close
కోడెల, మాజీ ఎంపీ శివ ప్రసాద్‌ సేవలు చిరస్మరణీయం

సంతాప సభలో న్యూజెర్సీ తెలుగుదేశం పార్టీ నేతలు

న్యూజెర్సీ:  ఇటీవల కన్నుమూసిన తెదేపా సీనియర్‌ నాయకులు  ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మాజీ ఎంపీ నారమల్లి శివ ప్రసాద్‌లకు అమెరికాలోని న్యూజెర్సీతెదేపా అభిమానులు నివాళులర్పించారు. కోడెల పెద్ద కర్మ సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో సంతాప సభ నిర్వహించారు. NATS మాజీ అధ్యక్షుడు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. డాక్టర్ కోడెల శివ ప్రసాద్‌తో తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.  నందమూరి తారక రామారావు అప్పట్లో కోడెల ప్రతిభని గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించారన్నారు. కోడెల అనేక కీలక శాఖలకు మంత్రిగా పని చేసి ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు.

అనంతరం పలువురు న్యూజెర్సీ ఎన్‌ఆర్‌ఐ తెలుగు దేశం నాయకులు ప్రసంగించారు. ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా కోడెల జన హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. కోటప్ప కొండ అభివృద్ధికి, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారని తెలిపారు.  మాజీ ఎంపీ శివ ప్రసాద్ సైతం రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపించారన్నారు. ఆయన మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలందించారని పేర్కొన్నారు. తెదేపా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇద్దరు మంచి వ్యక్తులను కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఇద్దరికీ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి మందాడి, రాజా కసుకుర్తి, రాధా కృష్ణ నల్లమల, వంశీ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్ వెనిగళ్ల, విష్ణు కనపర్తి, శ్రీ చౌదరి, నంద కల్లూరి, శ్రీనివాస్ ఓరుగంటి, సురేష్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేష్ బేతపూడి తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని