
తాజా వార్తలు
ప్రముఖ మహిళావ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. గత 150 ఏళ్లలో ఈ స్థానాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారామె. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో నీతాకు ఉన్న ఆసక్తి, శ్రద్ధే ఆమెకు ఈ గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమెను తమ బోర్డు గౌరవ ధర్మకర్తగా ఎన్నుకున్నట్లు మెట్రోపాలిటన్ మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్స్కీ ప్రకటించారు. నవంబరు 12న జరిగిన బోర్డు సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. రెండేళ్లక్రితం ఆమెను వింటర్ పార్టీకి ఆహ్వానించి అరుదైన గౌరవాన్ని అందించిన మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్... ఇప్పుడు బోర్డులోకి ఆహ్వానించడం విశేషం.
ఆమే ఎందుకంటే...
మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించడంలో నీతా ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కళలు, క్రీడారంగాలను ప్రోత్సహించడంలో ఆమె కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ, గ్రామీణప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, క్రీడాభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులకు చేయూత వంటి అంశాల్లో... కోట్లాదిమంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేస్తున్నారామె. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే దిశగా పలురకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మూడేళ్లక్రితం ఫోర్బ్స్ పట్టికలో 50 మంది అత్యంత శక్తిమంతమైన మహిళా వాణిజ్యవేత్తల్లో ఒకరిగా నిలిచారామె. సంఘసంస్కర్తగా, వ్యాపారవేత్తగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న నీతా... ఈ మ్యూజియానికి మూడేళ్లుగా తనదైన సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఆ సంస్థ నిర్వహించే ప్రదర్శనలు భారతదేశంలోనూ ఏర్పాటు చేసేలా సహకారం అందిస్తున్నారు. మూడేళ్లక్రితమే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌కి నస్రీన్ మొహమదీ పేరుతో చిత్రకళా ప్రదర్శనకు తనవంతుగా సేవలందించారు. ‘ఈ గుర్తింపు నాకు మంచి వేదిక. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు స్థానికంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎంతోమందికి మేలు చేస్తుంది...’ అని చెబుతున్నారామె.