close
హ్యూస్టన్‌ వేదికపై మోదీ నోట తెలుగుమాట

హ్యూస్టన్‌: హ్యూస్టన్‌ వేదికగా జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో భారతీయ భాషల గొప్పదనాన్ని ప్రధాని మోదీ ప్రపంచానికి వివరించారు. వివిధ భాషలు స్వేచ్ఛాయుత జీవనానికి ప్రతీకలని వ్యాఖ్యానించారు. అనేక భాషలు-సంస్కృతులు-ఒకేదేశం అనేది తమ విధానమని వివరించారు. అనేక ఆచారాలు, వేషధారణలు, పూజావిధానాలు భారత్‌ సొంతమని మన దేశ సంప్రదాయాల్ని చాటి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారత జీవన సంస్కృతి అని ఉద్భోదించారు. భిన్నత్వం, ప్రజాస్వామ్యం భారత్‌లోని కట్టుబాట్లకు నిదర్శనమని పేర్కొన్నారు. సభకు హాజరైన 50వేల మంది ఇండియన్‌ అమెరికన్లు భారతదేశ సంస్కృతికి ప్రతినిధులని కొనియాడారు. తాను 130కోట్ల మంది భారతీయుల తరఫున పనిచేసే సాధారణ వ్యక్తిని మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా హౌడీ మోదీ అని అడిగితే భారత్‌లో ‘అంతా బాగుంది’ అని చెబుతానని తెలుగు సహా పలు భాషల్లో సమాధానం ఇచ్చారు. ఎన్నో శతాబ్దాల నుంచి అనేక భాషలతో భారత్‌ పురోగమిస్తూ వస్తోందని ప్రధాని గుర్తుచేశారు.

దీంతో ఇటీవల ఒకే దేశం-ఒకే భాషపై దేశవ్యాప్తంగా చెలరేగిన వివాదానికి మోదీ హ్యూస్టన్‌ వేదికగా తెరదించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే 2017లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తనకు ఆయన కుటుంబాన్ని పరిచయం చేశారన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని ట్రంప్‌నకు పరిచయం చేస్తున్నానంటూ సభకు హాజరైన జనాన్ని మోదీ చూపించారు. దీంతో సభ ఒక్కసారిగా మోదీ, మోదీ నినాదాలు, కరతాళధ్వనులతో మార్మోగింది.


వార్తలు / కథనాలు

మరిన్ని