close

తాజా వార్తలు

దిల్లీలో మళ్లీ  సరి-బేసి విధానం 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నేటి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సరి-బేసి విధానాన్ని ప్రారంభించింది. ఉదయం 8గంటల నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రజలెవరూ ఉల్లంఘనలకు పాల్పడొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కోరారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేసేందుకుగానూ రాష్ట్రవ్యాప్తంగా 200ట్రాఫిక్‌ బృందాల్ని మోహరించారు. అలాగే మరో 5000మంది స్వచ్ఛంద కార్యకర్తలు కూడా పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై రూ.4 వేలు జరిమానా విధించనున్నారు. ఈరోజు కేవలం సరిసంఖ్య గల వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. నవంబర్‌ 15వరకు ఈ విధానం అమలులో ఉండనుంది. అయితే ఈ నిబంధన నుంచి విద్యుత్‌ వాహనాలకు మినహాయింపునిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సరి-బేసి విధానం అమలులో ఉన్నన్ని రోజులు దిల్లీ మెట్రో 61అదనపు సర్వీసులు నడపనుంది. సోమవారం ఉదయం కూడా దిల్లీ పూర్తిగా పొగమంచు గుప్పిట్లో చిక్కుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం ఏక్యూఐ 500గా నమోదవడం గమనార్హం.    

దిల్లీలో గాలి నాణ్యత మూడేళ్లలో అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఆదివారం దిల్లీలోని జహంగీర్‌పురి, రోహిణి, సోనియా విహార్‌ తదితర ప్రాంతాల్లో ఈ సూచీ 999ని తాకడం గమనార్హం. కాలుష్యం కారణంగా దిల్లీ పరిసరాల్లోని నోయిడా, గ్రేటర్‌ నోయిడా, గాజియాబాద్‌లో అన్ని పాఠశాలలకు ఈ నెల 5 వరకు సెలవులు ప్రకటించారు. హరియాణా ప్రభుత్వం గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే మహానగరంలోని ప్రజలకు దాదాపు 50లక్షల మాస్కులను పంపిణీ చేశారు. 

ప్రజలు ఓవైపు కాలుష్య కోరల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కేజ్రీవాల్‌ సరి-బేసి విధానాన్ని ప్రకటించారని భాజపా విమర్శిస్తోంది. ఇది కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమవుతుందన్నారు. నిబంధనల్ని ఉల్లంఘించి కారులో దిల్లీ వీధుల్లో తిరుగుతానని సవాల్‌ విసిరారు. అలాగే కాలుష్య సమస్య పరిష్కారానికి కూర్చొని మాట్లాడుకుందామంటూ కేంద్రప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలకు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.