుల ఆలోచన ఈ విధంగానే ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను వారు అన్వేషిస్తూనే ఉంటారు. మంచి బడిలో, ఉన్నత విద్యాభ్యాసం ప్రముఖ కళాశాలల్లో చదివించేందుకు ప్రయత్నిస్తుంటారు. చదువుకయ్యే ఖర్చు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీన్ని తట్టుకునేందుకు సరైన వ్యూహాలు లేకపోతే.. అనుకున్న లక్ష్యం నెరవేరదు.. మరి ఏం చేయాలి?

నుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవి జీవిత బీమా పాలసీలు. వీటిలో పిల్లల చదువుల ఖర్చులకు ఉపయోగపడేలా పొదుపు, పెట్టుబడులకు, వారి చదువుల ఖర్చుకు రక్షణ కల్పించేవీ ఉంటాయి. దురదృష్టవశాత్తూ తల్లిండ్రులకు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు.. వారి భవిష్యత్తుకు, చదువులకు ఒక భరోసా కల్పించేందుకూ వీలుంటుంది. వెంటనే పాలసీ  మొత్తం ఇవ్వడంతోపాటు, ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియాన్నీ బీమా సంస్థే భరిస్తుంది. పాలసీ వ్యవధి తర్వాత పాలసీ విలువను నామినీకి అందిస్తుంది. ఇలా పాలసీ రక్షణ దూరం కాకుండా చూస్తుంది.

పెట్టుబడి పథకాలు అంటే.. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, బంగారం, స్థిరాస్తి తదితర పెట్టుబడి పథకాల్లో నిరంతరం మదుపు చేస్తూనే ఉండాలి. పెట్టుబడి పెట్టే వ్యక్తి మరణిస్తే.. వెంటనే ఇవీ ఆగిపోతాయి. అప్పటివరకూ జమైన మొత్తం, కొంత రాబడితో నామినీకి అందుతాయి. పూర్తిగా ఆ లక్ష్యం తీరడానికి ఆ సొమ్ము సరిపోతుందా లేదా అనేది చెప్పలేం. అందుకే, పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా పిల్లల బీమా పాలసీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికీ ప్రీమియాన్ని పాలసీదారుడే చెల్లించనప్పటికీ.. కుటుంబానికి దూరం అయినప్పుడు మాత్రం ఈ పాలసీల నిబంధనల ప్రకారం సొంతంగా ప్రీమియాన్ని చెల్లించుకుంటాయి.

పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, వారి వివాహం, సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభించడంలాంటి సందర్భాల్లో అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ఈ బీమా పాలసీలు ఉపయోగపడతాయి. ఈ పాలసీలను తీసుకోవడం వల్ల పిల్లల కోసం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలనే క్రమశిక్షణ అలవడుతుంది. ఈ మొత్తాన్ని వారికి మాత్రమే ఖర్చు చేసే లక్ష్యంతో ఉండాలి.. వారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ పాలసీ మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడకూడదు అనే స్వీయ నియంత్రణా ఇక్కడ ముఖ్యమే.

అవసరానికి తగ్గట్టుగా..
వీటిలో సంప్రదాయ పాలసీలతోపాటు, యూనిట్‌ ఆధారిత పిల్లల బీమా పథకాలూ అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లల అవసరాలను బట్టి, ఎంత మొత్తం కావాలి.. ఎప్పటికి అవసరం అనేదాని ఆధారంగా ఏ పాలసీని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. మీ ఆర్థిక సలహాదారుడిని లేదా బీమా సంస్థను సంప్రదించి, ఏ పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి? దానికోసం నెలకు ఎంత కేటాయించాలన్నది అన్నది తెలుసుకోండి.

ఎండోమెంట్‌ ప్లాన్‌ తీసుకున్నప్పుడు.. బీమా సంస్థకు వచ్చే లాభాలు, మిగులు ఆధారంగా బోనస్‌ లభిస్తుంది. ఈ పాలసీలు సమీకరించిన డబ్బును ప్రాథమికంగా డెట్‌ పథకాల్లో మదుపు చేస్తాయి. కాబట్టి, వార్షిక సగటు రాబడి 6 శాతానికి అటూఇటూగా ఉండే వీలుంటుంది. మీరు అధిక నష్టభయం భరించే అవకాశం ఉంటే.. కాస్త ఈక్విటీ పెట్టుబడుల వైపు మొగ్గు చూపొచ్చు. ఇలాంటప్పుడు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను (యులిప్‌) ఎంచుకునే విషయాన్ని పరిశీలించవచ్చు. కనీసం పదేళ్ల వ్యవధి ఉన్నప్పుడే యులిప్‌ల వైపు చూడాలి. పాలసీ వ్యవధి తీరేందుకు ఇంకా మూడేళ్లు ఉందనప్పటి దాకా ఈక్విటీల్లోనే కొనసాగండి. మీ లక్ష్యం సమీపిస్తున్న కొద్దీ క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. డెట్‌ పథకాలకి మారాలి.
టర్మ్‌ పాలసీ, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడమూ మంచిదే అనే సూచన చాలామంది చేస్తుంటారు. పిల్లల చదువుల ఖర్చులకు ఉపయోగపడేలా ఫండ్లు, అనుకోనిదేదైనా జరిగినప్పుడు టర్మ్‌ పాలసీ ఉపయోగపడుతుంది. అన్ని సందర్భాల్లోనూ ఇదే సూత్రం పనిచేస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఏ పెట్టుబడి పథకమూ.. పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా కచ్చితంగా ఇంత మొత్తం ఇస్తామని హామీ ఇవ్వదు. మదుపు చేసేప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు.

ప్రత్యేకత ఏమిటి?
పిల్లల బీమా పాలసీల్లో చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమిటి? అనే సందేహం రావచ్చు.. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీగా ఉన్న అమ్మాయి/అబ్బాయి పేరుమీద వెంటనే ఆ పాలసీ విలువను చెల్లిస్తారు. సాధారణంగా ఒకసారి పరిహారం చెల్లించిన తర్వాత ఆ పాలసీ రద్దవుతుంది. కానీ, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీల్లో ఇది భిన్నంగా ఉంటుంది. పాలసీదారుడి తరఫున బీమా సంస్థ ఆ పాలసీకి ప్రీమియం చెల్లింపును కొనసాగిస్తుంది. అంటే.. పాలసీ రద్దవకుండా కొనసాగుతుందన్నమాట. ఇలా పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత మరోసారి నిర్ణీత మొత్తం అందుతుంది. అంటే, మొత్తం రెండుసార్లు పరిహారం అందుతుందన్నమాట. పిల్లల బీమా పాలసీలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఇదే. తనకు ఆధారమైన వ్యక్తి దూరమైనా.. అతని/ఆమె నిర్వహించాల్సిన బాధ్యత తీర్చేందుకు ఈ పాలసీ సహాయం చేస్తుంది. ఇందులో ‘వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం’ ఆప్షన్‌ ఉండటం వల్ల ఇలా ప్రీమియం చెల్లింపులు రద్దవుతాయి. పాలసీదారుడు మరణించినప్పుడు.. భవిష్యత్తు ప్రీమియాలు బీమా సంస్థ భరించాలంటే.. ఇది కచ్చితంగా తీసుకోవాల్సిందే. పాలసీదారుడు పాలసీ వ్యవధి పూర్తయ్యేవరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా పాలసీని కొనసాగిస్తే.. పాలసీ విలువతోపాటు, బోనస్‌లు ఇతర ప్రయోజనాలు చెల్లిస్తారు. ఒకవేళ యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌) ఎంచుకుంటే.. ఫండ్‌ విలువ లభిస్తుంది.

ప్రీమియం వైవర్‌ ఎలా పనిచేస్తుందంటే..: పాలసీదారుడు మరణించినప్పుడు.. బీమా సంస్థ ఆ పాలసీ విలువ మొత్తాన్ని నామినీకి లేదా అతని కుటుంబానికి చెల్లిస్తుంది. అంతటితో పాలసీ ఆగిపోదు. బీమా సంస్థ ఆ పాలసీని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల బీమా మొత్తం క్రమం తప్పకుండా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. పిల్లలకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మరోసారి డబ్బు అందే ఏర్పాటు దీనివల్ల కలుగుతుంది. చాలా పిల్లల పాలసీల్లో ఈ ప్రీమియం వైవర్‌ అంతర్లీనంగా ఉంటుంది. కొన్నింటిలో దీనికి అదనంగా కొంత ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.