వయసా..ఆగిపో!

తాజా వార్తలు

Updated : 13/11/2019 00:22 IST

వయసా..ఆగిపో!

పరుగులు పెట్టే కాలానికి పగ్గం వేసే శక్తి ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం. నచ్చిన యవ్వన క్షణాలని పదిలంగా దాచేసుకుని నచ్చని మరణ భయాలని, వ్యాధులని నిర్ధాక్షిణ్యంగా చెరిపేస్తాం. అదే శాస్త్రవేత్తలయితే మరికొంత ముందుకెళ్లి... కాలాన్ని కట్టేసి మొత్తం విశ్వాన్ని ఓ చుట్టుచుట్టి వస్తారేమో! ప్ఛ్‌. మనకా శక్తి లేదని నిట్టూరుస్తున్నారా? మనకి లేదు కానీ... మనతో పాటు ఈ భూమ్మీద జీవిస్తున్న కొన్ని జీవులకు కాలాన్ని కట్టడి చేసే శక్తి ఉంది. ఆ రహస్యమేదో మనకీ తెలిస్తే వయసుకి కళ్లెం వేయొచ్ఛు క్యాన్సర్లని తరిమికొట్టొచ్ఛు అంపశయ్యపై ఉన్న క్షతగాత్రులని కాపాడుకోవచ్ఛు అదెలా సాధ్యం. చూద్దాం...

నమిప్పుడు మాట్లాడుకుంటున్నది గోడ గడియారంలోని ముళ్లు చెప్పే కాలం గురించి కాదు. మన శరీరంలో యవ్వనం, వృద్ధాప్యం, మరణం వంటి మార్పులకు కారణమయ్యే జీవ గడియారం గురించి. ఆ గడియారాన్ని మనం నియంత్రణలోకి తీసుకుంటే శరీరంలో వచ్చే మార్పులని నిలువరించగలమా.. అనేది శాస్త్రవేత్తల ముందున్న సవాల్‌. గూగుల్‌ సహా అమెరికాలోని మరికొన్ని విశ్వవిద్యాలయాలు యాంటీ ఏజింగ్‌ దిశగా చేస్తున్న పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఎటువంటి ప్రాణవాయువు తీసుకోకుండా గడ్డు వాతావరణంలో సైతం సంవత్సరాల తరబడి సుషుప్తిలో జీవనం సాగించే తాబేళ్లు, కప్పలు, ఎలుకలు, కొండచిలువలు ఈ ప్రయోగాలకు స్ఫూర్తినిస్తున్నాయి.

ఆ గుట్టు తెలిస్తే అంతరిక్షంలోకి వెళ్లొచ్చు: గాలి పీల్చుకోకుండా మనం ఎంత సేపు జీవించగలం? ఆ ఊహ వస్తేనే మనకు ఊపిరాడదు కదూ! ఉత్తర అమెరికాలో నివసించే పెయింటెడ్‌ టర్టిల్‌ రకం తాబేళ్లు 100 రోజులపాటు గాలి పీల్చుకోకుండా హాయిగా బతికేస్తాయి. గడ్డకట్టిన మంచుపొరల అడుగున కొన్నినెలలపాటు తాబేళ్లు ఇలా జీవించడానికి కారణం... జీవక్రియల వేగాన్ని వాటంతట అవి గణనీయంగా తగ్గించేసుకోవడమే. ఈ క్రమంలో వాటికి ఆక్సిజన్‌ అవసరం తగ్గుతుంది. ఎముకలు అరగవు. అంతర్గత అవయవాలు అలసిపోవు. కానీ ప్రాణం ఉంటుంది. అంటే ఒకరకంగా శరీరానికి సంబంధించిన కాలాన్ని స్తంభింపచేయడమే ఇది. దీనివెనుక ఉన్న జన్యు రహస్యం తెలిస్తే అంతరిక్ష పరిశోధకుల పంట పండినట్టే. శరీరంలో వయసు ఛాయల్ని కట్టడిచేయొచ్ఛు అంతరిక్ష యాత్రికులు ఇలాంటి సుషుప్తిలోనే ఉంటూ కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరాన్ని సులభంగా చేరుకోవచ్ఛు అప్పటికి వారి వయసు బయలుదేరినప్పుడు ఎంత ఉంటుందో గమ్యం చేరుకున్నప్పుడు అంతే ఉంటుంది.

మెదడు క్షేమంగా: మనం తీసుకునే గాలిలో ఎక్కువ భాగం ఆక్సిజన్‌ని వాడుకునేది మెదడే. మరి ఆక్సిజన్‌ లేకుండా తాబేళ్లలోని మెదడు ఎలా పనిచేస్తోంది అనేది కూడా శాస్త్రవేత్తల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్న అంశం. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి వచ్చినప్పుడు మెదడుకి తాత్కాలికంగా ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోతుంది. అంటే ఒకరకంగా పవర్‌కట్‌ అయిన పరిస్థితి. ఆ స్థితిలో మెదడులో కణాలు చనిపోవడం మొదలవుతుంది. తాబేళ్ల విషయంలో అలా జరగడం లేదంటే అక్కడేవో ప్రత్యేకమైన రసాయనాలు విడుదలవుతున్నాయి. అవేంటో తెలిస్తే బ్రెయిన్‌స్ట్రోక్‌, హార్ట్‌స్ట్రోక్‌ వంటివి వచ్చినప్పుడు మనుషుల్ని కాపాడుకోవడం తేలిక అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.

కప్ప గుట్టు తెలిస్తే... అవయవాలని కాపాడుకోవచ్చు: ఉడ్‌ ఫ్రాగ్‌. ఈ కప్ప కెనడాలో కనిపిస్తుంది. మైనస్‌ డిగ్రీల్లో ఉండే చలిగాలులని సైతం చాలా తేలిగ్గా తట్టుకుంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ స్థాయిల్లోకి చేరుకున్నప్పుడు తన శరీరంలోని మూడోవంతుని తనంతట తానుగా ఘనీభవింపజేసుకుంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని తేమ, వేడి బయటకు పోకుండా ఉంటాయి. తిరిగి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మామూలు స్థితికి చేరుకుంటుంది. ఇలా తనంతట తానుగా ఘనీభవింపచేసుకోవడానికి ఆ కప్పకి ఏ అణువులు, రసాయనాలు సహకరించాయో తెలిస్తే మనకు బోలెడు ప్రయోజనాలు సమకూరతాయి. గుండె, కాలేయం సహా ఇతర శరీర అవయవాలని తరలించేటప్పుడు, రక్తాన్ని ఒక చోట నుంచి మరొక చోటికి చేరవేసేటప్పుడు వాటిని సరైన ఉష్ణోగ్రతల్లో ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. ఆ పరిస్థితులు లేకనే అవయదానం చేసిన అవయవాల్లో అధికభాగం అక్కరకు రాకుండా పోతున్నాయి. అదే ఈ కప్ప మాదిరిగా ‘పార్షియల్‌ ఫ్రీజింగ్‌’ నైపుణ్యం ఉంటే అనేక మందికి అవయవాలని అందించగలుగుతాం అంటున్నారు శాస్త్రవేత్తలు. టీకాలు, మందులు, రక్తం వంటివి తరలించేటప్పుడు శీతలీకరణ వ్యవస్థ లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.

క్యాన్సర్‌ బలాదూర్‌: మోల్‌ర్యాట్‌... ఇదో రకం ఎలుక. శత్రువుల నుంచి కాపాడుకోవడానికి భూమిలో బొరియ తవ్వి ఆక్సిజన్‌ ఏమాత్రం అందుబాటులో లేనిచోట కూడా ఏళ్లపాటు జీవిస్తుంది. ఆక్సిజన్‌ లేకపోయినా... ఆహారం లేకపోయినా, రేడియేషన్‌ బారిన పడ్డా దీని శరీరంలో ఎటువంటి మార్పులు లేకపోవడం శాస్త్రవేత్తలని ఆశ్చర్యానికి గురిచేసింది. క్యాన్సర్‌పై గెలవాలంటే మోల్‌ర్యాట్‌ శరీరంలోని జన్యువుల గుట్టు తెలుసుకుంటే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. ●

కొండచిలువలు ఆహారం లేనప్పుడు కొన్నినెలల పాటు ఎటువంటి కదలికా లేకుండా పడుకునే ఉంటాయి. శరీరంలోని అవయవాలన్నీ ముడుచుకుపోయి శుష్కించుకుని ఉంటాయి. చిత్రంగా.. ఆహారం దొరకగానే ఒక్కసారిగా శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ చైతన్యం అవుతాయి. అవయవాలు రెట్టింపు పరిమాణంలోకి మారి శరీరాన్ని మామూలు స్థితికి తెచ్చేస్తాయి. ఇదెలా సాధ్యం అనేదానిపై టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేస్తోంది. ఆ గుట్టు తెలిస్తే కొన్ని రకాల వ్యాధుల కారణంగా శుష్కించిన మానవ శరీరాల్లోని అవయవాలకి పూర్వపు పనితీరుని తీసుకురావడం సులభం అవుతుందనేది శాస్త్రవేత్తల ఆలోచన.

సైనికులని బతికించుకోవచ్చా?: టార్డీగ్రేడ్‌. దీన్నే ‘నీటి ఎలుగుబంటి’ అని కూడా అంటారు. అలాని ఇదేదో భారీ జీవి అనుకునేరు. చాలా చిన్నజీవి. ఈ జీవికున్న ప్రత్యేకతలు మాత్రం ప్రపంచ శాస్త్రవేత్తలకు ఎన్నో రకాలుగా స్ఫూర్తినందిస్తున్నాయి. టార్డీగ్రేడ్‌ అత్యల్ప ఉష్ణోగ్రతల దగ్గర ఎంత సులభంగా జీవించగలదో, భగభగమండే ఉష్ణోగ్రతల దగ్గర కూడా అంతే సులభంగా జీవిస్తుంది. సముద్రపు అట్టడుగున ఎంత హాయిగా ఉండగలదో... శూన్యంలోనూ, అంతరిక్షంలోనూ అంతే అనుకూలంగా జీవించగలుగుతుంది. రేడియేషన్‌ని సైతం తట్టుకుంటుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తే... ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు తన జీవక్రియలని స్తంభింప చేస్తుందని తెలిసింది. అంటే లోపలి జీవ గడియారాన్ని పూర్తిగా ఆపేస్తుంది. ఇలా చేయడాన్ని క్రిప్టో బయోసిస్‌ అంటారు. ఇలా కాలానుగుణంగా అనుకూల పరిస్థితులు ఏర్పర్చుకుంటూ శరీరాన్ని కాపాడుకునే ఆ గుట్టు ఏంటో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నారు. ఆ రహస్యం తెలిస్తే.. యుద్ధంలో క్షతగాత్రులయిన సైనికులను బతికించుకోవడం తేలికవుతుంది కాబట్టే రక్షణ శాస్త్రవేత్తలు ఈ జీవి జన్యువుల గుట్టు విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పరిశోధనలు విజయవంతమయితే... ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటూ వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా మనం కూడా బతికేయొచ్చేమో!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని