close
‘హౌడీ-మోదీ’పై అమెరికన్‌ మీడియా ఏమందంటే..!

హ్యూస్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హ్యూస్టన్‌లో ఒకే వేదికను పంచుకోవడం భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న సంబంధాలకు నిదర్శనమని అమెరికా మీడియా పేర్కొంది. చైనాతో విభేదాల నేపథ్యంలో భారత్‌తో అమెరికా వ్యూహాత్మక మైత్రిని ఈ సమావేశం నొక్కిచెబుతోందని ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌(డబ్ల్యూఎస్‌జే) అభిప్రాయపడింది. బరాక్‌ ఒబామా నుంచి ప్రారంభమైన ఈ పరంపరను ట్రంప్‌ కొనసాగిస్తున్నారని తెలిపింది. అలాగే అమెరికా వృద్ధిలో ఇండియన్‌ అమెరికన్ల పాత్రను గుర్తించిన ట్రంప్‌ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషించింది. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో వీరి ఓట్లను రాబట్టడమే ట్రంప్‌ వ్యూహమని డబ్ల్యూఎస్‌జే రాసుకొచ్చింది. 

ఇక మరో ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ట్రంప్‌, మోదీ మధ్య సారూప్యతలను ప్రస్తావించింది. ఇరువురు నేతలు తమ దేశానికి పునర్‌వైభవం తీసుకొస్తామంటూ ఓటర్లను ఆకర్షించారని గుర్తుచేసింది. అలాగే సామాజిక, ఆర్థిక తప్పిదాల వల్ల నెలకొన్న ఆందోళనలకు పారదోలేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని వ్యాఖ్యానించింది. అయితే ఇండియన్ అమెరికన్ల ఓట్లను రాబట్టడం అంత సులువైన పనికాదని చివరగా న్యూయార్క్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. అలాగే రానున్న అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ.. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేసే దిశగా మోదీ వ్యవహరించారని వాషింగ్టన్‌ పోస్ట్‌ అభిప్రాయపడింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల్ని ఉద్దేశిస్తూ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేతలు ప్రసంగించడాన్ని చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది.

వార్తలు / కథనాలు

మరిన్ని