close
మోదీ సంస్కరణలు భేష్‌: ట్రంప్‌

నేనొస్తా.. జాగ్రత్త!

ఎన్‌బీఏ బాస్కెట్‌ బాల్‌ గేమ్‌ను వచ్చే ఏడాది ముంబయిలో నిర్వహించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ‘‘ప్రధాని గారూ దానికి నన్ను ఆహ్వానిస్తారా? నేనొస్తా కావొచ్చు. జాగ్రత్త. నేనొచ్చే అవకాశముంది’’ అంటూ ఆయన నవ్వగా.. మోదీ కూడా చిరునవ్వులు చిందించారు.

భారత్‌, అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకుగాను ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. మోదీని గొప్ప నాయకుడిగా, ప్రపంచ సేవకుడిగా ఆయన అభివర్ణించారు. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగిస్తూ.. ‘‘భారత్‌తోపాటు ప్రపంచమంతటికీ మోదీ గొప్ప సేవ చేస్తున్నారు. భారత అత్యున్నత విలువలు, సంస్కృతి అమెరికా విలువలతో కలిసిపోతాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలోపేతమయ్యాయి. ప్రపంచానికి మనం మార్గనిర్దేశనం చేస్తున్నాం. అమెరికా సమాజంలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో మేం 1.40 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాం. పన్నుల హేతుబద్ధీకరణతో కొత్త ఉద్యోగాలు సృష్టించాం. ఒహైయోలో భారత కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారత్‌ పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో తయారైన అత్యుత్తమ వస్తువులు భారతీయులకు అందుబాటులో ఉంటాయి. భారత ఇంధన అవసరాలకు అమెరికా అండగా నిలుస్తుంది. టెక్సాస్‌ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులు భారత్‌కు అందుతాయి’’ అన్నారు.

‘‘భారత్‌, అమెరికా రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయి. సరిహద్దు భద్రత అనేది మన ఇరుదేశాలకు అత్యంత ప్రాధాన్య అంశం. సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తాం. ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తాం. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా త్వరలో పలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటాం. భారత సంతతి అమెరికన్లు అమెరికా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారు. శాస్త్ర-సాంకేతిక, ఆర్థిక రంగాల్లో వారి కృషి ప్రశంసనీయం. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు ఇరుదేశాలను నూతన పథంలోకి నడిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణలతో 30 లక్షల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించింది. 40 కోట్ల మంది బలమైన మధ్య తరగతి భారత్‌ ఆస్తి. ఈ సభకు 50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకం.    ఇది హృదయం ఉప్పొంగే రోజు’’ అని 25 నిమిషాలపాటు సాగిన తన ప్రసంగంలో ట్రంప్‌ పేర్కొన్నారు.

సప్తస్వర రాగరంజితం సంస్కృతీ ‘భారతీయం’
‘హౌడీమోదీ’ ర్యాలీకి తరలి వచ్చిన ప్రవాసభారత జనవాహినితో ఎన్‌ఆర్‌జీ స్టేడియం సంతోష సాగరమైంది. మోదీ ప్రసంగానికి ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమం అక్కడి భారత సమాజం అమెరికా జీవనసౌందర్యమాధుర్యాన్ని ఆస్వాదించి వారితో మమేకమైన తీరును కళ్లకు కట్టింది. దాదాపు 90 నిముషాల పాటు ఎన్‌ఆర్‌జీ స్టేడియం సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన సుసంపన్న భారత సంస్కృతి స్టేడియంలో వెల్లివిరిసింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాల విభిన్న సంస్కృతులను కళ్లకు కడుతూ నాలుగువందల మంది కళాకారుల అద్భుత ప్రదర్శనలు ఆహూతులను కట్టిపడేశాయి. పంజాబీ గుర్వాణీ, మహారాష్ట్రకే ప్రత్యేకమైన నాసిక్‌ఢోల్‌, గుజరాత్‌ గాయని ఫల్గుణీపాథక్‌ బృందం సంగీతం,  నాట్యాలు.. ఇలా రాష్ట్రాల విభిన్న సంస్కృతులు ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ‘ఇంద్రధనుస్సు’ వర్ణాలై మెరిశాయి.

వార్తలు / కథనాలు

మరిన్ని