close
విదేశీ బాటలో భారతం

విదేశాలకు వెళుతున్న వారిలో మనమే టాప్‌

దిల్లీ: విదేశాలకు వలస వెళ్లే వారిలో భారతీయులే ముందంజలో ఉన్నారు. 2019కిగానూ ఐరాస విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశంనుంచి మరొక దేశానికి వలస వెళ్లిన వారి సంఖ్య 272 మిలియన్లకు చేరిందని ఆ నివేదిక తెలిపింది. ‘ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019’ను ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం తాజాగా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల ప్రజల వయసు, ప్రాంతం తదితర అంశాల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేశారు. 

అంతర్జాతీయంగా వలస వెళ్లిన వారిలో మూడో వంతు ప్రజలు పది దేశాలకు చెందినవారే ఉండటం గమనార్హం. 2019లో ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 17.5 మిలియన్ల మంది విదేశాల్లో ఉన్నారు..ఈ జాబితాలో భారత్‌ మొదటి వరుసలో ఉంది. తర్వాతి స్థానాల్లో 11.8 మిలియన్ల మందితో మెక్సికో, 10.7 మిలియన్ల మందితో చైనా ఉన్నాయి. ఇక రష్యా(10.5మిలియన్లు), సిరియా(8.1మిలియన్లు), బంగ్లాదేశ్‌(7.8మిలియన్లు), పాకిస్థాన్‌(6.3మిలియన్లు), ఉక్రెయిన్‌(5.9మిలియన్లు), ఫిలిప్పీన్స్‌(5.4 మిలియన్లు), అఫ్గానిస్థాన్‌(5.1 మిలియన్లు) టాప్‌ 10 స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌ 2019లో 5.1 మిలియన్ల మంది విదేశీయులకు ఆశ్రయమిచ్చింది. ఇందులో 48.8శాతం మంది మహిళలే ఉన్నారు. ఇక ఈ విదేశీయుల సగటు వయసు 47 సంవత్సరాలు. 2015లో 5.2 మిలియన్ల మంది భారత్‌కు వచ్చారు. ఇక మనదేశంలో 20,7000 మంది శరణార్థులు ఉన్నారు. 2010 నుంచి 2017 మధ్య ప్రపంచ వ్యాప్తంగా శరణార్థుల సంఖ్య 13 మిలియన్లు పెరిగింది.
 

వార్తలు / కథనాలు

మరిన్ని