close

తాజా వార్తలు

మగవాళ్లైనా... సిగ్గుపడట్లేదు!

నెలసరి సమస్య... దీనిగురించి చెప్పడానికి మహిళలే ఇబ్బందిపడతారు. అలాంటిది కొందరు యువకులు ఎటువంటి బిడియం లేకుండా న్యాప్‌కిన్లు వాడండంటూ పంచుతున్నారు. పల్లెలు, మురికివాడల్లోని అతివలకు పరిశుభ్రతపై పాఠాలు చెబుతున్నారు. వారే కమల్‌ నాయక్‌, నయన్‌ సైకియా, చిత్రాంశ్‌ సక్సేనా. ఇంతకీ వాళ్లేం చేస్తున్నారంటే...


మరో ప్యాడ్‌మ్యాన్‌ నయన్‌

అతనిపేరు నయన్‌ సైకియా. ఊరు అసోం. శానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేస్తూ... వాళ్లకు వాటి తయారీలో ఉపాధీ అందిస్తున్నాడు.

మొదటినుంచీ చదువుల్లో చురుకు నయన్‌. అతని స్వస్థలం అసోం చారియాలీ జిల్లా, గొరిహగీ. ఊళ్లోని మహిళలు అనారోగ్యాలపాలవడం గమనించిన అతను వైద్యులను కలిసి కారణాలు అడిగేవాడు. నెలసరి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే సమస్య అని వైద్యులు చెప్పడంతో వాళ్లకు ఏదైనా చేయాలనున్నాడు. ఓ వైపు దీని గురించి ఆలోచిస్తూనే హోటల్‌ మేనేజిమెంటు కోర్సు పూర్తి చేసి, బెంగళూరు ఐటీసీ హోటల్‌లో చేరాడు. సెలవులకు వచ్చినప్పుడు ఊళ్లోని మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారినా పడటం గమనించి... స్త్రీల ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించాలనుకున్నాడు.
14 ఏళ్లక్రితం... ప్యాడ్‌మ్యాన్‌గా పేరొందిన అరుణాచలం గురించి చదివిన నయన్‌ తమిళనాడు వెళ్లి అతడిని కలుసుకున్నాడు. న్యాప్‌కిన్‌ తయారీ తెలుసుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరెళ్లిపోయాడు. ఇది తెలిసి బంధువులు, ఊరివాళ్లు విమర్శించారు. ఎవరెన్ని అన్నా...  స్థానిక బ్యాంకు నుంచి ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకుని... అవసరమైన ముడిసరుకును తమిళనాడు నుంచి తెప్పించుకున్నాడు. పదహారేళ్లక్రితం యూనిట్‌ ప్రారంభించాడు.  
మహిళల్లో మార్పు... ప్రస్తుతం ఈ యూనిట్‌ ద్వారా రోజుకి మూడువేల న్యాప్‌కిన్లు తయారుచేస్తున్నాడు. ఒక్కోదాన్ని మూడురూపాయలకు అమ్ముతున్నాడు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకూ కొన్ని వందల గ్రామాల్లోని మహిళల జీవితాల్లో మార్పు తెచ్చాడు. స్థానిక స్వయం ఉపాధి సంఘాల సభ్యులు సొంతంగా న్యాప్‌కిన్ల తయారీ యూనిట్లను ప్రారంభించేలా శిక్షణ  ఇస్తున్నాడు. అవసరమైన వారికి బ్యాంకునుంచి రుణాలూ ఇప్పిస్తున్నాడు. ‘నిరుపేద మహిళల కోసమే దీన్ని ప్రారంభించా. నా ప్రయత్నాన్ని గుర్తించిన అసోం ప్రభుత్వం స్టేట్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌’ ప్రాజెక్టులో మమ్మల్ని భాగస్వాముల్ని చేసింది. ప్రతి గ్రామంలో మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్లపై అవగాహనతోపాటు తయారీలో శిక్షణనివ్వడానికి మమ్మల్ని అధికారపూర్వకంగా నియమించింది...’ అని చెబుతాడు నయన్‌.


ప్రత్యేకంగా ప్యాడ్‌బ్యాంక్‌

అతనిపేరు చిత్రాంశ్‌. ఊరు ఉత్తర్‌ప్రదేశ్‌. స్వస్థలం బరేలీలోని పేద మహిళలకు ‘ప్యాడ్‌ బ్యాంక్‌’ ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లను అందజేస్తున్నాడు.

