close
పాక్‌ ప్రధాని యుద్ధోన్మాదిలా మాట్లాడుతున్నారు

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు భారత్‌ కౌంటర్‌

న్యూయార్క్‌: ఐక్య రాజ్య సమితి సర్వసభ్య ప్రతినిధుల సభలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌ ప్రధాని యుద్ధోన్మాదిలా మాట్లాడారని ఐరాస వేదికగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విదిషా మైత్ర దుయ్యబట్టారు. ఐరాస గుర్తించిన 130 మంది ఉగ్రవాదులు, 25 ఉగ్ర సంస్థలు పాక్‌లో ఉన్న విషయాన్ని ఇమ్రాన్‌ ధ్రువీకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆల్‌ ఖైదాకు పింఛను ఇస్తున్న ఏకైక దేశం పాక్‌ అనే విషయాన్ని ఆ దేశం గుర్తించిందా అంటూ మండిపడ్డారు. న్యూయార్క్‌లో లాడెన్‌ను సమర్థించిన విషయాన్ని ఇమ్రాన్‌ ఖండిచగలరా? అని సవాలు విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

‘ముస్లింలు, ఇతరులు అని విభజించి ఇమ్రాన్‌ మాట్లాడుతున్నారు. పాక్‌ ప్రధాని ఐరాస సర్వప్రతినిధుల సభను ఉగ్రవాద ప్రచారానికి వాడుకున్నారు. ఆయన తన దేశం గురించి మాట్లాడకుండా ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు. పాక్‌ ఉగ్రవాదానికి ఊతంగా లేదని ప్రపంచ దేశాధినేతల ముందు ధైర్యంగా చెప్పగలరా?. భారత్‌లో మైనార్టీల స్వేచ్ఛాహక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి పాకిస్థాన్‌లో మైనార్టీల మాటేంటి?. 1947లో 23శాతం ఉన్న మైనార్టీ వర్గాన్ని ఈరోజు 3 శాతానికి చేర్చారు. క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, అహ్మదీయులు, షియాలు, సింధీలు, బలూచీల సంరక్షణ గురించి మాట్లాడరెందుకు?. మైనార్టీలు అక్కడ ఏ స్థాయిలో హింసకు గురవుతున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయి. మీ దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి జమ్మూకశ్మీర్‌లో ఉన్న జనాభా మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. పదే పదే ఆర్టికల్‌ 370 రద్దు గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్‌ అంశం భారత్‌ అంతర్గత వ్యవహారమని చెబుతున్నప్పటికీ పాక్‌ ప్రధాని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారెందుకు?’ అంటూ మైత్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఐరాస సర్వప్రతినిధుల సభలో ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నా భారత ప్రధాని మోదీ అంగీకరించడం లేదని ఆరోపించారు. కశ్మీర్‌లో అమానవీయ కర్ఫ్యూ విధించారని, దాన్ని ఎత్తివేయాలని భారత్‌ను డిమాండ్‌ చేశారు. ఇరుగు పొరుగున ఉన్న అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ మంచిది కాదంటూ యుద్ధ సంభాషణ చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని