
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: నిర్ణీత గడువులో మహారాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయేసరికి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సిఫారసు మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. సీఎం పదవీకాలాన్ని పంచుకునే విషయంలో భాజపా, మిత్రపక్షం శివసేన మధ్యలో సరైన పొత్తు కుదరకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని భాజపా చేతులెత్తేసింది. అనంతరం శివసేనకు అవకాశం లభించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోయేసరికి శివసేన అంచనాలు మరోసారి తప్పాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో పార్టీల మధ్య నెలకొన్న గందరగోళం చివరకు రాష్ట్రపతి పాలనకు దారితీశాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలనకు దారితీసిన అనేక అంశాలు 2005లో బిహార్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని గుర్తుకు తెస్తున్నాయి. అప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నిర్ణయాలతోనే అసెంబ్లీని రద్దు చేశారు.
అప్పుడు 7 రోజులు.. ఇప్పడు 19 రోజులు..
బిహార్ రాష్ట్రంలో 243 నియోజకవర్గాలకు 2005లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే నెల 27న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో ఎన్డీయే కూటమి (భాజపా+జేడీయూ) 92 సీట్లను దక్కించుకుంది. రాష్ట్రీయ్ జనతాదళ్ (ఆర్జేడీ) 75 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు, ఎల్జేపీ 29 సీట్లను దక్కించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (122)ను పార్టీలు సాధించలేకపోయాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అయిన అప్పటి బిహార్ గవర్నర్ బుటాసింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పార్టీలకు ఏడు రోజలు గడువును విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోయేసరికి రాష్ట్రపతి పాలనను సిఫారసు చేస్తూ కేంద్ర క్యాబినెట్‌కు లేఖ రాశారు. మహారాష్ట్ర విషయంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ 19 రోజులు వేచిచూసిన అనంతరం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు.
అసెంబ్లీ రద్దుకు గవర్నర్ సిఫారసు..
అదే ఏడాది ఏప్రిల్‌లో 115 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ భాజపా, జేడీయూ కూటమి గవర్నర్‌ను కోరారు. సానుకూలంగా నిర్ణయం వస్తుందనుకున్న తరుణంలో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాంవిలాస్ పాసవాన్‌కు చెందిన ఎల్జేపీ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా కొనేందుకు ఎన్డీయే కూటమి యత్నింస్తోందని పేర్కొంటూ గవర్నర్ బూటాసింగ్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బిహార్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తూ మరోమారు మే 21న యూపీఏ ప్రభుత్వానికి గవర్నర్ నివేదిక అందించారు. గవర్నర్ బూటాసింగ్ నివేదిక అందిన మరుసటి రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే రష్యా పర్యటనలో ఉన్న అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం క్యాంప్ కార్యాలయానికి సంబంధిత దస్త్రాలను పంపించారు. రెండు గంటల వ్యవధిలోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో బిహార్ అసెంబ్లీ రద్దయింది. దీంతో అదే ఏడాది అక్టోబర్‌లో మళ్లీ నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ సారి భాజపా, జేడీయూ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ లభించింది.
రాజ్యంగవిరుద్ధంగా రద్దు చేశారు: సుప్రీంకోర్టు
బిహార్ అసెంబ్లీని రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయితే అసెంబ్లీని పునరుద్ధరించాలని భావించిన కోర్టు అప్పటికే మరోమారు ఎన్నికలు పూర్తయి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేకపోయింది. ‘కేవలం గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోకూడదు. రాష్ట్రంలో పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. కేంద్ర క్యాబినెట్‌ను గవర్నర్ తప్పుదారి పట్టించారు’ అని 2006లో తీర్పును వెల్లడించిన సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
బిహార్ తరహాలో మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు సంకేతాల కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భాజపా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ‘ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఎలా చేస్తారు? అనేది ఇక్కడ ముఖ్యం కాదు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి సరైంది కాదు. మరోమారు ఎన్నికలకు సిద్ధం అవండి. 2020లో మొదట్లో ఈ ఎన్నికల జరిగే అవకాశాలున్నాయి. అప్పుడు శివసేనతో ఎన్నికలకు వెళ్దామా?లేదా? అనేది తేల్చాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపం చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతూ బిహార్ తరహా రాజకీయ పరిస్థితులను తలపిస్తోంది. అదే జరిగి 2020లో తిరిగి మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించాలంటే మొదటగా అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
