close
నమస్తే..సారీ మోదీజీ!

ప్రధానిని ఉద్దేశించి తులసీ గబ్బార్డ్‌ 

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగే ‘హౌదీ-మోదీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్‌.. ప్రధాని మోదీ రాకను స్వాగతించారు. అయితే, హౌదీ-మోదీ కార్యక్రమానికి ఆమె కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు.

‘నమస్తే!..ప్రధాని మోదీకి స్వాగతం. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం నేను హౌదీ-మోదీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. ముందస్తు ప్రణాళికల కారణంగా ఆ సమావేశంలో భాగం కాలేకపోతున్నందుకు క్షమించండి. అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఈ కార్యక్రమం సందర్భంగా ఏకతాటిపై రావడం అభినందనీయం. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి. మన రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం ఇలాగే కొనసాగాలి. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలి’అంటూ వీడియో సందేశాన్ని పంపారు. హౌదీ మోదీ కార్యక్రమంలో తులసి కూడా పాల్గొననున్నారంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఉద్దేశించి ఆమె ట్వీట్‌ కూడా చేశారు. ఆ పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. హ్యూస్టన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు.

భారత సంతతికి చెందిన తులసి 2020 ఎన్నికల్లో అధ్యక్షపదవి కోసం పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. హవాయ్‌ నుంచి నాలుగు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున హౌస్‌ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎంపికయ్యారు. ఒక వేళ తులసి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడబోయే తొలి హిందువు ఈమే అవుతారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే... అధ్యక్ష పదవిదక్కిన అత్యంత పిన్న వయస్కురాలిగా, తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారు.

వార్తలు / కథనాలు

మరిన్ని