బరేలీలోని శాస్త్రినగర్‌లో చాలా కుటుంబాలు ఫుట్‌పాత్‌లపైనే ఉంటాయి. పలు స్వచ్ఛంద సంస్థలు వారికి సాయం చేసేవి. చిత్రాంశ్‌ మాత్రం అక్కడి  బాలికలు, మహిళలకు నెలసరిలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన కల్పించాలనుకున్నాడు. స్నేహితుడు అనాఖాన్‌తో కలిసి పహర్‌గంజ్‌లోని మహిళలతో మాట్లాడటానికి సిద్ధమయ్యాడు. ఓ రోజు సమావేశం  ఏర్పాటుచేస్తే... ఆ మహిళలు వాడి పారేసే కాటన్‌ వస్త్రాలు, పాలిథీన్‌, కాటన్‌, జనపనారలు... ఇలాంటి అపరిశుభ్రమైన వాటిని తమ నెలసరి సమయంలో ఉపయోగిస్తారని తెలుసుకున్నాడు. వాటివల్ల ఎదురయ్యే ఇన్‌ఫెక్షన్లను వివరిస్తూనే వచ్చినవారందరికీ ఉచితంగా ప్యాడ్‌లను అందించాడు. అప్పటినుంచీ న్యాప్‌కిన్లను పంచడం మొదలుపెట్టాడు.  
వివరాలు తెలుసుకుని... ప్రస్తుతం 19 ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే మహిళలు, విద్యార్థినులకు న్యాప్‌కిన్లు పంచుతున్నాడు చిత్రాంశ్‌. ఇందుకోసం ఓ ప్యాడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశాడు. ప్రతినెలా ఎనిమిది శానిటరీ న్యాప్‌కిన్లను ఉచితంగా అందిస్తాడు. ఆ మహిళ, బాలికకు సంబంధించిన నెలసరి సమాచారాన్ని నమోదు చేసుకుంటాడు. ఆ ప్రకారం వారికి నెలనెలా టంచనుగా న్యాప్‌కిన్లు వెళ్తాయి. అత్యవసర సమయంలో ఫోన్‌ చేసినా వాటిని సరఫరా చేస్తారు.
గొడవపడినా...  కుటుంబసభ్యులు సహకరిస్తున్నా... మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు.  మురికివాడల్లోని మహిళలను కలవడానికి వెళ్లినప్పుడు వారి భర్తలు రానిచ్చేవారు కాదు. నెలసరి విషయాలు ఆడవాళ్లతో ఎలా చర్చిస్తారని గొడవపడేవారు. వృద్ధుల్లో కొందరు వద్దంటూ అడ్డుపడేవారు. ఎవరెన్ని అన్నా... చిత్రాంశ్‌  మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఇప్పుడు ప్రతి నెలా మహిళలే నేరుగా చిత్రాంశ్‌ బృందాన్ని సంప్రదిస్తున్నారు. ‘ప్రస్తుతం నా బృందంలో పదిహేను మంది సభ్యులున్నారు. 19 పంపిణీ కేంద్రాలున్నాయి. మొదట్లో ఉచితంగా ఇచ్చినా... ఇప్పుడు ఒక్కో ప్యాడ్‌ని రెండురూపాయల చొప్పున అందిస్తోంది మా బృందం. రుతుక్రమం చుట్టూ అల్లుకున్న మూఢనమ్మకాలను తొలగించడమే మా ధ్యేయం...’ అని చెబుతాడు చిత్రాంశ్‌.


పరిశుభ్రత పట్ల అవగాహన

అతని పేరు కమల్‌ నాయక్‌. ఊరు ఒడిశా. ‘గుడ్‌ యూనివర్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి నెలసరి సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నాడు.

మొదటినుంచీ కమల్‌కు సేవ చేయడమంటే ఇష్టం.   హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘వి ఛేంజ్‌ యూ’ అనే  ఎన్జీవో ద్వారా రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. సామాజిక సేవలోనే సంతృప్తి ఉందని తెలుసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సు చేశాడు.   క్షేత్ర శిక్షణలో భాగంగా మురికివాడల ప్రజల స్థితిగతులను తెలుసుకున్నాడు. కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్నాడు. అప్పుడే   మహిళలు నెలసరి సమయంలో శానిటరీ న్యాప్‌కిన్లకు   బదులుగా సాధారణ వస్త్రాలు వాడతారని అర్థం చేసుకున్నాడు. వ్యక్తిగత పరిశుభ్రతపై కొందరు మహిళా స్నేహితులతో కలిసి అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాడు. మహిళలకు నమ్మకం కలిగి, ఈ కార్యక్రమాలకు రావడంతో 2016లో గుడ్‌ యూనివర్స్‌ సంస్థను ప్రారంభించాడు.
పలు ప్రాంతాల్లో... ఒక్క హైదరాబాద్‌ మాత్రమే కాదు, ఆంధ్ర]ప్రదేశ్‌లోని కాకినాడ,  విజయవాడ, తెలంగాణలో సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాడు. మెన్‌స్ట్రువల్‌ కప్‌లు, ఎకోఫ్రెండ్లీ ప్యాడ్ల వినియోగంపైనా ప్రచారం చేస్తున్నాడు. ‘మా సంస్థ నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు, సైకాలజిస్టులే కాదు... మగవాళ్లు, పాఠశాలల్లో బాలురూ ఉంటారు. ఇప్పటివరకూ ఎంతోమంది మహిళల్లో మార్పు తెచ్చాం. నా ప్రయత్నానికి గుర్తింపుగా 2017లో యూఎన్‌ ఫెలో ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌, ఇంపాక్ట్‌ ఆఫ్‌ క్లైమాటిక్‌ ఛేంజ్‌ ఆన్‌ విమెన్‌ అవార్డులు వచ్చాయి. వీలైనంతమందికి సాయం చేయడమే నా లక్ష్యం...’ అని చెబుతాడు కమల్‌.

-కాసాల ప్రశాంత్‌ గౌడ్‌, ఈనాడు డిజిటల్‌ హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.