close
కలిసి సరికొత్త కశ్మీర్‌ని నిర్మిద్దాం: మోదీ

అమెరికాలోని కశ్మీరీ పండిట్లకు ప్రధాని పిలుపు 

హ్యూస్టన్‌: కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ అమెరికాలోని కశ్మీరీ పండిట్లు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీని వారు హ్యూస్టన్‌లో శనివారం కలిశారు. ‘నవకశ్మీర్‌’ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కశ్మీర్‌లో ఇక ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికీకరణ జరిగి యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని.. తద్వారా కశ్మీర్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘కశ్మీరీ పండిట్లు ఇప్పటి వరకు ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొన్నారు.. ఇక సరికొత్త కశ్మీర్‌ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని పిలుపునిచ్చారు. వారితో ముచ్చటించిన వీడియోను ట్విటర్‌ వేదికగా మోదీ పంచుకున్నారు.    

ఈ సందర్భంగా కశ్మీర్‌ పండిట్లను స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కార్యాచరణ రూపొందించేలా ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని వారు మోదీకి ఓ లేఖ అందజేశారు. కశ్మీర్‌ సంస్కృతి, సంప్రదాయాలకు పునర్‌వైభవం తీసుకువచ్చే దిశగా ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఈ రోజు సాయంత్రం అక్కడి ఇండో-అమెరికన్లను ఉద్దేశించి ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో ప్రసంగించనున్న విషయం తెలిసిందే.


వార్తలు / కథనాలు

మరిన్ని