close
కోడెల మృతికి ప్రవాసాంధ్రుల సంతాపం

వాషింగ్టన్‌ డీసీ: ఏపీ మాజీ సభాపతి, తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు మృతి పట్ల పలువురు ప్రవాసాంధ్రులు సంతాపం తెలిపారు.   వాషింగ్టన్‌ డీసీలో ఏర్పాటు చేసిన కోడెల సంతాప సభలో తెదేపా సీనియర్‌ నాయకులు మన్నవ సుబ్బారావుతో పాటు పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొని కోడెల చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి కోడెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కోడెలతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తానా మాజీ అధ్యక్షులు సతీశ్‌ వేమన మాట్లాడుతూ..కోడెల మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వైద్యుడిగా ఆయన ప్రజలకు చేసిన సేవలు మరువలేనివన్నారు. విదేశీ పర్యటన సమయంలో రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులను కోరారని తెలిపారు. వివిధ అంశాలపై కోడెల చేసిన ప్రసంగాలు ఆకట్టుకునేవన్నారు. ఎంతో ధైర్యవంతుడైన కోడెల తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడటం బాధ కలిగించిందన్నారు. ప్రవాసాంధ్రుల తరఫున కోడెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. 

తెదేపా సీనియర్‌నేత మన్నవ సుబ్బరావు మాట్లాడుతూ... కోడెల మృతి తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. రాజకీయ రంగంలో ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త వహించాలన్నారు. వైద్య వృత్తిని వదిలి పెట్టి అన్నగారి పిలుపు మేరకు కోడెల రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. 35 సంవత్సరాల రాజకీయ  జీవితంలో ఎన్నో పదవులను అధిరోహించారన్నారు. సత్తెనపల్లి నియోజక వర్గంలో కోడెల చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో నమోదయ్యాయని తెలిపారు. మంచి మనసున్న కోడెలకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగులూరు భాను మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  కోడెలతో కలిసి ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. సుధీర్‌ కొమ్మి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ వేధింపులు మంచిది కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హుందాతనాన్ని పెంచే విధంగా వ్యవహరించాలన్నారు. కోయా రమాకాంత్‌, ఉప్పలపాటి అనిల్‌, కృష్ణా లాం, యన్‌.ఆర్‌.సి నాయుడు, గోరంట్ల వాసుబాబు, సూరపనేని సత్య, అమిరినేని గౌతం తదితరులు సంతాప సభలో పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని