close
న్యూజెర్సీలో పెట్టుబడులు పెట్టండి

భారత్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తాం
‘ఈనాడు’తో న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని న్యూజెర్సీలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని ఆ నగర గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ తెలిపారు. వారికి సౌకర్యంగా ఉండేందుకు భారత్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మేకిన్‌ అమెరికా అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పటంలో అర్ధం లేదని, తాము ఇంకా కచ్చితత్వాన్ని సాధించలేదని ఫిల్‌ మర్ఫీ అభిప్రాయపడ్డారు.

భారత్‌లో న్యూజెర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారా?
అవును.మా నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి సౌకర్యాలు, సౌలభ్యాలు కల్పించేందుకు భారతదేశంలో న్యూజెర్సీ కేంద్రాన్ని  ఏర్పాటు చేస్తున్నాం. ఆసియాలోని ఏ దేశంలోనూ మా కేంద్రం లేదు.ఇది కీలక మలుపుగా భావిస్తున్నాం.

దక్షిణాది నుంచి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి పరిశ్రమలను కోరుకుంటున్నారు?
టెక్నాలజీ, ఫార్మా రంగంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇన్నోవేషన్స్‌లోనూ దూసుకుపోతున్నాయి. సినీ రంగంలోనూ హాలీవుడ్‌ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ రంగాల నుంచి పెట్టుబడులను కోరుకుంటున్నాం. అక్కడి మా ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.ఆయా రంగాల నిపుణులు ఇక్కడ ఎక్కువ. వారిని అక్కడికి ఆహ్వానించటం ద్వారా మేమూ లబ్ధిపొందుతాం.

న్యూజెర్సీలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలి?
‘న్యూజెర్సీ నగరంతో భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. మా నగర జనాభాలో దాదాపు సగం మంది భారతీయులే. మా నగర జనాభా 90 లక్షలు కాగా వారిలో భారతీయులు 43 లక్షల మంది. అమెరికాలోని ఏ నగరంలోనూ ఇంత పెద్దసంఖ్యలో భారతీయులను మీరు చూడరు. భారతీయుల కంపెనీలూ ఎక్కువే. పరిశ్రమలకు అనువైన ప్రాంతం. అన్నింటికీ అందుబాటులో ఉంటుంది. సినిమాలు తీసేందుకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. సినిమాలు తీసేవారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తున్నాం.

వార్తలు / కథనాలు

మరిన్ని