close

తాజా వార్తలు

టెక్‌కరి దంతాలు

తక్కిన అనారోగ్యాల మాటేమో కానీ పంటినొప్పి అంటే మాత్రం ఎవరైనా వణికిపోవాల్సిందే. కారణం... వారాల తరబడి వైద్యుల చుట్టూ తిరగాలి. నొప్పిని భరించాలి. రూట్‌కెనాల్‌, క్యాప్‌, కొత్తదంతాలు.. ఇవేమీ ఒక్కరోజుతో అయిపోయే చికిత్సలు కావు.  బోలెడంత సమయాన్ని వెచ్చించడంతో పాటు ఖర్చునీ భరించాలి. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ కృత్రిమమేధ దంత వైద్యాన్ని కొత్తపుంతలు తొక్కించనుంది. అదెలాగో చూడండి...
పంటినొప్పంటే వీలైనంత వరకూ భరించేస్తారు కానీ.. దంత వైద్యుడి దగ్గరకు వెళ్లడానికి మాత్రం చాలామంది వెనకడుగు వేస్తారు. కారణం... వైద్యానికి అధిక సమయం తీసుకోవడం, నొప్పితో కూడిన పాతతరం వైద్య విధానాలే. కృత్రిమమేధ రాకతో ఆ పరిస్థితికి చెక్‌పెట్టేయొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే పంటికి రక్షణగా బిగించే క్రౌన్స్‌ వంటి వాటికోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం కూడా లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కరోజులో ప్రత్యామ్నాయ దంతాలను ఏర్పాటు చేసుకోవచ్చట.

 


స్మార్ట్‌ టూత్‌బ్రష్‌లు

భవిష్యత్తులో మనం రోజూ వాడే సాధారణ బ్రష్‌ని ఇక వాడకపోవచ్చేమో! ఆ స్థానంలోకి సూపర్‌ స్మార్ట్‌ బ్రష్‌లు రావొచ్చు. యాప్‌ అనుసంధానంతో పనిచేసే ఈ బ్రష్‌లు మీ దంతాల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి. రోజూ బ్రష్‌ చేసేటప్పుడు దంతాలపై ఎంత ఒత్తిడి తెస్తున్నారు? అతిగా తోమేస్తున్నారా? ఏ దంతాలని నిర్లక్ష్యం చేస్తున్నారు? చిగుళ్లని శుభ్రం చేశారా? ఏవి దంతక్షయానికి గురవుతున్నాయి? ఎక్కడయినా అంతర్గత పగుళ్లు ఉన్నాయా, పిప్పిపళ్లు ఎక్కడున్నాయి? వాటి కారణంగా పంటి నాడులు ఏమైనా దెబ్బతిన్నాయా?.. ఇటువంటి సమాచారాన్ని సెన్సర్ల సాయంతో సేకరించి వాటి రంగుల చిత్రాలతో సహా మీ స్మార్ట్‌ఫోన్‌కి ఆ సమాచారాన్ని చేరవేస్తాయి ఈ బ్రష్‌లు. స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలయితే మరొక అడుగు ముందుకేసి లాలాజలాన్ని విశ్లేషించి గుండెజబ్బుల గురించిన ముందస్తు సమాచారాన్ని అందించే బ్రష్‌ని తయారుచేశారు. మొత్తం మీద ఆసుపత్రుల దగ్గర ఎక్కువ సమయం వెచ్చించకుండా ఈ బ్రష్‌ల నుంచి ఫోన్లకు అందిన సమాచారాన్ని విశ్లేషించొచ్చు. దీంతో అందుకు తగిన వైద్యాన్ని అందించడం తేలికవుతుందని, సమయం ఆదా అవుతుందని అంటున్నారు నిపుణులు. అంటే రానున్న రోజుల్లో ఇంటి నుంచే దంత సమస్యల్ని  కనిపెట్టేయొచ్చన్నమాట.


ఎప్పుడు డాక్టర్‌ని కలవాలో తెలిపే కృత్రిమమేధ

దంతవైద్యంలో కృత్రిమమేధ సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తుందని అంటున్నారు వైద్యనిపుణులు. దంత సమస్యలతో బాధపడే రోగుల పూర్తి వైద్య సమాచారంతోపాటు రోగుల ఎక్స్‌రేలు, సీటీస్కాన్‌లు, రేడియోగ్రాఫిక్‌ చిత్రాలు అలాగే స్మార్ట్‌బ్రష్‌లు వంటి పరికరాలు అందించిన వేలాది చిత్రాలని విశ్లేషించి దంత సమస్యలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డేటా రూపంలో తమ వద్ద ఉంచుకుంటుంది. దాంతో సరిపోల్చుకుంటూ తేలిగ్గా కొత్త రోగుల సమస్యలని గుర్తించడంతో పాటు రాబోయే దంత సమస్యల గురించి, వాటి కారణంగా తలెత్తే ఇతర అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించడమే ఏఐ గొప్పదనం. తర్వాత డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఎప్పుడు తీసుకోవాలనేది కూడా కృత్రిమ మేధ మీకు చెప్పేస్తుంది. అగ్‌మెంట్‌ రియాలిటీ, కృత్రిమమేధ... ఈ సాంకేతిక పరిజ్ఞానాలు రెండింటినీ కలిపితే భవిష్యత్తులో కాస్మెటిక్‌ సర్జరీల్లో అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు నిపుణులు.


త్రీడీ దంతాలు

పగిలిన లేదా పాడయిన దంతాలని గుర్తించడం, వాటికి రక్షణగా ఉండే క్రౌన్స్‌ని తయారుచేయడానికి ఇప్పటివరకూ అయితే కొన్ని వారాల సమయం పట్టేది. కారణం అందరి దంతాలు ఒకేలా ఉండవు కదా... దాంతో సరైన క్రౌన్‌ బిగించడానికి వాటి కొలతలని కచ్చితంగా తీసుకోవాలి. తీసుకొన్న తర్వాత అంతే కచ్చితంగా క్రౌన్స్‌ని తయారుచేయాలి. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా దంతాలు సరిగ్గా అమరవు. సమస్య మళ్లీ మొదటికే వస్తుంది. డిజిటల్‌ స్కానింగ్‌ పద్ధతిలో పంటి కొలతలని కచ్చితంగా తీసుకుని త్రీడీ ప్రింటర్ల సాయంతో గంటలోనే పక్కాగా క్రౌన్స్‌ని తయారుచేస్తున్నారు. దీంతో అటు వైద్యులకు ఇటు రోగులకూ చాలా సమయం ఆదా అవుతుంది.


రోబోలే వైద్యం చేస్తాయా?

దంతాల నిర్మాణం క్లిష్టమైంది. వీటికి చికిత్స అందించడానికి, సరిచేయడానికి వైద్యులకే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటిది రోబోలు ఎలా వైద్యం చేస్తాయనే అనుమానం రావచ్చు. వైద్యుల పర్యవేక్షణలో దంతాలని సరిచేయడం, కటింగ్‌ వంటి పనులని భవిష్యత్తులో రోబోలే చేస్తాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో రోబోలు ఈ పనులు చేస్తున్నాయి కూడా. డిజిటల్‌ ఇంప్రెషన్లు తీసుకోవడానికి, సిమెంట్‌ వంటివి అమర్చడానికి, లేజర్‌ సాయంతో దంతాల కొలతలు తీసుకోవడానికి ప్రస్తుతానికి వీటిని వాడుతున్నారు.  
పంటి పట్టీలు అవసరం లేకుండానే కొంతమందిలో పలువరుస సరిగా లేకపోవడం, ఒకదానిపై ఒకటి రావడం లేకపోతే ఖాళీలు వంటివి వస్తుంటాయి. వీటిని సరిచేయడానికి పైకి కనిపించే బ్రేసెస్‌, అలైనర్స్‌ వంటి పంటి పట్టీలను వేస్తుంటారు. ఇవి చూడ్డానికి కాస్తంత ఇబ్బందిగానే ఉంటాయి. అలా కాకుండా త్రీడీ పద్ధతిలో తయారుచేసిన పారదర్శక బ్రేసెస్‌ని అమర్చే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఎల్‌ఈడీ లైట్లు, లిథియం అయాన్‌ బ్యాటరీలతో ఇది పని చేస్తుంది. ఇవి పంటివరుసని మార్చేస్తాయి. మెకనోడాంటిక్స్‌ అనే సంస్థ పైకి కనిపించే బ్రేసెస్‌ అవసరం లేకుండానే చిన్నస్ప్రింగులతో పనిచేసే సరికొత్త వైద్యవిదానాన్ని తీసుకొచ్చింది. ఈ స్ప్రింగ్స్‌ని అమర్చడానికి పట్టే సమయం కూడా చాలా తక్కువ.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.