close

తాజా వార్తలు

Published : 20/11/2019 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన అమ్మమ్మ ఇల్లు అక్కడే!

అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక! అమ్మమ్మ పుట్టిల్లు.. అదీ  సులభంగానే తెలుస్తుంది. మరి వాళ్ల అమ్మమ్మమ్మమ్మ పుట్టిల్లు ఎక్కడంటే..? తెలుసుకొని ఏం చేస్తామండి? అంటారా.. ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలు వేసుకున్నారు.. తీగ లాగారు.. ఓ జన్యువు దొరికింది. దాన్ని కదిలించి అమ్మమ్మలగన్న అమ్మమ్మ కథ తెలుసుకున్నారు..

అమ్మమ్మ ఇల్లంటే మనకెందుకంత ఇష్టం? ఎందుకేంటి... అమ్మ ఆనందంతో పరుగులు పెట్టి, కలియ తిరిగిన ఇల్లది. ఆ మాటకొస్తే మనం పుట్టిన ఇల్లు కూడా అదే! సరే... మన అమ్మమ్మ గురించి, ఆ ఇంటి గురించి అయితే మనకు కొంత తెలుసు. మరి ఎప్పుడైనా అమ్మని వాళ్ల అమ్మమ్మ గురించి అడిగారా? అడిగితే తనకు గుర్తున్న జ్ఞాపకాలేవో చెబుతుందేమో. అక్కడ నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్లడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? కష్టమే..ఎంత ప్రయత్నించినా మహా అయితే ఓ ఐదు తరాలు వెనక్కి వెళ్లగలమేమో అంతే.. ఆపై కష్టమే. కానీ శాస్త్రవేత్తలు ఆ పని చేశారు. సుమారుగా రెండు లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్లి మన అమ్మమ్మ ఎవరో తెలుసుకున్నారు. పట్టుమని వంద సంవత్సరాల క్రితం సరిగ్గా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ రెండు లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? అనేగా మీ సందేహం. నిజమే... కానీ సైన్స్‌ సాయంతో మన పూర్వీకులు ముఖ్యంగా మన అమ్మమ్మకు చెందిన వంశక్రమాన్ని కనిపెట్టారు. ఈ క్రమంలో వాళ్లకు ఉపయోగపడిన మహా ఆయుధం పేరే ‘మైటోజినోమ్‌’. టైం క్యాప్సూల్‌గా చెప్పుకొనే ఈ జన్యువు వారికెలా సహకరించిందో తెలుసుకుందాం.

అక్కడ నుంచి వలసవచ్చాం...

మెక్గాడీక్గాడీ... ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పుకయ్యలున్న ప్రాంతంగా ప్రసిద్ధి చూడ్డానికి ఎడారిని తలపించే ఈ ఉప్పుకయ్యలు ఆఫ్రికా ఖండంలోని బోట్సువానా దగ్గరున్న కలహారి ఎడారిని ఆనుకుని ఉంటాయి. మరోపక్క ఒకవాంగు అనే పచ్చని డెల్టాలో ఈ ప్రాంతం ఒక భాగం కావడం విశేషం. భిన్నమైన భౌగోళిక పరిస్థితులుండే ప్రాంతాన్ని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది వస్తుంటారు. ప్రస్తుతం మానవ నివాసానికి అనువుగా లేని ఈ ఉప్పుకయ్యలు, ఎడారి కలగలసిన ప్రాంతమే మన పూర్వీకురాలు అయిన ‘మైటోకాండ్రియా ఈవ్‌’ పుట్టిల్లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ నుంచే మనమంతా వచ్చాం అనడానికి శాస్త్రవేత్తలు చూపిస్తున్న బలమైన ఆధారమే మైటోకాండ్రియా డీఎన్‌ఏ.

