close
మురళీమోహన్‌కు అక్కినేని జీవితసాఫల్య పురస్కారం

డిసెంబర్‌ 21న ప్రదానం

డాలస్, టెక్సాస్: ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్‌ను నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఏఎఫ్‌ఏ బోర్డు వెల్లడించింది. అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి సందర్భంగా డాలస్‌లోని అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా (ఏఎఫ్‌ఏ) బోర్డు సమావేశమై.. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పలు పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఏఎఫ్‌ఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ.. అక్కినేనితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997, 2012లో టెక్సాస్‌కు ఆహ్వానించడంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్‌ తోటకూర నాయకత్వంలోనే 2014లో ఏఎఫ్‌ఏ సంస్థ ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకొన్నామన్నారు. ఈ ఏడాదిలో డిసెంబర్‌ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ఏవీఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో అక్కినేని ఆరో అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 

ఈ ఏడాది అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు వీళ్లే.. 
జీవిత సాఫల్య పురస్కారం – మాగంటి మురళీ మోహన్, సినీ నటులు, మాజీ ఎంపీ 
విద్యా రత్న –  పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్
సినీ రత్న – ‘మహానటి’ చిత్ర బృందం  
వ్యాపార రత్న-  డా. సూరపనేని విజయ కుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు  
రంగస్థల రత్న – పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి
వైద్య రత్న -  డాక్టర్ ముళ్లపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి 
సేవా రత్న – “మన కోసం మనం ట్రస్ట్” – చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమష్టి కృషి
వినూత్న రత్న –  సత్తిరాజు శంకర నారాయణ, ప్రముఖ పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్  
యువ రత్న –  ఫణికెర క్రాంతి కుమార్, సాహస వీరుడు

ఈ సమావేశంలో బోర్డు అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళీ వెన్నం, రావు కల్వల, డా.సి.ఆర్.రావు.. అక్కినేని నాగేశ్వరరావుతో తమకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా తెలుగు ప్రజలకు సుప్రసిద్ధుడని కొనియాడారు. ఆయన తుది శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికాలోని తనతో పాటు మరికొందరు మిత్రులు కలిసి  
“అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” సంస్థను ఏర్పాటుచేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. అక్కినేని ఓ చిన్న కుగ్రామంలో అతిసాధారణమైన కుటుంబంలో జన్మించారని, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, దూరదృష్టితో అద్భుతమైన వ్యక్తిగా ఎదిగారన్నారు. అలాంటి లక్షణాలను అలవర్చుకుంటే జీవితంలో రాణించవచ్చనే దిశగా నేటి యువతలో ప్రేరణ కల్గించాలనే సంకల్పంతోనే ఏటా డిసెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 2014లో
గుడివాడ, 2015లో హైదరాబాద్‌, 2016లో చెన్నై, 2017లో ఏలూరు, 2018లో కరీంనగర్‌లో నిర్వహించామని వివరించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని