close
చలో బ్రిటన్‌

చదువు, కొలువు రెండూ అక్కడే
తెలుగు విద్యార్థుల ప్రత్యేక ఆసక్తి
రెండేళ్లపాటు ఉపాధి పొందే వెసులుబాటు
నిబంధనల మార్పుతో కన్సల్టెన్సీలకు అభ్యర్థుల తాకిడి

వేరే దేశం వెళ్లి చదువుకుంటున్నప్పుడు... చదువయ్యాక పని చేయాలని విద్యార్థులు కోరుకోవడం సహజం. బ్రిటన్‌లో విద్య పూర్తయ్యాక రెండేళ్లపాటు ఉపాధి పొందే వీలు కల్పిస్తామని అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశం వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగనుందని నిపుణుల అంచనా. వివరాలు అడిగేందుకు కన్సల్టెంట్లను ఆశ్రయిస్తున్నవారు తాజాగా పెరిగారు.

విద్యాభ్యాసం తర్వాత ఉపాధి వీసా విధానాన్ని 2012లో అప్పటి బ్రిటన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితం... అక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత అధికారిక ప్రకటనతో మళ్లీ మార్పు వస్తోంది. ఆ నిబంధన మే 2021 తర్వాత విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు వర్తిస్తుంది.

కొత్త ఊపు
* 2018లో ఫాల్‌ సీజన్‌కు (సెప్టెంబరు-అక్టోబరు) 10 మందిని పంపించగా ఈసారి 100 మంది వరకు పంపిస్తున్నామని గుంటూరుకు చెందిన వరల్డ్‌వైడ్‌ ఈడీయూ కన్సల్టెన్సీ ఎండీ ఉడుముల వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. స్ప్రింగ్‌ సీజన్‌కు   (జనవరి, ఫిబ్రవరి) ఆ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.
* గతంలో వేరే దేశాలకు వెళ్లాలనుకుని వీసాలు లభించక వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు బ్రిటన్‌కు సంబంధించిన వివరాలను అడుగుతున్నారని దేశవ్యాప్తంగా శాఖలు కలిగిన రియా కన్సల్టెన్సీ ప్రతినిధి కిరణ్‌జ్యోతి వెల్లడించారు.
* ఈసారి స్ప్రింగ్‌కు తమ కన్సల్టెన్సీ తరఫున   25-30 మంది వరకు వెళ్తున్నట్లు బ్రిడ్జి కన్సల్టెన్సీ ప్రతినిధి తులసి పేర్కొన్నారు. గతంలో ఈ సంఖ్య ఐదులోపే  ఉండేదని వెల్లడించారు.

వీసాలు తేలిక..
తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో చదువుకు వెళ్లే 95% విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్ని కోరుకుంటారు. ఇతర దేశాలకు వెళ్లాలంటే ఐఎల్‌టీఎస్‌లో 6.0 నుంచి 6.5 స్కోరు తప్పనిసరి. బ్రిటన్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు పది, ఇంటర్‌లో ఆంగ్లం సబ్జెక్టులో 72% కంటే ఎక్కువ మార్కులు వస్తే ఆయా పాఠశాలలు, కళాశాలలు ఇచ్చే లేఖల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

వార్తలు / కథనాలు

మరిన్ని