ప్రఖ్యాత ‘నేచర్‌’ మ్యాగజైన్‌ వెలువరించిన తాజా కథనం ప్రకారం... ఆధునిక మానవజాతి అయిన హోమోసేపియన్ల కన్నా ముందు ఈ భూమ్మీద చాలా జాతులుండేవి. ఆ జాతులన్నీ దాదాపుగా అంతరించి పోయి ఇప్పుడు మిగిలిన జాతే హోమోసేపియన్లు. వీళ్లు మొదట నివసించింది బోట్సువానాలోని మెక్గాడీక్గాడీ ప్రాంతంలోనే. అప్పట్లో ఈ ప్రాంతం ఇలా ఎడారిలా ఉండేది కాదు. పచ్చగా, వివిధ జీవజాతులతో అలరారేది. పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా.. ఆ ప్రాంతంలో వర్షాభావం తలెత్తింది. అదే సమయంలో తక్కిన ప్రాంతాల్లో వర్షాలు పడి.. పచ్చగా మారడం, వేటకు అనువుగా మారడంతో అక్కడ నుంచి హోమోసేపియన్లు వలస పోవడం మొదలుపెట్టారు. అందులో రెండు తెగలు వేర్వేరు దిశలుగా వెళ్లి ఆసియా, యూరప్‌ ఖండాలతో సహా అనేక చోట్ల స్థిరపడి వేల సంవత్సరాల కాలంలో అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తమ రంగు, రూపు మార్చుకున్నారు. బోట్సువానాలోనే మిగిలిపోయిన మరో తెగ ఆ దగ్గర్లోనే ఉన్న నదీతీరంలో స్థిరపడిపోయింది. అదే కొయిసేన్‌ తెగ. ప్రత్యేకమైన మైటోకాండ్రియా డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే ప్రపంచంలో వేర్వేరు చోట్ల స్థిరపడిన మనకీ, కొయిసేన్‌ తెగకి మూలం ఒకే పూర్వీకురాలు అని తెలిసింది. మామూలు డీఎన్‌ఏకీ , మైటోకాండ్రియా డీఎన్‌ఎకీ ఉన్న తేడా ఏంటి? తెలుసుకుందాం.

మైటోకాండ్రియా డీఎన్‌ఏ ప్రత్యేకత ఏంటి?

మైటోకాండ్రియా.. పదోతరగతితో మనమంతా ఈ బొమ్మను గీసే ఉంటాం. ఈ మైటోకాండ్రియానే కణశక్తి భాండాగారం అని కూడా అంటారు. పవర్‌ హౌస్‌ అన్నమాట. శరీరంలోని కణాలకి అవసరం అయిన శక్తినందించడంతోపాటు... మరో ప్రత్యేకమైన పని కూడా చేస్తుందీ మైటోకాండ్రియా. కొన్ని ప్రత్యేకమైన జన్యువులని మన పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా అందిస్తుంది. ఒక తరం నుంచి మరోతరానికి జన్యువులు రావడంలో కొత్త లేదు. కానీ మైటోకాండ్రియా డీఎన్‌ఏకు మరో ప్రత్యేకత ఉంది. తల్లి నుంచి బిడ్డకు అందే ఈ జన్యువు వేల సంవత్సరాలయినా సరే సంకరం చెందకుండా మొదటి తల్లి గురించిన సమాచారాన్ని జన్యువుల రూపంలో అందిస్తూనే ఉంటుంది. అందుకే దీనిని ‘తల్లుల గుట్టు చెప్పే టైం క్యాప్సూల్‌’ జన్యువు అనీ, ‘ఎమ్‌టీ డీఎన్‌ఏ’ అనీ అంటారు. బైబిల్‌లో తొలి మహిళగా చెప్పుకొనే ఈవ్‌ తెలుసుగా. ఆ పేరుతోనే కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ అలాన్‌ విల్సన్‌ ‘మైటోకాండ్రియా ఈవ్‌’ సిద్ధాంతాన్ని మొదటిసారి వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ రకంగా మన అందరి అమ్మమ్మ పేరు ‘మైటోకాండ్రియా ఈవ్‌’గా మారింది.

వంశవృక్షాన్ని తయారుచేశారు...

సిడ్నీ విశ్వవిద్యాలయం, గార్వాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలో జన్యు పరిశోధకురాలు వానెస్సా హాయెస్‌ ఈ పరిశోధనలకు నాయకత్వం వహించారు. ఇందుకోసం నమీబియా, బోట్సువానాల్లో స్థిరపడి కొయిసేన్‌ భాష మాట్లాడే 200 మంది ప్రజల డీఎన్‌ఏతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యిమంది ప్రజల డీఎన్‌ఏలను సేకరించి మైటోజినోమిక్‌ వంశవృక్షాన్ని రూపొందించారు. ఇదే బృందానికి చెందిన వాతావరణ నిపుణుడు టిమ్మర్‌మేన్‌ అప్పటి వాతావరణ పరిస్థితులని అంచనా వేశారు. అక్కడ వర్షాభావ పరిస్థితులు తలెత్తి ఎడారిగా మారిన కాలం, హోమోసేపియన్లు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వలసలు వెళ్లిన కాలం ఒకటే కావడంతో ఈ బృందం బోట్సువానాని మన అమ్మమ్మమ్మమ్మమ్మ ఇల్లుగా గట్టిగా నమ్ముతోంది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని