
తాజా వార్తలు
దిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై సమర భేరి మోగించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 5 నుంచి 15 వరకు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, ఉపాధి, ధరల పెరుగుదల, బ్యాంకింగ్ వ్యవస్థ పతనం, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం తదితర అంశాలపై నిరసనలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ చివరి వారంలో దిల్లీలో నిర్వహించే సభతో ఈ నిరసన కార్యక్రమం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శలు, రాష్ట్రాల ఇన్ఛార్జులు తదితరులతో సమావేశమయ్యారని, నవంబర్ 2న నిరసన కార్యక్రమాలకు సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా ఇప్పటికే 31 మంది పార్టీ సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.